Fetal homicide
-
ఆడజన్మకు ఎన్ని శాపాలో..?
► తండాల్లో కొనసాగుతున్న భ్రూణ హత్యలు ► పేదరికంతో శిశువులను అమ్ముకుంటున్న గిరిజనులు మంచాల: ఓ వైపు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ... తమదైన ముద్ర వేస్తున్నారు. పురుషులకు దీటుగా ఏమాత్రం తీసిపోకుండా విద్య, వైద్యం వంటి ఉన్నత రంగాల్లో ముందుంటున్నారు. అయినా ఆడపిల్లల పట్ల వివక్ష మాత్రం తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల సంరక్షణ విషయంలో అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుంది. అయినా నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. మాతా–శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు మాత్రం ఆశించిన్నంతగా రావడం లేదు. అందుకు నిదర్శనం మంచాల మండలంలోని లోయపల్లి అనుబంధ గ్రామాలైన ఆంబోత్ తండా, సత్తి తండా, గిరిజన తండాలు. మంచాల మండలం పూర్తిగా వెనుకబడి ప్రాంతం. గిరిజన తండాలు కూడా అధికంగా ఉన్నాయి. మంచాల మండల వ్యాప్తంగా తొమ్మిదేళ్ల కాలంలో ఐదు కేసులు నమోదు కాగా, కేవలం ఒక ఆంబోత్ తండాలో మాత్రం శిశు విక్రయాలకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి. అనేక మంది ఆడ పిల్లలను శిశు విహార్‌కు తరలించడం జరిగింది. ప్రధానంగా మంచాల మండలంలో గిరిజన గ్రామాల్లోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. చెన్నారెడ్డి గూడ గ్రామంలో రెండు, బోడకొండ గ్రామంలో రెండు, ఎల్లమ్మ తండా, బండలేమూర్ గ్రామంలో ఒకటి చొప్పున జరిగాయి. ఆంబోత్ తండాలో.... మంచాల మండలంలో లోయపల్లి అనుబంధ గ్రామం ఆంబోత్ తండా. ఈ తండాలో 1260 మంది జనాభా ఉంది. 258 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 240 కుటుంబాలు ఎస్టీ వర్గానికి చెందినవారు. మరో 18 బీసీ కుటుంబాలు ఉన్నాయి. ఈ తండాలోనే అధికంగా శిశు విక్రయాలు, భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. చాలామంది పేదరికం పేరుతో ఆడపిల్లలపై వివక్షతో సాకలేమని ఐసీడీయస్ అధికారులకు అప్పగిస్తున్నారు. 8) 2016 డిసెంబర్ 5న ( సూజాత–సేవ దంపతులు) మూడో సంతానం ఆడపిల్ల పుట్టిందని మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. తాజాగా సత్తి తండాలో వనిత– జవహర్ అనే దంపతులు ఇబ్రహీం పట్నంలో ఓ ప్రైవేట్ వైద్యశాల నిర్వాహకుల సహాయంతో మరో ఆడపిల్లను విక్రయించడం జరిగింది. ఇలా వెలుగుచూసిన కేసులు కొన్నే. అయితే గుట్టుచప్పుడు గాకుండా, వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. ఈ తండాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి మహిళలు ముందుకు రావడం లేదు. తండాలో 25 నుండి 30 మంది మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. గిరిజన తండాల్లో ఆడ పిల్లలపై వివక్ష చూపిస్తున్నారు. ఐసీడీయస్ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు రావడం లేదు. ఆడపిల్లలపై వివక్ష రూపు మాపాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి సృష్టికి మూలమైన ఆడపిల్లలు వివక్షతకు, భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆడపిల్లల విక్రయాలు 1) 2007 నవంబర్ నెలలో (లలిత– లక్కు దంపతులు) 2) 2008 జూలై 4న (రంగలి– తావు దంపతులు) 3) 2010మే 14న (బిచ్చి–బాలు దంపతులు) 4) 2015 మార్చి 10న (మాధవి– శంకర్ దంపతులు) 5) 2015 ఏప్రిల్ 6న (సంధ్య –లచ్చిరాం దంపతులు) 6) 2015 ఏప్రిల్ 13న (అనిత– రవి దంపతులు) 7) 2015 జూన్ 4న (సునీత– భాస్కర్ దంపతులు ) -
సేవ్ గర్ల్ చైల్డ్‌పై షార్ట్ ఫిల్మ్ పోటీలు
డాబాగార్డెన్స్: భ్రూణ హత్యల నివారణకు సేవ్ గర్ల్ చైల్డ్ అంశంపై అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నట్టు వుమెన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధి లతా చౌదరి తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆడపిల్లలు లేకపోతే సమాజమే ఉండదన్నారు. లింగ నిర్థారణ పరీక్షలను చట్టబద్ధం చేయాలని, లింగ నిర్థారణ పరీక్షలలో ఆడపిల్ల అని తేలితే అప్పటి నుంచి ఆ గర్భస్త శిశువు బాధ్యతను, కాన్పు అయ్యేవరకు తల్లీ, బిడ్డా బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవ్‌గర్ల్‌చైల్డ్ పేరిట నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్‌లు ఎనిమిది నిమిషాల వ్యవధిలో ఉండాలని, జూలై 30వ తేదీలోగా హెచ్డీ క్వాలిటీ, 1920 పిక్స్ అండ్ ఎంపీ-4తో అందజేయాలన్నారు. పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలతోపాటు మూడు కన్సొలేషన్ బహుమతులు అందజేయనున్నట్టు చెప్పారు. మరిన్ని వివరాలకు (email address) orldwomenera@gmail.com(website)www.wwsoindia.org ఇంటినెంబరు 402, ఐదో అంతస్తు, సాయినాథ్ ద్వారకామాయి అపార్ట్మెంట్, నిజాంపేట్, హైదరాబాద్-90 చిరునామాకు పంపాలని లేదా 9989576755, 9866516741 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. -
బతకనివ్వండి
‘‘అమ్మ కడుపులో ఉండగానే ఎంతో సంబురపడిపోయా. కొద్ది రోజులలోనే ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నానని ఆనందించా. పుట్టగానే నన్ను అమ్మ, నాన్న అల్లారు ముద్దుగా చూసుకుంటారని భావించా. బుడిబుడి అడుగులు వేస్తూ, అల్లరి చేస్తూ పెరగాలనుకున్నా. కానీ, పుట్టిన క్షణాలలోనే నన్ను మురికి కాలువలో పడేసి పరలోకానికి చేర్చారు. ఎన్నో ఆశలతో రంగుల జీవితంలోకి ఇలా అడుగుపెట్టానో లేదో అలా... ఆడబిడ్డ అంటూ నొసలు చిట్లించి నన్ను బతకనివ్వకుండా చేసిండ్రు. నేనేం పాపం చేశాను. ఏ విధంగా మీకు అడ్డమయ్యానో తెలియదు. పెంచడం ఇష్టం లేకుంటే ప్రభుత్వ అధికారులకో, మరెవరికో ఇస్తే సరిపోయేది కదా! ఎలాగో అక్కడే పెరిగే దానిని కదా?’’ ఓ మృత శిశువు ఆత్మ వేదన ఇది... కాదు.. కాదు.. పుట్టి క్షణాలు కూడా గడవకుండానే నిర్జీవమవుతున్న ప్రతి శిశువు ఆత్మ నివేదన. ఇందూరు : సాంకేతిక విప్లవం పరవళ్లు తొక్కుతున్న ఈ ఆధునిక సమాజంలోనూ భ్రూణ హత్యలూ, పుట్టిన శిశువును ఎలాగోలా వదిలించుకునే సంఘటనలూ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. కొందరు తల్లిదండ్రుల నిర్ణయాలు శిశువుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆడబిడ్డ పుట్టిందనో, ఆర్థిక స్థోమత లేదనో, మరే ఇతరత్రా కారణలతో మానవత్వాన్ని మరిచి పుట్టిన బిడ్డలను వదిలించుకుంటున్నారు. కన్నతల్లి కూడా దిగులు చెందకుండా, తాను కూడా ఒకప్పుడు శిశువునేనన్న సంగతిని మరిచి పోయి పేగు బంధాన్ని తెంచుకుంటోంది. రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, రోడ్డుపై, చెత్త కుప్పలలో, ముళ్లపొదలలో, మురికి కాలువలలో శిశువుల ఏడుపు వినిపించడం పరిపాటిగా మారింది. అదృష్టవశాత్తూ ఇతరుల కంట పడి, లేదా ఏడుపు విని చేరదీసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే బతికి బయటపడుతున్నారు. మురికి కాలువలలో పడేసిన శిశువులు శవమై కనిపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మూడు నెలలలో 14 వరకు వెలుగు చూశాయి. అనాథలుగా మారుతున్న పసిపాపలను ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, అధికారులు చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ విషయాలపై ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మార్పు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక స్థోమత లేకపోతే, పెంచే ఇష్టం లేకపోతే, అధిక సంతానం అని భావిస్తే,ఏ ఆరణంతోనైనా బిడ్డను వద్దకుంటే వారిని అనాథలుగా వది లేయకుండా అధికారులకు అప్పగించాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఇటీవలే పత్రికల ద్వారా విన్నవించారు. ఇందుకోసం 1098కు ఫోన్ చేయాలని సూచించారు. భ్రూణ హత్యలెన్నో పుట్టిన బిడ్డలను చంపుకుంటున్న తీరు ఇలా ఉంటే, భ్రూణ హత్యలు కూడా కలవరం లిగిస్తున్నాయి. ప్రత్యక్షంగా కనిపించే సంఘటనలకంటే, కనిపించని ఈ విధానంలోనే ఎంతో మంది పసిబిడ్డలు కడుపులోనే కరిగిపోతున్నారు. ఆడబిడ్డ పుడుతుందని ముందే తెలుసుకునే టెక్నాలజీ రావడం ఇందుకు కారణం. లింగ నిర్ధారణ చేయడం నేరమని, ఒకవేళ అలా చేసినా, చేయమని అడిగినా కఠినంగా శిక్షలుం టాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆస్పత్రులలో ప్రచారం కూడా చేస్తోంది. అయినా, భ్రూణ హత్యల సంఖ్య ఎక్కువగానే ఉంటోందని అధికారులు చెబుతున్నారు. వివాహేతర సంబంధాలు ఇందుకు కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు. మచ్చుకు కొన్ని సంఘటనలు నవంబర్ 2న కామారెడ్డి సమీపంలో శ్రీరాంనగర్ కాలనీలో గల చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన ఆడపిల్ల మృతదేహం కనిపించింది. డిసెంబర్ 2న జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడీ చౌరస్తా చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన పసిపాప మృతదేహం కనిపించింది. ఇటు సుబాష్‌నగర్ రైతు బజా ర్ వద్ద ఉన్న మురుగు కాలువలో మరో పసిపాప మృత దేహం కనిపించింది. 4న నగరంలోని కసాబ్‌గల్లీకి చెందిన రాజు తన రెండేళ్ల కుమారుడిని అమ్మకానికి పెట్టగా, అధికారు లు గమనించి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండలం, దుర్గం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు పోషించే స్థోమత లేక నాలుగు రోజుల పాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. 10న కామారెడ్డిలోని మురికి కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల పాపను పడేశారు. మృత శిశువును చూసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయంపై అధికారులు నేటి వరకు విచారణ చేస్తూనే ఉన్నారు. 13న బాల్కొండ మండలం కేంద్రం నెహ్రూనగర్ లో రెండు నెలల పసిపాపను గుర్తు తెలియని మహిళ నుంచి ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 16న నగరంలోని నాందేవ్‌వాడ రేషన్ షాపు ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ఒక రోజు బాబును వదిలేసి వెళ్లారు. ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 25న నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ముళ్లపొదలలో రెండు నెలల పసిపాప కనిపించింది. రైల్వే అధికారులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.