అవార్డు అందుకుంటున్న సాక్షి జర్నలిస్టు పంతంగి రాంబాబు
రాజేంద్రనగర్: దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతు బిడ్డ కూడా రైతే కావాలని కోరుకునే రోజు రావాలన్నారు. రాజేంద్రనగర్‌లోని వాలంతరీలో సోమవారం జరిగిన జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం రైతులు తమ సంతానాన్ని రైతుగా చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాబోయే రెండేళ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు అందనుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి, నీటి పారుదలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రయోగశాలలోని ఫలితాలు వ్యవసాయ క్షేత్రాలకు చేరాలని పేర్కొన్నారు. రెండు నెలల పాటు శిక్షణ పొంది సర్టిఫికెట్లు అందుకున్న రైతులు గ్రామాల్లో తిరుగుతూ సమగ్ర వ్యవసాయంపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, వాలంతరీ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ జర్నలిస్టుకు అవార్డు..
సాక్షి దినపత్రిక జర్నలిస్టు పంతంగి రాంబాబుకు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అవార్డు అందించారు. రాంబాబు ‘సాక్షి’లో సాగుబడి శీర్షికపై వార్తలను అందిస్తున్నారు. అలాగే టీ న్యూస్‌లో చేను చెలక కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్న విద్యాసాగర్‌రెడ్డికి కూడా అవార్డు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment