జీఎం ఆహారానికి గడ్డుకాలం | problem for GM crops | Sakshi
Sakshi News home page

జీఎం ఆహారానికి గడ్డుకాలం

Published Wed, Mar 19 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

జీఎం ఆహారానికి గడ్డుకాలం

జీఎం ఆహారానికి గడ్డుకాలం

 జన్యుమార్పిడి(జీఎం) పంటలు రంగంలోకి వచ్చిన తర్వాత సాధారణ విత్తనాల ద్వారా పండిన ధాన్యాలు, ఆహారోత్పత్తుల్లో జన్యుమార్పిడి విత్తనాల ద్వారా పండిన ధాన్యాలు, ఆహారోత్పత్తులు కలిసిపోతుండడం అంతర్జాతీయ సమస్యగా మారింది.
 
 ఆహార కల్తీ ప్రపంచవ్యాప్త సమస్య. సాధారణంగా నాణ్యమైన ఆహారోత్పత్తులను నాసిరకం ఉత్పత్తులతో కల్తీ చేస్తుం టారు. కానీ, జన్యుమార్పిడి(జీఎం) పంటలు రంగంలోకి వచ్చిన తర్వాత సాధారణ విత్తనాల ద్వారా పండిన ధాన్యాలు, ఆహారోత్పత్తుల్లో జన్యుమార్పిడి విత్తనాల ద్వారా పండిన ధాన్యాలు, ఆహారోత్పత్తులు కలిసిపోతుండడం అంతర్జాతీయ సమస్యగా మారింది. జన్యుమార్పిడి పంటల సంఖ్య, సాగు విస్తీర్ణం పెరుగుతున్నకొద్దీ ఇది జటిలమవుతోంది. గత ఏడాది నవంబరు చివర్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 60 వేల టన్నుల మొక్కజొన్నల్లో జీఎం మొక్కజొన్నలు కలిసినట్లు తేలడంతో చైనా వాటిని వెనక్కి పంపేయడం ఇందుకు ప్రబల నిదర్శనం. జన్యుమార్పిడి పంటలపై ఆహార, వ్యవసాయ సంస్థ సర్వే నిర్వహించడం విశేషం. జన్యుమార్పిడి పంటల వల్ల వినియోగదారులకు, పర్యావరణానికి దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలు ఎదురవుతాయన్న బలమైన సందేహాలతో కొన్ని దేశాలు పటిష్టమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.
 
 25 దేశాల్లో చుక్కెదురు
 
 ఇతర దేశాల నుంచి తాము దిగుమతి చేసుకున్న ధాన్యాల్లో అవాంఛిత జన్యుమార్పిడి ధాన్యాలు కలిసినట్టు పసిగట్టిన 25 దేశాలు ఆ దిగుమతులను తిరస్కరించాయని ఇటీవల ఎఫ్‌ఏవో నిర్వహించిన సర్వేలో తేలింది. మొక్కజొన్నలను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం అమెరికా. అమెరికా నుంచి మొక్కజొన్నలను దిగుమతి చేసుకుంటున్న ముఖ్యదేశాల్లో మూడోది చైనా. 2013-14లో భారీగా 70 లక్షల టన్నుల మొక్కజొన్నలను దిగుమతి చేసుకోదలచిన చైనా... గత నవంబర్ చివర్లో ఒకేసారి 60 వేల టన్నుల మొక్కజొన్నలను వెనక్కి పంపేయడం వాణిజ్య వర్గాల్లో కలకలం రేపింది. జీఎం పంటలను చైనా సాగుచేస్తున్నప్పటికీ జన్యుమార్పిడి మొక్కజొన్నలను ఆ దేశ చట్టాలు అనుమతించడం లేదు. దీంతో అమెరికా జీఎం మొక్కజొన్నలు కలిసిన దిగుమతులకు చైనా నిర్ద్వంద్వంగా ‘నో’ చెప్పేసింది. ఆ కొద్దిరోజులకే ఎఫ్‌ఏవో హుటాహుటిన రంగంలోకి దిగి, జన్యుమార్పిడి ఆహార ధాన్యాల వాణిజ్యం తీరుతెన్నులపై మొట్టమొదటిగా అంతర్జాతీయ సర్వే నిర్వహించింది.
 
 198 సంఘటనల నమోదు  
 
 సర్వేలో భాగంగా 28 ఐరోపా దేశాలు సహా 193 సభ్యదేశాలకు ఎఫ్‌ఏవో జీఎం పంటలకు సంబంధించిన 21 ప్రశ్నలు పంపగా, 75 దేశాలు మాత్రమే స్పందించాయి. 2002-2012 మధ్యకాలంలో దిగుమతైన ఆహారధాన్యాల్లో అవాంఛనీయ జీఎం ఆహార ధాన్యాల కల్తీని 198 సార్లు గుర్తించినట్లు ఈ సర్వేలో తేలింది. అవిసె(లిన్‌సీడ్), బియ్యం, గోధుమ, మొక్కజొన్న, బొప్పాయి వంటి పంటల్లో జన్యుమార్పిడి కల్తీ చోటుచేసుకున్నట్లు గుర్తించారు. 2009 తర్వాత మూడేళ్లలోనే 138 సంఘటనలు నమోదయ్యాయి. అమెరికా, కెనడా, చైనా దేశాల నుంచి వెళ్లిన ఎగుమతుల్లోనే ఎక్కువగా జీఎం ఆహార ధాన్యాలు ప్రమాదవశాత్తూ కలిశాయని ఎఫ్‌ఏవో చెబుతోంది. మనదేశం నుంచి వెళ్లిన ఎగుమతుల్లోనూ ఒకటి, రెండుసార్లు జీఎం అవశేషాలున్నట్లు తేలింది. ఈ విషయం గుర్తించిన తర్వాత ఆ ధాన్యాలను నాశనం చేశారు లేదా ఎగుమతి చేసిన దేశానికి తిప్పిపంపారు. కొన్ని దేశాల్లో అయితే ఈ ధాన్యాలను జీవ ఇంధన తయారీలో వినియోగించారు. జన్యుమార్పిడి ఆహారోత్పత్తుల కల్తీని కనిపెట్టాలంటే ముందు అందుకు తగిన చట్టాలు ఆయా దేశాల్లో ఉండి ఉండాలి. కానీ, సర్వేలో పాల్గొన్న 75 దేశాలకుగాను 17 దేశాల్లో అసలు ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాలే లేవు.
 
 జన్యుమార్పిడి పంటలు మామూలు పంటలకు దగ్గరి పొలాల్లో సాగవుతున్నప్పుడు పుప్పొడి గాలికి వచ్చిపడడం ద్వారా జీఎం కల్తీ జరగొచ్చు. అప్పుడు కాకపోయినా నూర్పిళ్ల తర్వాత శుద్ధి, ప్యాకింగ్, నిల్వ, రవాణా చేస్తున్నప్పుడు జరగొచ్చు.  జీఎం కల్తీ ఎంత స్వల్ప మోతాదులో ఉంటే సహించవచ్చన్న అంశంపై వివిధ దేశాల మధ్య ఏకీభావం లేకపోవడం వాణిజ్యానికి ప్రతిబంధకంగా మారింది. ఈ విషయమై ఏకరూపత కోసం ఎఫ్‌ఏవో  కసరత్తు ప్రారంభించింది. జన్యుమార్పిడి పంటలను ఒకసారి అనుమతించడం అనేది జరిగితే కల్తీని అరికట్టడం ఎవరి తరమూ కాదని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్న విషయంలో ఎంత నిజముందో ఎఫ్‌ఏవో సర్వే రుజువుచేసింది. ఆహార పంటల్లో జన్యుమార్పిడిని అనుమతించకపోవడం ప్రజారోగ్యం దృష్ట్యానే కాకుండా ఎగుమతుల దృష్ట్యా కూడా అత్యవసరమని ఇప్పటికైనా గుర్తించడం మంచిది.    
 -పంతంగి రాంబాబు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement