చంద్రబాబుకు భద్రత మరింత పెంపు
విజయవాడ: ఏవోబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో చంద్రబాబుపై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామంటూ మావోయిస్టులు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో చంద్రబాబుకు భద్రతగా కమాండోల సంఖ్యను మరింత పెంచారు. ఉండవల్లిలోని నివాసంతో పాటు, విజయవాడలోని సీఎం కార్యాలయంలో భద్రత పెంపుతో పాటు ముఖ్యమంత్రి పర్యటనపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ముఖ్యమంత్రిని కలిసే వ్యక్తులపై నియంత్రణతో పాటు, సామన్యులకు అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు సమాచారం.
మరోవైపు భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజాప్రతినిధులు మావోయిస్టు ప్రభావిత ప్రాంత గ్రామాల్లో పర్యటించేటప్పుడు తమకు సమాచారం ఇవ్వడంతో పాటు, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కాగా ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో 30మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.