Civil Rights Commission
-
‘నక్సలిజాన్ని రూపుమాపేందుకు ఏం చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: నక్సలిజం సమస్యను రూపుమాపేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల వివరాలను ఓ నివేదిక రూపంలో తమ ముందుంచాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. ఇటీవల విశాఖ జిల్లా మాదినమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మావోయిస్టు భవానీని మెరుగైన చికిత్స నిమిత్తం మంచి వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి తరలించాలని హోంశాఖను ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను కూడా వివరించాలని సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎదురు కాల్పుల్లో ఎంతమంది పోలీసులు.. ఎంతమంది నక్సలైట్లు చనిపోయారో తెలియచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ‘పిల్’గా హెబియస్ కార్పస్ పిటిషన్ మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన తరువాత మావోయిస్టు పార్టీ అగ్రనేత అరుణ, భవానీ, గుమ్మిరేవుల మాజీ సర్పంచి నారాయణరావు ఆచూకీ తెలియడం లేదని, పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోందని, అందువల్ల వారిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత చిలుకా చంద్రశేఖర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ హెబియస్ కార్పస్ వ్యాజ్యాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా(పిల్) మారుస్తున్నామని స్పష్టం చేసింది. -
లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రీజనల్ కార్యదర్శి లింగయ్య మృతదేహానికి శుక్రవారం రీపోస్టుమార్టం నిర్వహించారు. గత నెల 31న లింగయ్యను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారంటూ ఆరోపిస్తూ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ అత్యవసర ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడంతో లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి విదితమే. ఈ మేరకు శుక్రవారం వేకువ జామున 3 గంటలకు లింగయ్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ పర్యవేక్షణలో ముగ్గురు ఫోరెన్సిక్ వైద్యులు సుమారు మూడు గంటల పాటు లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈ సమాచారం తెలుసుకున్న పలు ప్రజా సంఘాల ప్రతినిధులు గాంధీ మార్చురీ వద్దకు చేరుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్ నేతృత్వంలో గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజుల ఆధ్వర్యంలో పోలీసులు ఆస్పత్రి ప్రాంగణంలో భారీగా మోహరించారు. మీడియాను గాంధీ మార్చురీలోకి అనుమతించలేదు. పలు ప్రజాసంఘాల ప్రతినిధులు మార్చురీ వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు. పోలీసులపై విమలక్క, సంధ్య ఆగ్రహం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఐద్వా నేత సంధ్య పోలీసుల కళ్లు గప్పి రోగుల మాదిరిగా ఆటోల్లో ఆస్పత్రిలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి మార్చురీ వద్దకు వెళ్తున్న క్రమం లో గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లింగయ్య మృతదేహాన్ని కడసారి చూసేందుకు అనుమతించకపోవడంతో పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం అనంతరం లింగయ్య మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలానికి తరలించారు. 17 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు. విమలక్క, సంధ్య అరెస్టు అన్యాయం: రేణుకాచౌదరి లింగయ్య ఎన్కౌంటర్ సందర్భంగా శవాన్ని రీ–పోస్టుమార్టం చేస్తున్న ప్రాంతానికి వెళ్లిన అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్యలను అరెస్టు చేయడం అన్యాయమని మాజీ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని, అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. సామాజిక ఉద్యమకారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పోలీసు కాల్పుల పేరుతో ప్రాణాలను పొట్టన పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో రేణుక పేర్కొన్నారు. -
మేధావుల విడుదలకు పోరాడాలి: హరగోపాల్
హైదరాబాద్: ప్రజాస్వామ్య మేధావులు వరవరరావు, సాయిబాబా సహా 11 మంది విడుదల కోసం మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాలు రాజీ లేని పోరాటం చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఉద్యమించే హక్కుపై అప్రకటిత ఎమర్జెన్సీ (1975 జూన్ 25 ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా), ఉపా చట్టాన్ని రద్దు చేయడం, ప్రజాస్వామికవాదుల అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా రాజకీయ ఖైదీల విడుదల కోసం పౌరహక్కుల సంఘం, టీఎస్, ఏపీ ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీడిత ప్రజలు విముక్తి చెంది సమసమాజం రావాలని కోరుకుంటూ ఉన్నతమైన విలువల కోసం పోరాడుతున్న మేధావులను జైళ్లలో పెట్టి వారి గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. సాయిబాబా, వరవరరావు తదితరులపై ఏ నేరాలూ లేవని.. ఆయుధాలతో చర్యను నిషేధించారే కానీ మావోయిస్టు రాజకీయాలను కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తుండటం వల్లే వరవరరావు సహా 11 మందిని జైలులో పెట్టారని ఆరోపించారు. అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో ఉన్న సాయిబాబా మావోయిస్టు కార్యాకలాపాలను అమలు చేస్తాడా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్, ప్రొఫెసర్ ఖాసీం, బహుజన ప్రతిఘటన వేదిక నాయకుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫోరెన్సిక్ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి భద్రాచలానికి తీసుకొచ్చిన మృతదేహాలకు ఫోరెన్సిక్ డాక్టర్‌తో పోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పోస్టుమార్టం మొత్తాన్ని వీడియో తీయాలని, అనంతరం ఆ మృతదేహాలను మృతుల కుటుంబీకులకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొండపాల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయడంతోపాటు మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రి నుంచి వరంగల్ ఎంజీఎం లేదా ఉస్మానియా ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. మీ సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ, ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఛత్తీస్‌గఢ్ పరిధిలోకి వస్తుందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే న్యాయ పరిధి ఈ హైకోర్టుకు లేదని వివరించారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన ఓ మావోయిస్టు, ఓ పోలీసు మృతదేహాలను భద్రాచలం తీసుకొచ్చారని రఘునాథ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మృతుల్లో ఇప్పటి వరకు ఇద్దరిని గుర్తించడం జరిగిందని, ఆ రెండు మృతదేహాలను ఛత్తీస్‌గఢ్ పోలీసుల విన్నపం మేరకు భద్రతా కారణాలరీత్యా పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని రామచంద్రరావు వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, భద్రాచలం ఈ హైకోర్టు న్యాయపరిధిలోకి వస్తుంది కాబట్టి, ఆ రెండు మృతదేహాల విషయంలో జోక్యం చేసుకునే పరిధి తమకు ఉందని స్పష్టం చేసింది. మృతుల్లో ఎంత మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారని ధర్మాసనం ప్రశ్నించగా, హరిభూషణ్ తెలంగాణ వ్యక్తేనని రఘునాథ్ చెప్పారు. భద్రాచలం ఆసుపత్రిలో ఫోరెన్సిక్ డాక్టర్లు లేరని, అందుకే ఎంజీఎంకి తరలించాలని కోరుతున్నామన్నారు. భద్రాచలం ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలున్నాయని, అందుకే ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడకు తీసుకురావడం జరిగిందని అదనపు ఏజీ చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, భద్రాచలం తీసుకొచ్చిన మృతదేహాలకు ఫోరెన్సిక్ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను వీడియో తీశాక, మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో ఎవరి మృతదేహాన్నైనా తెలంగాణ ప్రాంత పరిధిలోకి తీసుకొస్తే, ఆ మృతదేహాల విషయంలోనూ ఇదే ప్రక్రియను అనుసరించాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
సత్యంబాబు విడుదలపై వీడని ఉత్కంఠ
-
సత్యంబాబు విడుదలపై వీడని ఉత్కంఠ
- రాత్రి వరకు హైకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు - నేడు విడుదలయ్యే అవకాశం - నిర్దోషిని శిక్షించారంటూ ప్రజాసంఘాల ఆగ్రహం రాజమహేంద్రవరం క్రైం: ఆయేషా మీరా హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న పిడతల సత్యంబాబు విడుదల్లో జాప్యం జరుగుతోంది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చినా ఉత్తర్వులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులకు శనివారం కూడా అందలేదు. ఈ ఉత్తర్వులు ఆదివారం అందితే సత్యంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ జైలు వద్ద శనివారం ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. శుక్రవారమే హైకోర్టు తీర్పు ఇవ్వడంతో శనివారం సత్యంబాబు విడుదలవుతాడని అంతా ఎదురు చూశారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, ప్రజాసంఘాల నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడికి వచ్చిన సత్యంబాబు తల్లి మరియమ్మ, లాయర్ శ్రీనివాసరావు.. అడ్వకేట్ కౌన్సిల్ ఇచ్చిన కాపీలను జైలు అధికారులకు చూపించారు. ఉత్తర్వులు హైకోర్టు నుంచి నేరుగా వస్తేగానీ జైలు నుంచి విడుదల చేసేందుకు నిబంధనలు అంగీకరించవని అధికారులు చెప్పారు. సత్యంబాబు విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు హైదరాబాద్ నుంచి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్.ఎం.ఎస్. ద్వారా వస్తాయని ఎదురుచూసినా రాలేదు. పోలీస్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి నిర్దోషిపై కేసు పెట్టిన పోలీస్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘాలు, దళితసంఘాలు డిమాండ్ చేశాయి. సెంట్రల్ జైలు వద్ద ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, సత్యంబాబు న్యాయవాది పి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక నిరపరాధిని ఎనిమిదిన్నర సంవత్సరాలు జైలులో మగ్గేలా చేశారని ఆరోపించారు. కుటుంబానికి ఆసరాగా ఉండే యువకుడి జీవితాన్ని నాశనం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల వైఫల్యంతో నష్టపోయిన రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఎన్కౌంటర్లను ఆపండి!
- ఏపీ సీఎం చంద్రబాబుకు పౌరహక్కుల సంఘం డిమాండ్ - ఇంకా ఎంత మందిని చంపాలనుకుంటున్నారు? - రోజూ పారదర్శకత, జవాబుదారీతనం అంటారు - ఇప్పుడీ ఎన్కౌంటర్ హత్యలపై మాట్లాడరేం? సాక్షి, హైదరాబాద్: ఏఓబీలో చేపట్టిన గాలింపు చర్యలను, గాలింపు పేరుతో చేపడుతున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబును పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఎన్కౌంటర్ రోజున 18గా ఉన్న మృతుల సంఖ్య బుధవారానికి 30కి చేరిందని.. గాలింపు చర్యల పేరిట పోలీసుల అదుపులో ఉన్న ఒక్కొక్కరినీ చంపుతున్నారని ఆరోపించింది. నిత్యం పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి మాట్లాడే బాబు.. ఎన్కౌంటర్ హత్యలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీసిం ది. భారీ ఎన్కౌంటర్ జరిగినా హోంమంత్రి, మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడింది. ఏపీ డీజీపీ సాంబశివరావు పొంతనలేని ప్రకటనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు పౌర హక్కుల సంఘం కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ శేషయ్య, తెలంగాణ, ఏపీ రాష్ట్ర కమిటీల అధ్యక్షులు లక్ష్మణ్, వి.చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శులు ఎన్.నారాయణరావు, చిలకా చంద్రశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు. జీవించే హక్కుపై గౌరవం లేదు.. రాజ్యాంగంలోని మౌలిక ప్రమాణాలైన సమానత్వం, సామాజిక న్యాయం వంటివి బాబు పాలనలో కనిపించడం లేదని.. జీవించే హక్కుపట్ల ఆయనకు గౌరవం లేదని పౌర హక్కుల సంఘం విమర్శించింది. శేషాచలం ఎన్కౌంటర్ ఘటనలో ఎర్రచందనం స్మగ్లర్లుగా పేర్కొంటూ 21 మంది కూలీలను హతమార్చారని ఆరోపించింది. చట్టాల్లోని లొసుగులను ఉపయోగించి కోర్టు విచారణల నుంచి బయటపడేవారిలో బాబును మించినవారు లేరని విమర్శించింది. సుప్రీం న్యాయమూర్తులతో చనువుగా మెలిగే ఆయన.. ఎన్కౌంటర్ హత్యలపై ఉన్నత న్యాయస్థానాల అభిప్రాయాలను గౌరవిస్తారా అని సందేహం వ్యక్తం చేసింది. ‘‘బలిమెల ఘటనలో 38 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చారు.. దానికి ప్రతీకారంగా ఇప్పుడు అం తకు రెండింతల మందిని చంపాలనుకుంటున్నారా? మరి ఎంత మంది మావోయిస్టులను, సాధారణ ఆదివాసీలను చంపాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించింది. బాబు ఉద్దేశపూర్వకంగానే మౌనంగా ఉన్నారని.. మావోయిస్టులు, ఆదివాసీల మారణకాండకు ఆయన ఆమోదం తెలుపుతున్నారని వ్యాఖ్యానించింది. మావోయిస్టు ఉద్యమంతో రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని... ఈ బూటకపు ఎన్కౌంటర్ల విధానాన్ని విరమించుకోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మావోయిస్టులు, ఆదివాసీల మృతదేహాలను భద్రపరిచి బంధువులకు అప్పగించాలని కోరింది. -
శిశువు మృతికి ఆస్పత్రి అధికారులే కారణం
పౌరహక్కుల సంఘం నిజనిర్థారణ కమిటీ వెల్లడి పాతగుంటూరు : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మూషికాల దాడిలో శిశువు మృతి చెందిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో వాస్తవాలను గుర్తించేందుకు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ ఆదివారం ఉదయం గుంటూరు జీజీహెచ్‌లో శిశువుకు సర్జరీ చేసిన డాక్టర్ సీహెచ్ భాస్కరరావు, స్టాఫ్ నర్సులను, సిబ్బందిని కలిసి వివరాలు సేకరించింది. ఎలుకలు దాడిచేసి గాయపరచడం వల్లే పసికందు మృతిచెందిందని కమిటీ నిర్ధారించింది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆర్ఎంవో, శానిటరీ ఇన్స్పెక్టర్, కమిటీ చైర్మన్లపై మాత్రమే ఉందని డాక్టర్లు, నర్సులకు సంబంధించిన అంశం ఏమాత్రం కాదని తేల్చింది. ఇప్పటికైనా మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత జీజీహెచ్ అధికారులపై ఉందని అభిప్రాయపడింది. విచారణ జరిపిన కమిటీలో పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు, డి.వెంకటేశ్వరరావు, డాక్టర్ వీరేశలింగం, జంపని చెనకేశవులు, ఇతర కార్యవర్గసభ్యులు ఉన్నారు. -
కాల్పుల బాధ్యులను సస్పెండ్ చేయాలి
పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వి.రఘునాధ్ చర్ల: చట్ట విరుద్ధంగా కాల్పులు జరిపి, దోశిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు కారం నర్సింహారావు మృతికి కారకులైన ఎస్సై, సీఐ, ఏఎస్పీ, సీఆర్పీఎఫ్ డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయూలని, వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయూలని, ఈ ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ర్ట సంయుక్త కార్యదర్శి వి.రఘునాధ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దోశిళ్లపల్లి గ్రామాన్ని శనివారం పౌర హక్కుల సంఘం ప్రతినిధులు సందర్శించారు. నరసింహారావు భార్య సుశీల, కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడిన కనితి సత్తిబాబుతోపాటు స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, చర్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో కారం నర్సింహారావు మృతిచెందాడంటూ కట్టుకథలు అల్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే మృతదేహానికి పోస్ట్‌మార్టం జరపకుండా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేయించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కాల్పుల ఘటనపై ఐపీసీ 301, 201 సెక్షన్ల కింద కాకుండా కేవలం ఐపీసీ 147, 148, 307 సెక్షన్లతోనే కేసు నమోదు చేసి సరిపెట్టుకున్నారని విమర్శించారు. దీనినిబట్టి, ఈ కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమవుతోందన్నారు. దీనిని ప్రశ్నించిన విలేకరులతో... ‘విలేకరులే కాల్చి చంపారు’ అంటూ కొత్తగూడేనికి చెందిన ఆర్ఎస్ఐ శ్రీధర్ దురహంకారంగా మాట్లాడారని అన్నారు. దీనిని సుమోటోగా స్వీకరించి, ఆర్ఎస్ఐపై కూడా కేసు నమోదు చేయాలని మానవ హక్కుల సంఘాన్ని కోరారు. ఏజెన్సీలో గ్రీన్ హంట్ ఆపరేషన్నునిలిపివేయాలని, అమాయక ఆదివాసీలపై బైండోవర్ కేసులకు స్వస్తి చెప్పాలని ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. కాల్పుల ఘటనపై స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలతోపాటు హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కాల్పుల ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, హైకోర్టులో పిటిషన్ వేస్తామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.తిరుమలరావు, జిల్లా అధ్యక్షుడు కె.రవి, కార్యదర్శి పి.విప్లవ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు ఉన్నారు. పోలీసుల దమనకాండకు నిదర్శనం జిల్లాలో పోలీసుల దమనకాండకు దోశిళ్లపల్లి కాల్పుల ఘటనే నిదర్శనమని మావోయిస్టు పార్టీ వెంకటాపురం ఏరియా కార్యదర్శి సునీత పేర్కొన్నారు. ఈ కాల్పులకు బాధ్యులైన ఎస్సై మొదలు ఎస్పీ వరకు అందరినీ వెంటనే సస్పెండ్ చేయాలంటూ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేయాలని కోరారు. ఈ మేరకు, ఆమె పేరిట శనివారం రాత్రి పత్రికలకు లేఖలు అందాయి. కాల్పుల ఘటనను కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాల్పుల ఘటనకు బాధులైన చర్ల ఎస్సై సంతోష్, వెంటాపురం సీఐ అల్లం నరేందర్, భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్పీ షానవాజ్ ఖాసింను సస్పెండ్ చేయాలంటూ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేయాలని ఆమె కోరారు. -
మన్యంలో సెగ
కొయ్యూరు: వచ్చే నెల మొదటివారంలో మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం కానున్నాయనే సమాచారం మన్యంలో అలజడి రేపుతోంది. ఇటీవల వీరవరం ఘటనలో డివిజన్కమిటీ(డీసీ) శరత్‌ను కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని మావోయిస్టులు ఏం చేస్తారోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తప్పులు చేసిన వారిని గుర్తించామని, వారందరికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించడంతో మరింత భయపడుతున్నారు. వీరవరం సంఘటన తర్వాత కొందరు గిరిజనులు చింతపల్లిలో ఆందోళన చేసి ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రధమశ్రేణీ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం కూడా అందజేశారు. మూడు రోజుల కిందట హైదరాబాద్‌లో పౌరహక్కుల సంఘం నేత వరవరరావు ఇంటి ఎదుట ఆందోళన చేశారు. సాధారణంగా వారోత్సవాలు విధ్వంసాలకు చిరునామాగా మారుతాయి. పోలీసులు లేదా రాజకీయ నేతలపై మావోయిస్టులు గురిపెడతారు. చిన్న స్వ్కాడ్లు లేదా యాక్షన్ బృందాలను రంగంలోకి దించుతారు. వారితోనే నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే విధంగా చేస్తారు. 2000లో ఆదిలాబాద్జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో నరేశ్, శ్యామ్,అది అనబడే ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లో మరణించారు. దీంతో అప్పట్లో పీఎల్జీఏను ఏర్పాటు చేశారు. దళాల స్థానంలో ఏరియా కమిటీలను ఏర్పాటు చేశారు. వ్యూహాలను పూర్తిగా మార్చారు. శత్రువును దెబ్బతీయడం మొదలుపెట్టారు. 2001లో నిర్వహించిన మొదటి పీఎల్జీఏ వారోత్సవాల్లో మావోయిస్టులు కొయ్యూరు,గూడెంకొత్తవీధిలో లెక్కలేనన్ని విధ్వంసాలు చేశారు. అప్పటి నుంచి ప్రతీ పీఎల్జీఏ వారోత్సవాలకు మావోయిస్టులు విధ్వంసం చేయడం రివాజుగా మారింది.వ ారోత్సవాలు ముగిసేంతవరకు పోలీసులు మన్యాన్ని జల్లెడపడతారు. రాజకీయ నేతలు లేదా మావోయిస్టుల హిట్ జాభితాలో ఉన్నవారెవరు కూడా సొంత గ్రామాల్లో ఉండే అవకాశం ఉండదు. ఈ సారి పీఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. మావోయిస్టులు ఈసారి చెలరేగే అవకాశలు కనిపిస్తున్నాయి. దీనిపై నిఘా వర్గాలు ముందుగానే అనుమానించి అప్రమత్తం చేస్తున్నాయి.వీరవరం సంఘటన తరువాత పోలీసులు మావోయిస్టుల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. పోలీసుల ముసుగులోనే గిరిజనులు మావోయిస్టులను చంపారని మావోయిస్టులు ఆరోపిస్తుంటే మావోయిస్టులపై నమ్మకాన్ని కోల్పోయిన గిరిజనం తిరుగుబాటు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు మావోయిస్టులపై అభ్యుదయ గిరిజన యువత పేరిట కరపత్రాలను అన్ని మండలాల్లోను అంటించారు.