ఆడజన్మకు ఎన్ని శాపాలో..?
► తండాల్లో కొనసాగుతున్న భ్రూణ హత్యలు
► పేదరికంతో శిశువులను అమ్ముకుంటున్న గిరిజనులు
మంచాల: ఓ వైపు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ... తమదైన ముద్ర వేస్తున్నారు. పురుషులకు దీటుగా ఏమాత్రం తీసిపోకుండా విద్య, వైద్యం వంటి ఉన్నత రంగాల్లో ముందుంటున్నారు. అయినా ఆడపిల్లల పట్ల వివక్ష మాత్రం తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల సంరక్షణ విషయంలో అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుంది.
అయినా నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. మాతా–శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు మాత్రం ఆశించిన్నంతగా రావడం లేదు. అందుకు నిదర్శనం మంచాల మండలంలోని లోయపల్లి అనుబంధ గ్రామాలైన ఆంబోత్ తండా, సత్తి తండా, గిరిజన తండాలు. మంచాల మండలం పూర్తిగా వెనుకబడి ప్రాంతం.
గిరిజన తండాలు కూడా అధికంగా ఉన్నాయి. మంచాల మండల వ్యాప్తంగా తొమ్మిదేళ్ల కాలంలో ఐదు కేసులు నమోదు కాగా, కేవలం ఒక ఆంబోత్ తండాలో మాత్రం శిశు విక్రయాలకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి. అనేక మంది ఆడ పిల్లలను శిశు విహార్‌కు తరలించడం జరిగింది. ప్రధానంగా మంచాల మండలంలో గిరిజన గ్రామాల్లోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. చెన్నారెడ్డి గూడ గ్రామంలో రెండు, బోడకొండ గ్రామంలో రెండు, ఎల్లమ్మ తండా, బండలేమూర్ గ్రామంలో ఒకటి చొప్పున జరిగాయి.
ఆంబోత్ తండాలో....
మంచాల మండలంలో లోయపల్లి అనుబంధ గ్రామం ఆంబోత్ తండా. ఈ తండాలో 1260 మంది జనాభా ఉంది. 258 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 240 కుటుంబాలు ఎస్టీ వర్గానికి చెందినవారు. మరో 18 బీసీ కుటుంబాలు ఉన్నాయి. ఈ తండాలోనే అధికంగా శిశు విక్రయాలు, భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. చాలామంది పేదరికం పేరుతో ఆడపిల్లలపై వివక్షతో సాకలేమని ఐసీడీయస్ అధికారులకు అప్పగిస్తున్నారు.
8) 2016 డిసెంబర్ 5న ( సూజాత–సేవ దంపతులు) మూడో సంతానం ఆడపిల్ల పుట్టిందని మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. తాజాగా సత్తి తండాలో వనిత– జవహర్ అనే దంపతులు ఇబ్రహీం పట్నంలో ఓ ప్రైవేట్ వైద్యశాల నిర్వాహకుల సహాయంతో మరో ఆడపిల్లను విక్రయించడం జరిగింది. ఇలా వెలుగుచూసిన కేసులు కొన్నే. అయితే గుట్టుచప్పుడు గాకుండా, వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. ఈ తండాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి మహిళలు ముందుకు రావడం లేదు. తండాలో 25 నుండి 30 మంది మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు.
గిరిజన తండాల్లో ఆడ పిల్లలపై వివక్ష చూపిస్తున్నారు. ఐసీడీయస్ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు రావడం లేదు. ఆడపిల్లలపై వివక్ష రూపు మాపాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి సృష్టికి మూలమైన ఆడపిల్లలు వివక్షతకు, భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆడపిల్లల విక్రయాలు
1) 2007 నవంబర్ నెలలో (లలిత– లక్కు దంపతులు)
2) 2008 జూలై 4న (రంగలి– తావు దంపతులు)
3) 2010మే 14న (బిచ్చి–బాలు దంపతులు)
4) 2015 మార్చి 10న (మాధవి– శంకర్ దంపతులు)
5) 2015 ఏప్రిల్ 6న (సంధ్య –లచ్చిరాం దంపతులు)
6) 2015 ఏప్రిల్ 13న (అనిత– రవి దంపతులు)
7) 2015 జూన్ 4న (సునీత– భాస్కర్ దంపతులు )