సత్యంబాబు విడుదలపై వీడని ఉత్కంఠ
- రాత్రి వరకు హైకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు
- నేడు విడుదలయ్యే అవకాశం
- నిర్దోషిని శిక్షించారంటూ ప్రజాసంఘాల ఆగ్రహం
రాజమహేంద్రవరం క్రైం: ఆయేషా మీరా హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న పిడతల సత్యంబాబు విడుదల్లో జాప్యం జరుగుతోంది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చినా ఉత్తర్వులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులకు శనివారం కూడా అందలేదు. ఈ ఉత్తర్వులు ఆదివారం అందితే సత్యంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ జైలు వద్ద శనివారం ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. శుక్రవారమే హైకోర్టు తీర్పు ఇవ్వడంతో శనివారం సత్యంబాబు విడుదలవుతాడని అంతా ఎదురు చూశారు.
పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, ప్రజాసంఘాల నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడికి వచ్చిన సత్యంబాబు తల్లి మరియమ్మ, లాయర్ శ్రీనివాసరావు.. అడ్వకేట్ కౌన్సిల్ ఇచ్చిన కాపీలను జైలు అధికారులకు చూపించారు. ఉత్తర్వులు హైకోర్టు నుంచి నేరుగా వస్తేగానీ జైలు నుంచి విడుదల చేసేందుకు నిబంధనలు అంగీకరించవని అధికారులు చెప్పారు. సత్యంబాబు విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు హైదరాబాద్ నుంచి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్.ఎం.ఎస్. ద్వారా వస్తాయని ఎదురుచూసినా రాలేదు.
పోలీస్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి
నిర్దోషిపై కేసు పెట్టిన పోలీస్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘాలు, దళితసంఘాలు డిమాండ్ చేశాయి. సెంట్రల్ జైలు వద్ద ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, సత్యంబాబు న్యాయవాది పి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక నిరపరాధిని ఎనిమిదిన్నర సంవత్సరాలు జైలులో మగ్గేలా చేశారని ఆరోపించారు. కుటుంబానికి ఆసరాగా ఉండే యువకుడి జీవితాన్ని నాశనం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల వైఫల్యంతో నష్టపోయిన రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.