రసాయనిక ఎరువులతో ప్రజారోగ్యానికి ముప్పు! | Public health threat of chemical fertilizers! | Sakshi
Sakshi News home page

రసాయనిక ఎరువులతో ప్రజారోగ్యానికి ముప్పు!

Published Tue, Aug 23 2016 4:17 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

రసాయనిక ఎరువులతో ప్రజారోగ్యానికి ముప్పు! - Sakshi

రసాయనిక ఎరువులతో ప్రజారోగ్యానికి ముప్పు!

దేశంలో వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం ప్రభావంపై 31 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన స్థాయీ సంఘం (2015-16) అధ్యయనం చేసింది. బీజేపీ ఎంపీ హుకం దేవ్‌నారాయణ్ యాదవ్ అధ్యక్షతన గల ఈ స్థాయీ సంఘం ఈనెల 11వ తేదీన పార్లమెంటు ఉభయ సభలకు నివేదికను సమర్పించింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అతిగా వాడటం వల్ల భూసారం దెబ్బతినడం, పంట దిగుబడుల్లో పెరుగుదల మందగించడంతోపాటు.. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి, పశువుల ఆరోగ్యానికి ముప్పు వచ్చిందని  ఆందోళన వెలిబుచ్చింది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకుంటూనే.. సేంద్రియ రైతులకు సాంకేతిక సహాయంతోపాటు నేరుగా ఆర్థిక తోడ్పాటునివ్వడం అవసరమని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం..
 
 1960వ దశకం నుంచి దేశంలో అమలుచేస్తున్న హరిత విప్లవం వల్ల వరి, గోధుమల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగి మన అవసరాలు తీరడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే దశకు చేరామని పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక వివరించింది. 1960-61లో 8.3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014-15 నాటికి 25.27 కోట్ల టన్నులకు పెరిగింది. 1960వ దశకంలో 10 లక్షల టన్నుల కన్నా తక్కువగానే రసాయనిక ఎరువులు వాడేవాళ్లం. 2014-15 నాటికి వీటి వాడకం 2.56 కోట్ల టన్నులకు పెరిగింది.
 హెక్టారుకు బంగాళదుంపల సాగులో 347 కిలోలు, చెరకు సాగులో 239 కిలోలు, పత్తి సాగులో 193 కిలోలు, గోధుమ సాగులో 177 కిలోలు, వరి సాగులో 165 కిలోల రసాయనిక ఎరువులు వాడుతున్నాం.

 ప్రజారోగ్యంపై రసాయనిక ఎరువుల ప్రభావం ఎలా ఉంది? అని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ఆరోగ్య పరిశోధనా విభాగాన్ని ప్రశ్నించింది. ఈ విభాగం ఏం చెప్పిందంటే.. మోతాదుకు మించి / అశాస్త్రీయంగా రసాయనిక ఎరువులు పంటలకు వేయటం వల్ల పర్యావరణానికి హాని జరగడంతోపాటు ప్రజల ఆరోగ్యం పరోక్షంగా దెబ్బతింటున్నది. మనుషులతోపాటు జంతువులను కూడా రసాయనిక ఎరువులు తీవ్రమైన జబ్బుల పాలు చేస్తున్నాయి. రసాయనిక ఎరువుల్లో ఉండే పాదరసం, సీసం, సిల్వర్, నికిల్, సెలీనియం, థాలియం, వనాడియం, కాడ్మియం, యురేనియం వంటి భార ఖనిజాలు మనుషుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయని కేంద్ర ఆరోగ్య పరిశోధనా విభాగం పేర్కొంది. ఈ భార ఖనిజాలు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం పనితీరును దెబ్బతీస్తుండడంతోపాటు కేన్సర్ కారకాలుగా మారుతున్నాయి. రసాయనిక ఎరువుల కారణంగా మనుషుల్లో బ్రెయిన్ కేన్సర్, లింఫొమ, ప్రొస్టేట్ కేన్సర్, లుకేమియా, పెద్ద పేగు కేన్సర్ ముప్పు ఆరు రెట్లు పెరిగింది.  

 రసాయనిక ఎరువుల వాడకంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే చాలా ఎక్కువగా ఉందని స్థాయీ సంఘం స్పష్టం చేసింది.

 రసాయనాల ప్రభావంపై సమగ్ర సర్వే అవసరం
 వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయోత్పత్తుల వృద్ధి రేటు 1960-70లలో 8.37% ఉండగా, 2000-2010 నాటికి 2.61%కి తగ్గిపోయింది. సాంద్ర వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం, రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరగడంతో భూసారం బాగా క్షీణించింది. జింక్, ఐరన్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలు భూమిలో లోపించడం వల్ల, ఆ భూముల్లో పండించిన పంటలు తిన్న మనుషులకు అనేక జబ్బులు వస్తున్నాయని.. మనుషులు, పశువుల్లో ఎదుగుదల దెబ్బతింటున్నదని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ర్పభావం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఏ విధంగా ఉందో కచ్చితంగా తెల్సుకునేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2025 నాటికి 30 కోట్ల టన్నుల మేరకు మన దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచుకోవాల్సి ఉంది. కాబట్టి రసాయనిక ఎరువులను భూసార పరీక్షల ఆధారంగా సముచితంగా వాడేలా రైతులను చైతన్యవంతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టాలని స్థాయీ సంఘం సూచించింది.

 ద్రవరూప సేంద్రియ ఎరువులకూ సబ్సిడీ
 భూసారాన్ని, సూక్ష్మజీవరాశిని పెంపొందించే పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువు, జీవన ఎరువుల వాడకం, పంట మిగుళ్లను తిరిగి భూమిలో కలియదున్నటం వంటి పద్ధతులపై రైతుల్లో అవగాహన కలిగించాలని సూచించింది. రసాయనిక ఎరువుల సబ్సిడీ విధానాన్ని సమూలంగా మార్చాలి. ప్రకృతికి అనుగుణమైన జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, ప్రభావశీలమైన ద్రవరూప సేంద్రియ (జీవామృతం, పంచగవ్య వంటి) ఎరువులను దక్షిణాది రైతులు ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడే సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులకు నేరుగా నగదు సబ్సిడీ అందించే మార్గాలను అన్వేషించాలని, మన దేశానికి అనుగుణమైన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి స్థాయీ సంఘం సిఫారసు చేసింది.    

 సేంద్రియ సేద్యం చేపట్టే రైతులకు నేరుగా సాయం
 పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని, పశుసంపదను రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ర్పభావం నుంచి కాపాడేందుకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వెనువెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థాయీ సంఘం కోరింది. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయంలోకి మారదలచుకునే రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయాన్ని వారికే నేరుగా అందించాలని.. అందుకు అవసరమైన సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించడంతోపాటు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరులను సమన్వయ పరచి, దీక్షతో ప్రణాళికాబద్ధమైన కృషి చేయాలని కేంద్రానికి స్థాయీ సంఘం సూచించింది. సేంద్రియ సేద్యంలోకి మారే దశలో రైతులకు విస్తరణ సేవలందించే యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని పేర్కొంది.

 ఎన్‌పిఎం పద్ధతులను ప్రోత్సహించాలని, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని నియంత్రించేందుకు పెస్టిసైడ్స్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని స్థాయీ సంఘం అభిప్రాయపడింది. రైతుసంఘాలు, నిపుణులు, స్వచ్ఛంద / పరిశోధనా సంస్థల ప్రతినిధులతో సంప్రదించి ఇన్‌సెక్టిసైడ్స్ యాక్ట్ 1968కు ఇప్పటి అవసరాలకు అనుగుణంగా సవరణలు చేయాలని కూడా స్థాయీ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
 - పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్
 
 పురుగుమందుల సంగతేమిటి?

 పంటలపై రసాయనిక పురుగుమందులు విచక్షణారహితంగా వాడటం వల్ల ఎటువంటి ప్రభావం ఉంది? అని కేంద్ర వ్యవసాయ శాఖను పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశ్నించింది. అయితే, రసాయనిక పురుగుమందుల ప్రభావాలపై తమ శాఖ ఎటువంటి అధ్యయనమూ చేయలేదని కేంద్ర వ్యవసాయ శాఖ సెలవిచ్చింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement