‘‘అమ్మ కడుపులో ఉండగానే ఎంతో సంబురపడిపోయా. కొద్ది రోజులలోనే ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నానని ఆనందించా. పుట్టగానే నన్ను అమ్మ, నాన్న అల్లారు ముద్దుగా చూసుకుంటారని భావించా. బుడిబుడి అడుగులు వేస్తూ, అల్లరి చేస్తూ పెరగాలనుకున్నా. కానీ, పుట్టిన క్షణాలలోనే నన్ను మురికి కాలువలో పడేసి పరలోకానికి చేర్చారు.
ఎన్నో ఆశలతో రంగుల జీవితంలోకి ఇలా అడుగుపెట్టానో లేదో అలా... ఆడబిడ్డ అంటూ నొసలు చిట్లించి నన్ను బతకనివ్వకుండా చేసిండ్రు. నేనేం పాపం చేశాను. ఏ విధంగా మీకు అడ్డమయ్యానో తెలియదు. పెంచడం ఇష్టం లేకుంటే ప్రభుత్వ అధికారులకో, మరెవరికో ఇస్తే సరిపోయేది కదా! ఎలాగో అక్కడే పెరిగే దానిని కదా?’’ ఓ మృత శిశువు ఆత్మ వేదన ఇది... కాదు.. కాదు.. పుట్టి క్షణాలు కూడా గడవకుండానే నిర్జీవమవుతున్న ప్రతి శిశువు ఆత్మ నివేదన.
ఇందూరు : సాంకేతిక విప్లవం పరవళ్లు తొక్కుతున్న ఈ ఆధునిక సమాజంలోనూ భ్రూణ హత్యలూ, పుట్టిన శిశువును ఎలాగోలా వదిలించుకునే సంఘటనలూ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. కొందరు తల్లిదండ్రుల నిర్ణయాలు శిశువుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆడబిడ్డ పుట్టిందనో, ఆర్థిక స్థోమత లేదనో, మరే ఇతరత్రా కారణలతో మానవత్వాన్ని మరిచి పుట్టిన బిడ్డలను వదిలించుకుంటున్నారు. కన్నతల్లి కూడా దిగులు చెందకుండా, తాను కూడా ఒకప్పుడు శిశువునేనన్న సంగతిని మరిచి పోయి పేగు బంధాన్ని తెంచుకుంటోంది.
రైల్వే స్టేషన్‌లలో, బస్ స్టేషన్‌లలో, రోడ్డుపై, చెత్త కుప్పలలో, ముళ్లపొదలలో, మురికి కాలువలలో శిశువుల ఏడుపు వినిపించడం పరిపాటిగా మారింది. అదృష్టవశాత్తూ ఇతరుల కంట పడి, లేదా ఏడుపు విని చేరదీసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే బతికి బయటపడుతున్నారు. మురికి కాలువలలో పడేసిన శిశువులు శవమై కనిపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మూడు నెలలలో 14 వరకు వెలుగు చూశాయి. అనాథలుగా మారుతున్న పసిపాపలను ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, అధికారులు చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు.
ఈ విషయాలపై ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మార్పు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక స్థోమత లేకపోతే, పెంచే ఇష్టం లేకపోతే, అధిక సంతానం అని భావిస్తే,ఏ ఆరణంతోనైనా బిడ్డను వద్దకుంటే వారిని అనాథలుగా వది లేయకుండా అధికారులకు అప్పగించాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఇటీవలే పత్రికల ద్వారా విన్నవించారు. ఇందుకోసం 1098కు ఫోన్ చేయాలని సూచించారు.
భ్రూణ హత్యలెన్నో
పుట్టిన బిడ్డలను చంపుకుంటున్న తీరు ఇలా ఉంటే, భ్రూణ హత్యలు కూడా కలవరం లిగిస్తున్నాయి. ప్రత్యక్షంగా కనిపించే సంఘటనలకంటే, కనిపించని ఈ విధానంలోనే ఎంతో మంది పసిబిడ్డలు కడుపులోనే కరిగిపోతున్నారు. ఆడబిడ్డ పుడుతుందని ముందే తెలుసుకునే టెక్నాలజీ రావడం ఇందుకు కారణం. లింగ నిర్ధారణ చేయడం నేరమని, ఒకవేళ అలా చేసినా, చేయమని అడిగినా కఠినంగా శిక్షలుం టాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆస్పత్రులలో ప్రచారం కూడా చేస్తోంది. అయినా, భ్రూణ హత్యల సంఖ్య ఎక్కువగానే ఉంటోందని అధికారులు చెబుతున్నారు. వివాహేతర సంబంధాలు ఇందుకు కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు.
మచ్చుకు కొన్ని సంఘటనలు
నవంబర్ 2న కామారెడ్డి సమీపంలో శ్రీరాంనగర్ కాలనీలో గల చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన ఆడపిల్ల మృతదేహం కనిపించింది.
డిసెంబర్ 2న జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడీ చౌరస్తా చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన పసిపాప మృతదేహం కనిపించింది. ఇటు సుబాష్‌నగర్ రైతు బజా ర్ వద్ద ఉన్న మురుగు కాలువలో మరో పసిపాప మృత దేహం కనిపించింది.
4న నగరంలోని కసాబ్‌గల్లీకి చెందిన రాజు తన రెండేళ్ల కుమారుడిని అమ్మకానికి పెట్టగా, అధికారు లు గమనించి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండలం, దుర్గం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు పోషించే స్థోమత లేక నాలుగు రోజుల పాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.
10న కామారెడ్డిలోని మురికి కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల పాపను పడేశారు. మృత శిశువును చూసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయంపై అధికారులు నేటి వరకు విచారణ చేస్తూనే ఉన్నారు.
13న బాల్కొండ మండలం కేంద్రం నెహ్రూనగర్ లో రెండు నెలల పసిపాపను గుర్తు తెలియని మహిళ నుంచి ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
16న నగరంలోని నాందేవ్‌వాడ రేషన్ షాపు ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ఒక రోజు బాబును వదిలేసి వెళ్లారు. ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
25న నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ముళ్లపొదలలో రెండు నెలల పసిపాప కనిపించింది. రైల్వే అధికారులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.
బతకనివ్వండి
Published Mon, Dec 29 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM
Advertisement
Advertisement