జీవామృతం 9 రోజుల తర్వాత వాడితే మేలు! | good use of jivamrtam using after 9 days ! | Sakshi
Sakshi News home page

జీవామృతం 9 రోజుల తర్వాత వాడితే మేలు!

Published Mon, Apr 18 2016 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

జీవామృతం 9 రోజుల తర్వాత వాడితే మేలు!

జీవామృతం 9 రోజుల తర్వాత వాడితే మేలు!

♦ బెంగళూరు వ్యవసాయ వర్శిటీలో పదేళ్లుగా పరిశోధన
♦ జీవామృతం కలిపిన 9 నుంచి 12 రోజుల్లోనే అత్యుత్తమ ఫలితాలు
♦ సాక్షి ‘సాగుబడి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్ ఎన్. దేవకుమార్ వెల్లడి
 
ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయంలో భూమిని సారవంతం చేయడమే మంచి దిగుబడుల సాధనకు అత్యంత కీలకాంశం. రసాయనాలతో నిస్సారమైన నేలను తిరిగి సారవంతం చేసుకోవడానికి ఉన్న సులువైన మార్గం జీవామృతం, పంచగవ్య ద్రవరూప ఎరువులే. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం వీటిపై అధ్యయనం చేసి ప్రామాణీకరించింది. ద్రవ రూప ఎరువులపై ప్రత్యేక శ్రద్ధతో పదేళ్లుగా పరిశోధన చేస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఇది. సంస్థ సమన్వయకర్త అయిన డాక్టర్ ఎన్. దేవకుమార్ హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన కిసాన్ స్వరాజ్ సమ్మేళనానికి విచ్చేశారు.

ఆ సందర్భంగా ‘సాగుబడి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు జీవామృతాన్ని తయారు చేసిన రెండు రోజుల తర్వాత ప్రారంభించి తదుపరి 7 రోజుల్లోగా వాడుతున్నారు. అలాకాకుండా.. తయారు చేసిన నాటి నుంచి 9 నుంచి12 రోజుల మధ్యలో వాడితే అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయని డా. దేవకుమార్ వెల్లడించారు. చెట్టు చిక్కుడులో జీవామృతం మోతాదు పెంచి వాడితే దిగుబడి 30% పెరిగిందన్నారు.. ఇంటర్వ్యూలోని మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..

 
సేంద్రియ ద్రవరూప ఎరువులపై దీర్ఘకాలంగా పరిశోధన చేస్తున్నందుకు మీకు అభినందనలు. మీ కేంద్రం ఎలా ప్రారంభమైనదో చెప్పండి..  
 జీవామృతం, పంచగవ్య వంటి ద్రవ రూప సేంద్రియ ఎరువులపై గత పదేళ్లుగా నిశితంగా అధ్యయనం చేస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగ వ్యవసాయ పరిశోధనా స్థానం మాది. 2006-07 యడ్యూరప్ప కేటాయించిన రూ. 2 కోట్ల నిధులతో షిమోగలో సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రారంభమైంది. ప్రత్యేక కెమికల్ ఎనాలిసిస్ లేబరేటరీ, మైక్రోబయాలజీ లేబరేటరీలను ఏర్పాటు చేశాం. బీజామృతం, జీవామృతం, పంచగవ్య తదితర ద్రవరూప ఎరువులపై అధ్యయనాలు చేస్తున్నాం. వీటి తయారీ, వినియోగంపై ప్రామాణిక గణాంకాలను నమోదు చేస్తున్నాం. వీటిలో సూక్ష్మజీవరాశి ఏ యే దశల్లో ఎంత ఉంది? ఏయే మోతాదుల్లో వాడినప్పుడు పంట పొలాల్లో వీటి పని తీరు ఎలా ఉందో ఓపెన్ మైండ్‌తో అధ్యయనం చేస్తున్నాం. విద్యార్థులు పీహెచ్‌డీలు చేస్తున్నారు. మా పరిశోధనలో తేలిన విషయాలను ఎప్పటికప్పుడు స్వచ్ఛంద కార్యకర్తలు, సేంద్రియ రైతులకు తెలియజేస్తున్నాం. చాలా మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.   

  ద్రవరూప ఎరువులు సేంద్రియ సేద్యంలో ఎంతమేరకు ప్రయోజనకరం?
 బీజామృతం, జీవామృతం, పంచగవ్య చాలా ప్రభావశీలమైనవి. మేలుచేసే సూక్ష్మజీవరాశి వీటిలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీటి గొప్పతనం ఏమిటంటే.. మారుమూల గ్రామాల్లో కూడా రైతులు స్వల్ప ఖర్చుతోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. అయితే, వీటిని రైతులు తమకు నచ్చిన మోతాదులో, పద్ధతుల్లో వాడుతున్నారు. అంత ప్రభావశీలమైన ద్రవరూప ఎరువులపై పరిశోధన చేసి టెక్నాలజీని స్థిరీకరించాలన్నదే మా లక్ష్యం. బీజామృతం కలిపిన మొదటి రోజే విత్తన శుద్ధికి వాడితే చాలా బాగా పనిచేస్తుంది. అందులోని మేలుచేసే సూక్ష్మజీవరాశి రెండో రోజు నుంచి తగ్గిపోతూ ఉంటుంది. దేశీ ఆవు పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లం, గుప్పెడు మట్టితో జీవామృతం తయారు చేసి పరీక్షించాం. మేలుచేసే సూక్ష్మజీవరాశి ఎంత ఉన్నదీ తయారుచేసిన మొదటి రోజు నుంచి 30 రోజుల వరకు ప్రతిరోజూ నమూనాలను సేకరించి శాస్త్రబద్ధంగా అధ్యయనం చేసి, ఫలితాలను నమోదు చేశాం.

మేలు చేసే అనేక సమూహాల సూక్ష్మజీవులు జీవామృతంలో ఉన్న విషయాన్ని కనుగొన్నాం. నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు, ఫాస్ఫేట్‌ను కరిగించి అందించే సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పంట దిగుబడులనివ్వడంలో కీలకపాత్రవహించే యాక్టినోమైసిటిస్ వంటి ముఖ్యమైన ఐదు సూక్ష్మజీవుల సమూహాలను గుర్తించాం. ఇవన్నీ 9 నుంచి 12వ రోజు మధ్యలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందుకే జీవామృతాన్ని కలిపిన తర్వాత  9,10,11,12 రోజుల్లో వాడితే అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయి. మా విశ్లేషణల ఫలితాలను ఎప్పటికప్పుడు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సేంద్రియ రైతులకు తెలియజేస్తూ ప్రచారం కల్పించాం. వీటిని పాటిస్తూ మా రాష్ట్రంలో అభ్యుదయ, సేంద్రియ రైతులంతా 9-12 రోజుల మధ్యలోనే జీవామృతాన్ని వినియోగిస్తూ ప్రయోజనం పొందుతున్నారు. జీవామృతం కలిపిన 12వ రోజు తర్వాత నుంచి సూక్ష్మజీవరాశి తగ్గిపోతూ ఉంటుంది. 15వ రోజుకు వీటి సంఖ్య కొంచెం పెరిగినప్పటికీ అంతకు ముందున్నంతగా లేదు. అందువల్లే 9-12 రోజుల మధ్యలో వాడుకుంటే రైతులకు మంచి ప్రయోజనం చేకూరుతోంది.

  జీవామృతం కలిపిన రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు వాడొచ్చని సుభాష్ పాలేకర్‌జీ చెబుతున్నారు. పుస్తకాల్లోనూ అదే రాశారు కదా. మీ విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో జీవామృతాన్ని మరోసారి పరీక్షించి చూడాల్సిన అవసరం లేదంటారా?
 పాలేకర్‌జీ చెప్తున్న దాని గురించి నేనేమీ వ్యాఖ్యానించను. శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత నమోదు చేసిన గణాంకాలను గురించే మేం చెబుతున్నాం. పాలేకర్‌జీకి కూడా ఈ వివరాలు తెలియజేశాం. ఆయన వాటిని అంగీకరించలేదు. మేం ఒకటి రెండు, మూడు సార్లు పరీక్షలు చేసి చూశాం. మళ్లీ అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. మా పరిశోధనా స్థానంతో సంబంధంలో ఉన్న రైతులందరూ జీవామృతాన్ని 9-12 రోజుల మధ్యలోనే వాడుతూ చక్కటి ప్రయోజనం పొందుతున్నారు.

  కేవలం జీవామృతంతో పంటలు పండిస్తున్నారా?
 సేంద్రియ కర్బనం (ఓసీ) బాగా ఉన్న భూమిలో జీవామృతం వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. 0.5% - 0.6% మేరకు సేంద్రియ కర్బనం ఉన్న భూముల్లో జీవామృతం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, మన నాసిరకం నేలల్లో 0.4% మేరకు మాత్రమే ఉంది. ఈ భూముల్లో జీవామృతంతోపాటు పంచగవ్యతోపాటు.. వివిధ రకాల సేంద్రియ సేద్య పద్ధతులను అనుసరించడం మేలు. ద్విదళ, ఏకదళ పంటలు కలిపి పండించడం, పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయడం, పంటల మార్పిడి పాటించడం..  కంపోస్టు లేదా పశువుల ఎరువు వీలైనంత ఎక్కువ మోతాదులో వేయాలి. భూమికి ఆచ్ఛాదన కల్పించాలి.. ఈ పద్ధతులన్నీ పాటిస్తే మంచిది.

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా భూముల్లో ఓసీ 0.3% ఉందని చెబుతున్నారు.. జీవామృతం వాడడంతోపాటు ఈ భూములను బాగు చేసే మార్గాలేమి ఉన్నాయి..?
 సేంద్రియ కర్బనం 0.3% అంటే చాలా తక్కువగా ఉన్నదని అర్థం. అటువంటి భూముల్లో రైతులు చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఎండు గడ్డి తదితరాలతో, పీకేసిన కలుపు మొక్కల వంటి ఏదైనా సేంద్రియ పదార్థంతో నేలకు ఆచ్ఛాదన కల్పించాలి. భూసారాన్ని పెంపొందించడానికి రైతులు చాలా శ్రమించాల్సి ఉంటుంది.

  బొత్తిగా వనరుల్లేని చిన్నకమతాల నిరుపేద రైతులకు సాధ్యమేనా?
 సాధ్యమే.. చూడండి సార్.. ఇది మైండ్‌సెట్‌కు సంబంధించిన అంశం. మనసుంటే మార్గం ఉంటుంది. తన పొలాన్ని సేంద్రియ సేద్యంలోకి మార్చి తీరాలన్న తపన ఉన్న రైతు తర్వాత 3,4 ఏళ్ల పాటు దీక్షగా కృషి చేయాలి. చుట్టుపక్కల బంజరు భూముల్లో చెట్టూ చేమా నరికి తెచ్చి కంపోస్టు చేయొచ్చు. పొలంలో ఆచ్ఛాదనగా వేయొచ్చు. పచ్చిరొట్ట పంటలు వేయి కలియదున్న వచ్చు. పశువుల ఎరువు సమకూర్చుకోవాలి. జీవామృతాన్ని ప్రతి 15 రోజులకు, వీలైతే వారానికోసారి భూమికి ఇవ్వగలిగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అంతేకాదు.. ఆలోచించి చేయాల్సింది సేంద్రియ వ్యవసాయం. రసాయనిక వ్యవసాయంలాగా కాదు. ప్రతి సేంద్రియ పొలమూ ప్రత్యేకమైనదే. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. రసాయనిక వ్యవసాయంలో పంట అవసరాన్ని బట్టి మనం ఎన్.పి.కె. ఎరువులు వేస్తాం. సేంద్రియ వ్యవసాయంలో భూమి సారాన్ని పెంచుతాం. సారవంతమైన భూమి దిగుబడినిస్తుంది.

  జీవామృతాన్ని భూమికి ఇవ్వడంతోపాటు పిచికారీపై కూడా అధ్యయనం చేశారా?
 జీవామృతాన్ని పంట భూముల్లో పోయడంపైనే అధ్యయనం చేశాం. పిచికారీపై చేయలేదు. పిచికారీకి పంచగవ్య బాగా ఉపయోగపడుతుంది. జీవామృతాన్ని పంట భూములకు ఎకరానికి 200 లీటర్ల చొప్పున ఇస్తుంటారు. మా పరిశోధనలో భాగంగా చెట్టు చిక్కుడు (ఫీల్డ్ బీన్) పంటకు.. పది రెట్లు ఎక్కువగా.. ఎకరానికి రెండు వేల లీటర్ల చొప్పున జీవామృతాన్ని మూడు విడతలుగా (15 రోజులకు, 30 రోజులకు, 45 రోజులకు) ఇచ్చినప్పుడు చిక్కుడు దిగుబడి అంతకుముందుకన్నా 30% పెరిగింది.

  గ్రాము జీవామృతంలో ఎన్ని సూక్ష్మజీవులుంటాయి?
 స్థిరంగా ఉండదు. బ్యాచ్‌ను బట్టి మారుతూ ఉంటుంది... గ్రాము జీవామృతంలో 20 - 30 లక్షల వరకు నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు ఉంటాయి. మిగతావన్నీ కలిపితే అంతకు పది రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే.. ద్రవరూప సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా సేంద్రియ సేద్యం చేయడం సులువైన మార్గం.

  సేంద్రియ కూరగాయల సాగులో పోషకాల లోపం ఉంది.. మీరేమంటారు?
 దేశీ ఆవు పేడ, మూత్రం, పంట వ్యర్థాలు, వేప, కానుగ, సీతాఫలం, పార్థీనియం తదితర మొక్కల సేంద్రియ వ్యర్థాలను ప్రత్యేకంగా నిర్మించిన సిమెంటు తొట్టె (బయోడెజైస్టర్ )లో వేసి 20-25 రోజులు (బెల్లం, మజ్జిగ కలిపితే ఇంకా ముందే వాడొచ్చు) కదిలించకుండా మురగబెట్టి.. ఆ ద్రవాన్ని నీటితోపాటు పంటలకు ఇవ్వొచ్చు. పిచికారీ చేయొచ్చు. రాగి, వేరుశనగ, వరి తదితర పంటల్లో ఇది మంచి ఫలితాలనిచ్చింది. ఈ ద్రవరూప ఎరువు అదనపు పోషకాలను అందించడంతోపాటు చీడపీడలను తట్టుకునే శక్తినిస్తుంది.

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే శిక్షణ ఇస్తారా?
 స్వల్ప ఖర్చుతో రైతు స్థాయిలో తయారు చేసుకోగల సేంద్రియ ద్రవ రూప ఎరువులపైనే ఎక్కువగా మేం అధ్యయనం చేస్తున్నాం. దీనిపై ఆసక్తి ఉంటే తప్పకుండా శిక్షణనిస్తాం. అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధమే. మీ వాళ్లెవరైనా తెలుగులోకి తర్జుమా చేసి చెప్పగలిగితే తెలుగు రైతులకు కూడా శిక్షణ ఇస్తాం. కనీసం 25-35 మంది ఉండాలి. కనీసం 3 రోజులు శిక్షణ ఇవ్వొచ్చు. లిఖితపూర్వకంగా విజ్ఞాపన పంపితే శిక్షణ ఇస్తాం. అంతేకాదు.. జీవామృతం, పంచగవ్య తదితర ద్రవరూప ఎరువుల నమూనాలను స్వల్ప ధరకే మా లేబరేటరీలో పరీక్షించి.. నివేదికలు అందజేస్తాం.
 - ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్ prambabu.35@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement