ప్రకృతి పూలు! | Nature flowers! | Sakshi
Sakshi News home page

ప్రకృతి పూలు!

Published Tue, Dec 15 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

ప్రకృతి పూలు!

ప్రకృతి పూలు!

 జెర్బెరా సాగులో కొత్తపుంతలు
♦ పాలిహౌస్‌లో ప్రకృతి సేద్యంతో కొత్తపుంతలు
♦ జీవామృతం, పుల్లమజ్జిగతో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులుకు కళ్లెం
♦ ట్రైకోడెర్మాతో బూజు తెగులుకు చెక్
♦ పెరిగిన పూల నిల్వ సామర్థ్యం
♦ భారీగా తగ్గిన సాగు ఖర్చు..పెరిగిన నికరాదాయం
 
 పాలిహౌస్‌లో ఖరీదైన అలంకరణ పూల పెంపకం అంటే.. కత్తి మీద సామే! పాలిహౌస్ రైతులంతా సాధారణంగా రసాయనిక వ్యవసాయ పద్ధతినే  అవలంబిస్తున్నారు. పాలిహౌస్ రైతులు ఖర్చుకు వెనకాడకుండా శ్రద్ధగా సేద్యం చేస్తున్నప్పటికీ.. ఎడతెగని చీడపీడలు గడ్డు సమస్యగానే మిగిలిపోతున్నాయి. ఎప్పుడు ఏ తెగులొస్తుందోనన్న దిగులుతో నిద్రపట్టని స్థితి. అయితే, విద్యాధికుడైన యువ రైతు యల్లారెడ్డి.. పాలిహౌస్ సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ బాటకు మలిపి.. ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తున్నారు. నాణ్యమైన పూల దిగుబడి తీస్తూ నిశ్చింతగా అధిక నికరాదాయం పొందుతున్నారు. పచ్చని సేద్యాన్ని పాలిహౌస్‌లోకి ప్రవేశపెట్టి.. తెలుగునాట కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పాలిహౌస్ సేద్య చరిత్రలో నిస్సందేహంగా ఇదొక విప్లవమే!
 
సామ యల్లారెడ్డికి 34 ఏళ్లు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం లింగంపల్లిలో పుట్టారు. బీకాం కంప్యూటర్స్ చదివిన తర్వాత ఫ్రాన్స్ వెళ్లి ఎంబీఏ (కమ్యూనికేషన్స్) పూర్తిచేసి.. ఆ దేశంలోనే మాడ్రిడ్ నగరంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఎనిమిదేళ్లు గడిచాయి. సీనియర్ కన్సల్టెంట్‌గా నెలకు రూ. 2 లక్షల ఆదాయం వచ్చేది. గ్రీన్‌కార్డుంది. రోజంతా కంప్యూటర్ ముందే కూలబడడం.. ఏడాదిలో ఎక్కువ నెలలు మంచు కురిసే ప్రతికూల వాతావరణంలో జీవనం.. ప్రకృతికి దూరమైన గానుగెద్దు జీవితంలో ఏదో తీరని వెలితి! యోగ, మెడిటేషన్ చేయడంతోపాటు నలుగురికీ నేర్పించడం వంటి పనుల్లో లీనమైనా.. ఒకరకమైన పరాయితనమేదో వెంటాడుతుండేది.. యల్లారెడ్డి, సునీత దంపతులు ఇక చాలు అనుకొని 2012లో తమ రెండేళ్ల బాబును చంకనెత్తుకొని ఇంటికొచ్చేశారు.

 మళ్లీ ఉద్యోగంలో చేరకుండా.. మెదక్ జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లిలోని తమ ఆరెకరాల వ్యవసాయ క్షేత్రంలో 2013లో వ్యవసాయం చేపట్టారు. ప్రభుత్వ సబ్సిడీతో అరెకరంలో పాలిహౌస్ నిర్మించారు. అందులో గత ఏడాది ఫిబ్రవరి నుంచి జెర్బెరా పూలను సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో, తక్కువ కూలీలతో, తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి తీయాలన్న లక్ష్యంతో పాలిహౌస్ సేద్యం ప్రారంభించారు. ఎర్రమట్టిలో పశువుల ఎరువు, ఊక కలిపి బెడ్స్ తయారు చేసుకొని ఎరుపు, పసుపు, తెలుపు వంటి ఏడు రంగుల పూలనిచ్చే 11,500 జెర్బెరా మొక్కలు నాటారు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రసాయనిక ఎరువులు, మైక్రోన్యూట్రియంట్లు, యాంటీబయోటిక్స్, గ్రోత్‌ప్రమోటర్లు, యాసిడ్లు.. ఎప్పుడు ఏది అవసరమైతే అది వాడుతూ శ్రద్ధగా సేద్యం చేశారు. ‘సగటున రోజుకు 1600 పూలను కత్తిరించి మార్కెట్‌కు తరలించే వాళ్లం. అయితే, కొద్ది నెలలకు పరిస్థితిలో మార్పొచ్చింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా క్రమంగా ఏదో ఒక చీడపీడల సమస్య నిత్యం వెంటాడుతూ ఉండేద’ని యల్లారెడ్డి అంటారు.

 ముఖ్యంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు (బ్యాక్టీరియల్ బ్లైట్) ముప్పుతిప్పలు పెట్టింది. రసాయనిక పురుగుమందులు, యాంటీబయోటిక్స్.. కొనుగోళ్లకే నెలకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు ఖర్చు చేసినా ఫలితం ఆశించినంతగా లేదు. తెలంగాణ రాష్ట్ర పాలిహౌస్ యజమానుల సంఘం కార్యదర్శి కూడా అయిన యల్లారెడ్డి తనకు తెలిసినంతలో ఉత్తమ కన్సల్టెంట్లను సంప్రదించారు. ఒకరి తర్వాత మరొకరు ముగ్గురు కన్సల్టెంట్లను మార్చినా ఫలితం లేదు. రూ. 80 వేల వరకు ఖర్చయినా ఆకుమచ్చ తెగులు అదుపులోకిరాలేదు.

 దీని బారిన పడిన మొక్క చనిపోదు కానీ, ముడుచుకుపోయి ఎదుగుదలకు నోచుకోదు. పూల దిగుబడి దెబ్బతింటుంది. పాలీహౌస్‌లో 20-30% జెర్బెర మొక్కలకు ఆకుమచ్చ తెగులు సోకిన దశలో.. ఇక రసాయనిక వ్యవసాయ పద్ధతిలో దీన్ని అదుపు చేయడం సాధ్యం కాదని యల్లారెడ్డి నిర్థారణకు వచ్చారు.

 వెతకబోయిన తీగ...
 అటువంటి సంక్షోభ దశలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయం గురించి తన మిత్రుల ద్వారా ఆయన తెలుసుకున్నారు. 2015 జూన్ 1-3 తేదీల్లో కరీంనగర్‌లో గ్రామభారతి నిర్వహించిన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం మూలసూత్రాలను ఆకళింపు చేసుకున్న తర్వాత.. యల్లారెడ్డికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. తన జెర్బెరా తోటలో ఎదురవుతున్న గడ్డు సమస్యలకు సరైన పరిష్కారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో లభిస్తాయన్న నమ్మకంతో ముందడుగు వేశారు.

 బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులుకు కళ్లెం
 పాలిహౌస్ వ్యవసాయంలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తోంది. రసాయనిక వ్యవసాయంలో దీనికి పరిష్కారం లేదని యల్లారెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఇది మరీ తీవ్రమైతే మొక్కలు పీకేసి మళ్లీ వేసుకోవడమో, లేకుంటే ఏకంగా కొత్త బెడ్స్ వేసుకోవడమే మేలంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో యల్లారెడ్డి తన పాలిహౌస్‌లో జూన్ నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ధైర్యంగా అమలు పరిచారు. కొద్ది రోజుల్లోనే ఆకుమచ్చ వ్యాప్తి ఆగిపోయింది. ఒక మోస్తరుగా సోకిన మొక్కలు తిప్పుకొని, తిరిగి పూలు పూచాయి. జీవామృతం, పుల్లమజ్జిగ వాడి ఉండకపోతే ఈపాటికి 30% వరకు మొక్కలకు బ్లైట్ విస్తరించి ఉండేదని ఆయన అంచనా. రసాయనాలు వాడకుండా సున్నితమైన జెర్బెరా తోటను  కాపాడుకోవడం విశేషం.

 జీవామృతంతో బెడ్స్ సారవంతం..
 తన అరెకరం పాలిహౌస్‌లో 30 లీటర్ల జీవామృతాన్ని 5-7 రోజుల మధ్యలో డ్రిప్ ద్వారా నేలకు ఇస్తున్నారు. రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు 25-30 నిమిషాలపాటు నీరందించే వారు. ఇప్పుడు 15 నిమిషాలపాటు ఇస్తే సరిపోతోంది. డ్రిప్ ద్వారా మొదటి 5 నిమిషాలు నీరు, తర్వాత 5 నిమిషాలు జీవామృతం కలిపిన నీరు, చివరి 5 నిమిషాలు నీరు ఇస్తున్నారు. జీవామృతం పిచికారీ చేయడం వల్ల మొక్కల ఆకులు, కాండం తడిసి వేరు వరకు వెళ్లి బ్లైట్ ఇన్ఫెక్షన్‌ను అరికడుతోంది.

 మొక్కకు 800 ఎం.ఎల్. వరకు ఇచ్చే నీటిని 400 ఎం.ఎల్.కు తగ్గించారు. జీవామృతం ప్రభావం వల్ల బెడ్స్‌లో మట్టి గుల్లబారింది. జెర్బెర మొక్కల కింది ఆకులను నెలకోసారి తీసి బయట పారేసేవాళ్లు. పాలేకర్ సూచన మేరకు ఎండాకులను మొక్కల వద్దే ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ఆ తర్వాత వానపాముల సంఖ్య బాగా పెరిగింది. రసాయనిక సేద్యంలో మాదిరిగా బెడ్స్‌లో మట్టిని కూలీలను పెట్టి గుల్లపరచాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడా పనిని సూక్ష్మజీవులు, వానపాములే చేస్తున్నాయి. సూక్ష్మపోషకాల లోపం అన్న మాటే లేదు.

 పువ్వు ఐదు రోజులు వాడిపోకుండా ఉంటుంది..
 గతంలో అరగంట వరకు నీరు వదిలినా బెడ్లపై మట్టి గట్టిగా ఉండడం వల్ల నీరు లోపలికి ఇంకేది కాదు. బెడ్ పైనుంచే పొర్లిపోయేది. మొక్కల వేళ్లకు తేమ అందేది కాదు. ఇప్పుడు ఆ సమస్య లేకపోవడాన్ని యల్లారెడ్డి గమనించారు. నీటి తేమతోపాటు ప్రాణవాయువు కూడా సక్రమంగా అందడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా, బలంగా ఎదుతున్నాయి. కాడ బలంగా ఉంటున్నది. పువ్వులు ఇంతకుముందు మూడో రోజుకే వాడిపోయేవి. ఇప్పుడు ఐదు రోజుల వరకు బాగుంటున్నాయి. అందువల్ల ఢిల్లీ మార్కెట్‌కు ఇవి అనువుగా ఉండటం విశేషం.

 ట్రైకోడెర్మాతో బూజు తెగులుకు చెక్
 చలికాలంలో సాధారణంగా వచ్చే బూజు తెగులును పారదోలడానికి ట్రైకోడెర్మా విరిడి ద్రావణాన్ని వాడుతున్నారు. ప్లాస్టిక్ డ్రమ్ములో వంద లీటర్ల నీరు పోసి, కిలో ట్రైకోడెర్మా విరిడి పొడిని, కిలో బెల్లం, కిలో పప్పుల పిండిని కలిపి.. రెండు రోజులు మురగబెట్టిన తర్వాత పిచికారీ చేస్తున్నారు. వంద లీటర్ల నీటికి 5 లీటర్ల ద్రావణాన్ని 5 రోజులకోసారి చల్లితే బూజు తెగులు పరారవడం యల్లారెడ్డి అనుభవంలో తేలింది. ప్రకృతి సేద్యంలోకి మారితే.. నేలలో ఇంతకుముందున్న ఎరువుల నిల్వలతో ఒకటి -రెండు నెలలే దిగుబడి బాగుంటుందని, ఆ తర్వాత తగ్గిపోతుందని కొందరు హెచ్చరించారు.. అయినా యల్లారెడ్డి వెనుకంజ వేయలేదు. పట్టుదలతో ముందడుగేసి కొత్త ఒరవడి సృష్టించడం ప్రశంసనీయం.
 - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 
 ‘ఫైవ్ లేయర్’లోనూ జెర్బెరా పూలు!
 రసాయనిక వ్యవసాయంతో విసిగిపోయిన నాకు పాలేకర్ ప్రకృతి వ్యవసాయం కొత్తదారి చూపించింది. జెర్బెరా పూలను పెంచడానికి పాలిహౌసే ఉండాలనేమీ లేదు. మామూలు పొలంలోనూ పెంచవచ్చు. అయితే, పాలేకర్ చెబుతున్న విధంగా.. వేర్వేరు ఎత్తులకు ఎదిగే ఐదు రకాల పంటలను కలిపి (ఫైవ్ లేయర్ మోడల్) సాగు చేస్తూ.. ఆ పంటల నీడన జెర్బెరా వంటి ఖరీదైన పూల సాగును కూడా చేపట్టవచ్చన్న నమ్మకం నాకుంది. ఇటీవలే ఒక ఎకరంలో ఈ తరహా సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించాను. ఎరువులను ప్రత్యేకంగా మనం పంటలకు అందించాల్సిన అవసరం లేదు. పోషకాలను అందించే విధంగా భూమిని జీవామృతం, ఆచ్ఛాదన, మిశ్రమ పంటల సాగు ద్వారా సారవంతం చేస్తూ ఉంటే చాలు. పాలిహౌస్‌లో ప్రతి 4 జెర్బెర మొక్కల మధ్యన ఒక బొబ్బర /అలసంద మొక్క నాటమని పాలేకర్ సూచించారు. త్వరలో ఆ పని చేయబోతున్నా. జెర్బెరా మొక్కల జీవనకాలం మూడేళ్లంటారు. మా తోట ఐదేళ్లూ ఉంటుందనుకుంటున్నా.
 - యల్లారెడ్డి సామ (99597 42741), విశ్వనాథపల్లి, కొండపాక మండలం, మెదక్ జిల్లా
 
 దిగుబడి తగ్గలేదు.. ఖర్చు తగ్గింది..!
 అరెకరం పాలిహౌస్‌లో 11,500 మొక్కలున్నాయి. సగటున రోజుకు 1,600 పూలు కోస్తున్నారు. తోట తొలి రోజుల్లో రోజుకు 2 వేల వరకు కోసేవారు. తర్వాత చీడపీడల వల్ల దిగుబడి తగ్గింది. రసాయనిక వ్యవసాయంలో నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తర్వాత అంత దిగుబడి రాదని కొందరు భయపెట్టారు. అయితే, ఇప్పుడు కూడా సగటున రోజుకు 1,600 పూలు వస్తున్నాయని యల్లారెడ్డి సంబర పడుతున్నారు. రసాయనిక వ్యవసాయంలో కూలీల ఖర్చు సహా నెలకు రూ. 60 వేల నుంచి రూ. 70 వేలు అయ్యేది. ప్రకృతి సేద్యంలో ఇది రూ. 18 వేలకు తగ్గింది. అరెకరం పాలిహౌస్ ద్వారా ఇప్పుడు నెలకు సగటున రూ. 75 వేల నికరాదాయం వస్తోందని యల్లారెడ్డి సంతోషంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement