హెక్టారుకు 12 టన్నుల దిగుబడి
గ్రీన్ సూపర్ రైస్.. త్వరలో విడుదల!
విపత్కర పరిస్థితులు సృష్టిస్తున్న వాతావరణ మార్పులు (అధిక ఉష్ణోగ్రత, కరువు, కుండపోత వానలు, నీటి ముంపు..), అంతకంతకూ తరిగిపోతున్న ప్రకృతి వనరులు (భూసారం, సాగునీరు..), వేగంగా పెరుగుతున్న సేద్యపు ఖర్చులు.. ప్రపంచవ్యాప్తంగా వరి సేద్యానికి పెను సవాళ్లుగా మారాయి. మన దేశంలో గత పదేళ్లుగా వరి దిగుబడుల్లో పెరుగుదల స్తంభించిపోయింది. రసాయనిక ఎరువుల మోతాదు ఎంత పెంచినా దిగుబడి పెరగని పరిస్థితుల్లో వరి సేద్యం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన స్థానం (ఇరి), చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ (కాస్) ఉమ్మడి కృషితో వందలాది సంప్రదాయ వరి వంగడాల్లో సద్గుణాలను కలబోసి..
గ్రీన్ సూపర్ రైస్ (జీఎస్సార్) పేరిట సరికొత్త వరి వంగడాలు రూపొందించి, అనేక దేశాల్లో క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ‘భారత్‌లో 13 జీఎస్సార్ వంగడాలు గత రెండేళ్లుగా సాగు చేయించాం. వీటిల్లో 4 లేక 5 వంగడాలు చాలా మెరుగైన ఫలితాలనిచ్చాయి. 2016లో వీటిని అధికారికంగా భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నామ’ని జీఎస్సార్ ప్రాజెక్ట్ లీడర్, దక్షిణాసియా - ఆఫ్రికా ప్రాంతీయ సమన్వయకర్త డా. జవహర్ అలీ వెల్లడించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన డా. అలీ ఫిలిప్పీన్స్ నుంచి ఇటీవల స్వస్థలానికి వచ్చిన సందర్భంగా.. గ్రీన్ సూపర్ రైస్ ప్రాజెక్ట్ డెరైక్టర్, ‘కాస్’ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డా. లి ఝి-కంగ్‌తో కలిసి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘సాగుబడి’ కథనాల ఫలితంగా తెలుగునాట ఇప్పటికే వందల మంది రైతులకు ఈ వంగడాలు చేరడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘2 వారాల వరకు నీటి ముంపు లేదా తీవ్రమైన బెట్ట పరిస్థితులను తట్టుకొని నిలబడటమే కాదు.. సగటు కన్నా అధిక దిగుబడినివ్వడం, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు 25% తక్కువ వనరులతోనే సగటు కన్నా అనేక రెట్లు ఎక్కువ దిగుబడినివ్వటం జీఎస్సార్ వంగడాల ప్రత్యేకత. ఎల్‌నినో వల్ల తీవ్ర కరువు పరిస్థితులున్నప్పటికీ ఫిలిప్పీన్స్, భారత్, ఆఫ్రికా దేశాల్లో జీఎస్సార్ వంగడాలు రైతులకు సంతృప్తికరమైన దిగుబడులను ఇస్తున్నాయి.
భారత్‌లో 13 జీఎస్సార్ సూటి రకం వంగడాల్లో 4,5 రకాలు చాలా బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రైతులు నీటి కొరత లేని పరిస్థితుల్లో హెక్టారుకు 12 టన్నుల వరకు దిగుబడి సాధించారు (భారత్ సగటు వరి దిగుబడి హెక్టారు/ 2.5 టన్నులు). అందువల్ల ఈ వంగడాలను 2016లో బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నాం. తొలి దశలో రైతుల నుంచి రాయల్టీ వసూలు చేయబోము. భారత ప్రభుత్వం చప్పున ఈ వంగడాలను అందిపుచ్చుకోగలిగితే రైతుల నికరాదాయం పెరుగుతుంది..’.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్