ఏఓబీలో చేపట్టిన గాలింపు చర్యలను, గాలింపు పేరుతో చేపడుతున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబును పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది.
- ఏపీ సీఎం చంద్రబాబుకు పౌరహక్కుల సంఘం డిమాండ్
- ఇంకా ఎంత మందిని చంపాలనుకుంటున్నారు?
- రోజూ పారదర్శకత, జవాబుదారీతనం అంటారు
- ఇప్పుడీ ఎన్‌కౌంటర్ హత్యలపై మాట్లాడరేం?
సాక్షి, హైదరాబాద్: ఏఓబీలో చేపట్టిన గాలింపు చర్యలను, గాలింపు పేరుతో చేపడుతున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబును పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఎన్‌కౌంటర్ రోజున 18గా ఉన్న మృతుల సంఖ్య బుధవారానికి 30కి చేరిందని.. గాలింపు చర్యల పేరిట పోలీసుల అదుపులో ఉన్న ఒక్కొక్కరినీ చంపుతున్నారని ఆరోపించింది. నిత్యం పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి మాట్లాడే బాబు.. ఎన్‌కౌంటర్ హత్యలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీసిం ది. భారీ ఎన్‌కౌంటర్ జరిగినా హోంమంత్రి, మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడింది. ఏపీ డీజీపీ సాంబశివరావు పొంతనలేని ప్రకటనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు పౌర హక్కుల సంఘం కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ శేషయ్య, తెలంగాణ, ఏపీ రాష్ట్ర కమిటీల అధ్యక్షులు లక్ష్మణ్, వి.చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శులు ఎన్.నారాయణరావు, చిలకా చంద్రశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
జీవించే హక్కుపై గౌరవం లేదు..
రాజ్యాంగంలోని మౌలిక ప్రమాణాలైన సమానత్వం, సామాజిక న్యాయం వంటివి బాబు పాలనలో కనిపించడం లేదని.. జీవించే హక్కుపట్ల ఆయనకు గౌరవం లేదని పౌర హక్కుల సంఘం విమర్శించింది. శేషాచలం ఎన్‌కౌంటర్ ఘటనలో ఎర్రచందనం స్మగ్లర్లుగా పేర్కొంటూ 21 మంది కూలీలను హతమార్చారని ఆరోపించింది. చట్టాల్లోని లొసుగులను ఉపయోగించి కోర్టు విచారణల నుంచి బయటపడేవారిలో బాబును మించినవారు లేరని విమర్శించింది. సుప్రీం న్యాయమూర్తులతో చనువుగా మెలిగే ఆయన.. ఎన్‌కౌంటర్ హత్యలపై ఉన్నత న్యాయస్థానాల అభిప్రాయాలను గౌరవిస్తారా అని సందేహం వ్యక్తం చేసింది.
‘‘బలిమెల ఘటనలో 38 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చారు.. దానికి ప్రతీకారంగా ఇప్పుడు అం తకు రెండింతల మందిని చంపాలనుకుంటున్నారా? మరి ఎంత మంది మావోయిస్టులను, సాధారణ ఆదివాసీలను చంపాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించింది. బాబు ఉద్దేశపూర్వకంగానే మౌనంగా ఉన్నారని.. మావోయిస్టులు, ఆదివాసీల మారణకాండకు ఆయన ఆమోదం తెలుపుతున్నారని వ్యాఖ్యానించింది. మావోయిస్టు ఉద్యమంతో రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని... ఈ బూటకపు ఎన్‌కౌంటర్ల విధానాన్ని విరమించుకోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మావోయిస్టులు, ఆదివాసీల మృతదేహాలను భద్రపరిచి బంధువులకు అప్పగించాలని కోరింది.