బొరియలు చేసే వానపాములతోనే భూమికి బలిమి!
విదేశీ వానపాములతో భూములకు ఉపయోగం లేదు.. కంపోస్టు తయారీకే అవి పరిమితం!
అనుదినం భూసారాన్ని పెంచేది మన భూముల్లో ఉండే దేశీ (స్థానిక) వానపాములే!
డా. సుల్తాన్ అహ్మద్ ఇస్మాయిల్ వెల్లడి
మన భూములను నిరంతరం సారవంతం చేయడం మన నేలల్లో స్వతహాగా ఉండే స్థానిక వానపాముల ద్వారానే సాధ్యమవుతుందని.. విదేశీ వానపాములతో వర్మీ కంపోస్టు తయారు చేయవచ్చే తప్ప, వీటి వల్ల మన నేలలకు ఎటువంటి ప్రయోజనమూ లేదని డాక్టర్ సుల్తాన్ అహ్మద్ ఇస్మాయిల్ తేల్చి చెప్పారు. మట్టిలో జీవరాశి, పర్యావరణంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన శాస్త్రవేత్త డా. సుల్తాన్. చెన్నై న్యూ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ‘ఎకోసైన్స్ రీసెర్చ్ ఫౌండేషన్’ అనే సంస్థను నెలకొల్పారు. నిస్సారమైన మన భూములను స్థానిక వానపాముల ద్వారా తిరిగి సారవంతం చేసే పద్ధతులపై కృషి చేస్తున్నారు. ఆయన ఆంగ్లంలో రచించిన ‘ద ఎర్త్‌వార్మ్ బుక్’ ప్రసిద్ధి పొందింది. ఆయన భారతీయ సేంద్రియ రైతుల సంఘానికి సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన శాశ్వత వ్యవసాయ సదస్సుకు అతిథిగా విచ్చేసిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..
మన దేశంలో వానపాములకు, ఐసినా ఫోటిడా వంటి విదేశీ వానపాముల మధ్య ఉన్న తేడాలేమిటి?
ప్రపంచం మొత్తమ్మీద రెండు రకాల వానపాములున్నాయి. అవి.. 1. మెగాస్కోలెసిడె, 2. లూంబ్రిసిడె. లూంబ్రిసిడ్స్ పాశ్చాత్య దేశాల్లో ఉండే వానపాములు. ఐసినా ఫోటిడా రకం వానపాములు అటువంటివే. ఇవి కేవలం కంపోస్టు తయారీ కోసమే తెప్పించారు. భూమి లోపలికి వెళ్లకుండా పైపైనే ఉండే ఇటువంటి వానపాములే కంపోస్టింగ్‌కు పనికొస్తాయి. ఇక మెగాస్కోలెసిడ్స్.. మన భారతదేశంలోని భూముల్లో సహజంగా ఉండే వానపాములు ఈ కోవకు చెందుతాయి. వీటిల్లో కొన్ని ఉపజాతులున్నాయి. పేడ ఉన్న చోట ఇవి కనిపిస్తాయి. ఇవి నిరంతరం భూమికి బొరియలు చేస్తూ కిందికీ పైకీ తిరుగుతూ భూమిని చక్కగా సారవంతం చేస్తుంటాయి. అయితే, మన వాళ్లకు విదేశీ వానపాములంటే మోజు. వీటి పని తినటం, విసర్జించడం.. అంతే. విదేశీ వానపాముల వల్ల మన భూములకు ఎటువంటి ఉపయోగమూ లేదు!
విదేశీ వానపాముల వల్ల భూములకు ఉపయోగమే లేదంటారా?
అవును. వీటి వల్ల మన భూములకు అసలేమీ ఉపయోగం లేదు. ఇవి కంపోస్టు తయారీకి మాత్రమే ఉపయోగపడతాయి. అందువల్లనే ఇవి కంపోస్టు షెడ్లలోనే కనిపిస్తాయి. భూమిలోకి బొరియలు చెయ్యవు కాబట్టి వీటి వల్ల భూములకు నేరుగా ఎటువంటి ఉపయోగమూ లేదు.. అవి తింటాయి, విసర్జిస్తాయి. అదే కంపోస్టు. దాన్ని పొలాలకు వేస్తున్నాం.
అది పోషక విలువలతో కూడినదేనా?
ఆ.. ఆ.. కంపోస్టు భూమికి పోషకాలను అందిస్తుంది. అందులో సందేహం లేదు. కానీ, ఇక్కడ విషయమేమిటంటే.. మన భారతీయ వానపాములు కంపోస్టును అందించడంతో పాటు.. భూమిలోకి లోతుగా బొరియలు చేస్తున్నాయి. తద్వారా భూమి పొరల్లోకి గాలి ప్రసరించేలా చేస్తున్నాయి. వేర్లు పెరుగు దలకు దోహదపడతున్నాయి. సేంద్రియ పదార్ధాన్ని భూమి లోతుల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇవీ వానపాముల వల్ల అదనంగా సమకూరుతున్న ప్రయోజనాలు. ఎంత ఎక్కువ వర్మీ కంపోస్టును బయటి నుంచి తెచ్చి పొలాల్లో వేస్తున్నాం అన్నది కాదు ముఖ్యం.. భూమికి తన సొంత వానపాములంటూ ఉండాలి. అప్పుడే ఆ భూమి సంపూర్ణంగా సారవంతంగా ఉండగలుగుతుంది..
అంటే.. పంట భూమిలో స్థానిక వానపాములను పెంపొందించే పనులు చేయకుండా.. కేవలం వర్మీ కంపోస్టును తీసుకెళ్లి వేయడం వృథా అనేనా మీ అభిప్రాయం..?
వృథా అని కాదు, నా అభిప్రాయం.. భూసారాన్ని పెంపొందించే ప్రక్రియను మొదలు పెట్టడానికి వర్మీ కంపోస్టు ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం అందుతుంది. అంతే. స్థానిక వానపాముల వంటి జీవులు భూమిలో ఉండి పనిచేస్తే తప్ప నిస్సారమైపోయిన భూమి తిరిగి జవజీవాలను సంతరించుకోలేదు. ఉదాహరణకు... డాక్టర్ వ్యాధిని తగ్గించడానికి ఔషధం ఇస్తాడు. అయితే, ఆరోగ్యవంతం కావడం అనేది దేహం లోపలి నుంచే జరగాలి! అలాగే వర్మీ కంపోస్టును భూమికి ఔషధం మాదిరిగానే అందిస్తున్నాం..
ఐసినా ఫోటిడ వానపాములతో వర్మీ కంపోస్టు తయారు చేస్తే కంపోస్టులో భారఖనిజాలు వస్తాయని అంటున్నారు..?
అలా జరగదు. వానపాములన్నీ రైతు మిత్రులే. కంపోస్టుకు మాత్రమే ఉపయోగపడే వానపాముల కన్నా.. భూమికి బొరియలు చేసే రకం వానపాములతో మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఐసినా ఫోటిడ వానపాములకు వేసే పేడ, ఇతర వ్యర్థాలలో భారఖనిజాలుంటే.. కంపోస్టులో కూడా భారఖనిజాలు ఉంటాయి. అందులో లేకపోతే.. కంపోస్టులోనూ ఉండవు. కంపోస్టు చేయడానికి వాడే ముడిపదార్థాల విషయంలో చాలా జాగ్రత్తవహించాలి. కొందరు మున్సిపాలిటీ చెత్తకుప్పల్లో నుంచి చెత్తను తీసుకెళ్లి కంపోస్టు చేయకుండానే నేరుగా పొలాల్లో వేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం.
రసాయనిక ఎరువులు వల్ల భూముల్లో 0.4 శాతానికి తగ్గిపోయిన సేంద్రియ కర్బనాన్ని పెంచే మార్గం ఏమిటి?
పంట భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు పుష్కలంగా ఉంటేనే ఆ భూమి సజీవంగా, సారవంతంగా ఉంటుంది. రసాయనిక ఎరువులు ఎక్కువగా వేసిన భూముల్లో సూక్ష్మజీవులు, వానపాములు నశించిపోయాయి. నేలల్లో సేంద్రియ కర్బనం శాతాన్ని పెంపొందించాలన్నా, సూక్ష్మజీవులు, వానపాములను పెంపొందించాలన్నా.. గడ్డీ గాదాన్ని పొలంలో కలియదున్నాలి. పశువుల ఎరువును తగినంత వాడాలి. పూర్వం ఎకరం పొలానికి ఒకటి చొప్పున రైతుల దగ్గర ఆవులు ఉండేవి. పశువులు లేకుండా వ్యవసాయాన్ని తిరిగి నిలబెట్టడం సాధ్యం కాదు.
జెర్సీ ఆవు పేడ కన్నా.. నాటు ఆవు పేడ అధిక ప్రయోజనకరమన్న అభిప్రాయం ఉంది. మీరేమంటారు..?
డబ్బున్న రైతులే జెర్సీ ఆవులను పెంచుతున్నారు. పేద రైతుల దగ్గర ఉన్నది నాటు (దేశీ) ఆవులే. నాటు ఆవులతో పాటు జెర్సీ తదితర విదేశీ ఆవుల పేడలపై అధ్యయనం చేయగా.. పెద్ద తేడా కనిపించలేదు. భూములను బాగు చేసుకోవడం అత్యవసరం. పేద రైతులు తమ దగ్గరున్న ఏ పశువు పేడైనా, మూత్రమైనా సరే ఉపయోగించవచ్చు. ఇంకా చెప్పాలంటే.. మనిషి విసర్జితాలనూ ఎరువుగా వాడొచ్చు. అయితే, బాగా వేడి పుట్టే పద్ధతిలో కంపోస్టు చేసిన తర్వాతేవాడాలి. పశువుల మూత్రం మాదిరిగానే.. మనిషి మూత్రాన్ని కూడా ఒకటికి పది పాళ్లు నీరు కలిపి పంటలకు వాడుకోవచ్చు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలూ అవసరం లేదు.
(డా. సుల్తాన్ ఇస్మాయిల్‌ను 093848 98358 నంబరులో లేదా sultanismail@gmail.com ద్వారా సంప్రదించవచ్చు)
ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్