శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి | Stay Clean And Be Healthy | Sakshi
Sakshi News home page

శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి

Published Thu, Nov 21 2019 12:07 AM | Last Updated on Thu, Nov 21 2019 12:34 AM

Stay Clean And Be Healthy - Sakshi

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మేని పరిశుభ్రత చాలా కీలకమైన భూమిక పోషిస్తుంది. నిజానికి ఆహారం కంటే ముందుగా దానికే ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా... సూక్ష్మజీవులకూ, రోగకారక క్రిములకూ ఎక్స్‌పోజ్‌ అవుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతిని, రోగాలను ఆహ్వానించినట్లవుతుంది.

అందుకే వ్యక్తిగత శుభ్రత (పర్సనల్‌ హైజీన్‌) పాటించడం చాలా ముఖ్యం. చాలామంది పొద్దున్నే ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం మాత్రమే వ్యక్తిగత శుభ్రత అనుకుంటారు. కానీ పర్సనల్‌ హైజీన్‌ పరిధి అంతకంటే కూడా ఎక్కువే. జుట్టు చివరి నుంచి పాదం చివరి గోరువరకూ ప్రతి అవయవాన్నీ శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో అవగాహన కల్పించేందుకే ఈ కథనం.

నోటి సంరక్షణ ఇలా
ప్రతిరోజూ పొద్దున్నే మనం పళ్లను బ్రష్‌ చేసుకుంటాం. వాస్తవానికి ఆహారం తీసుకున్న ప్రతిసారీ పళ్లను శుభ్రపరచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత విధిగా బ్రష్‌ చేసుకోవాల్సిందే. అయితే రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండే మనందరికీ అది అంతగా కుదిరే పని కాకపోవచ్చు. అందుకే తిన్న తర్వాత ప్రతిసారీ బ్రష్‌ చేసుకోలేకపోయినా... నోట్లోకి నీళ్లు తీసుకుని కనీసం రెండుమూడు సార్లు పుక్కిలిస్తూ నోరంతా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత మన నోటిలో బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ప్రతిరోజూ ఎలాగూ ఉదయం, రాత్రి నిద్రపోబోయే ముందు బ్రషింగ్‌ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. బ్రషింగ్‌ తర్వాత మన చిగుర్లపైన వేలిచివరి భాగాన్ని గుండ్రంగా తిప్పుతున్నట్లుగానూ, మసాజ్‌ చేసుకుంటున్నట్లుగానూ రాయాలి. దీనివల్ల చిగుర్లకు రక్తప్రసరణ పెరిగి చిగుర్ల వ్యాధులు నివారితమవుతాయి.

మార్కెట్‌లో దొరికే మౌత్‌వాష్‌లతో తరచూ నోరు కడుక్కుంటూ ఉండటం కూడా మంచిదే. నోటి దుర్వాసన ఉంటే... కొందరిలో ఎంత శుభ్రం చేసుకున్నప్పటికీ వారు నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. అలాంటివారు తరచూ మౌత్‌వాష్‌తో శుభ్రం చేసుకోవడం మంచిది. పొగతాగడం, పొగాకు నమలడం వంటి దురలవాట్లు నేరుగా నోటి దుర్వాసనకు కారణం కావడంతో పాటు నోటి ఆరోగ్యాన్నీ, శరీర ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తాయి. దుర్వాసనకు కారణమవుతాయి. అందుకే అలాంటి దురలవాట్లు మానేయాలి. ఇక ఉల్లి, వెల్లుల్లి తినగానే అందులోని సల్ఫర్‌ కారణంగా నోటి నుంచి కాసేపు దుర్వాసన వస్తుంటుంది కాబట్టి పగటి వేళల్లో ముఖ్యం పనిచేసే చోట్ల అవి ఉన్న ఆహారం తీసుకోకపోవడమే మేలు. ఇక నోటి పూర్తి సంరక్షణ కోసం కనీసం ప్రతి ఆర్నెల్లకోసారి డెంటిస్ట్‌ను కలిసి స్కేలింగ్‌ చేయించుకోవాలి.

చెవుల సంరక్షణ
చాలా మంది చెవుల శుభ్రతను పట్టించుకోరు. స్నానం సమయంలోనూ, ముఖం కడుక్కునే సమయంలోనూ చెవుల మీద సబ్బు రాసుకొని శుభ్రపరచుకోరు. మనం ఎక్స్‌టర్నల్‌ ఇయర్‌ పిన్నా అని పిలుచుకునే బాహ్య చెవిని కూడా స్నానం సమయంలో శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. అలాగే  కాసిని నీళ్లతో చెవిలో కాస్తంత లోపలి వరకూ శుభ్రం చేసుకోవాలి. అయితే చెవుల్లోకి మరింత లోతువరకు నీళ్లు పోకుండా చూసుకోవాలి. చాలామంది ఏమీ తోచనప్పుడల్లా చెవుల్లోకి పిన్నీసులూ, అగ్గిపుల్లలూ... కాస్తంత పట్ణణవాసులైతే ఇయర్‌బడ్స్‌ వంటి వాటితో చెవిలోపల కెలుకుతూ గువిలి తీస్తుంటారు.

మన చెవుల్లోని గులివి చెవికి రక్షణ కల్పించడం కోసమే నిత్యం స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోడానికి ఇయర్‌బడ్స్‌ లాంటివి వాడకూడదు. ఇక చెవిలోని గువిలిని శుభ్రం చేయడం కోసం పదునైన పిన్నులు, అగ్గిపుల్లల వంటివి వాడటం వల్ల చెవిలోపలి భాగం గాయపడవచ్చు లేదా గువిలి మరింత లోపలికి చేరవచ్చు. చెవి లోపల గువిలి మరీ ఎక్కువగా ఉంటే ‘డీ–వ్యాక్స్‌’ అనే చుక్కల మందును వేసుకుని, ఈఎన్‌టీ డాక్టర్‌ను సంప్రదిస్తే వారే సురక్షితమైన రీతిలో చెవులను శుభ్రపరుస్తారు.

స్నానం చేయడం ఇలా...
 ప్రతిరోజూ అందరూ స్నానం చేస్తారు. కానీ ఆ స్నానం వల్ల మనం పూర్తిగా శుభ్రపడ్డామా అన్నది చూసుకోరు. ముఖ్యంగా పిల్లలు. ఉదాహరణకు పిల్లలే కాదు... చాలా మంది పెద్దలు కూడా తమ చెవుల వెనక భాగాలనూ, మెడ వెనకా, శరీరంలో చర్మం మడతపడే చోట్లనూ శుభ్రం చేసుకోరు. తలస్నానం చేయడమిలా: తలస్నానం అన్నది క్రమం తప్పని ఇంటర్వెల్స్‌లో చేయాలి. కొందరు తలస్నానం చేసే ముందు తలకు నూనె రాసుకుంటారు.

కానీ  అందరి తలలకూ నూనె అవసరం లేదు. కేవలం పొడిబారినట్లు ఉండే చర్మమూ, వెంట్రుకలు ఉన్నవారు తలస్నానానికి ముందర నూనెతో మృదువుగా మర్దన (మసాజ్‌) చేసుకోవాలి. (జిడ్డుచర్మం ఉండేవారు తలకు నూనె రాయకపోయినా పర్వాలేదు). ఆ తర్వాత అదంతా శుభ్రమయ్యేలా మంచి షాంపూతో స్నానం చేయాలి. చలికాలం లాంటి రోజుల్లో కూడా ప్రతిరోజూ స్నానం చేయండి. వేసవిలో అయితే కనీసం ఉదయం, సాయంత్రం రెండుపూటలా స్నానం చేయడం మంచిది.

రోజూ ముఖం కడుక్కోండి
మన దేహంలో బట్టలు తొడగని భాగాలు... అంటే చేతులు, ముఖం వంటి ఆచ్ఛాదన ఉండని భాగాలు తక్షణం కాలుష్యానికి గురవుతాయి. ఆ భాగాల్లో వెంటనే  చేరుతుంటుంది. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. కాబట్టి వీలైనప్పుడల్లా ముఖంతో పాటు బట్టల కవర్‌ చేయని చేతులు, అరికాళ్లు కడుక్కుంటూ ఉండటం మంచిది. దీనివల్ల ముఖంపైన బ్యాక్టీరియా చేరడం వల్ల వచ్చే మొటిమల వంటి సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ముఖం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

మేనిని ఇలా శుభ్రం చేసుకోండి
మన శరీరంపై చాలాచోట్ల చర్మం ముడుతలు పడి ఉంటుంది. ఉదాహరణకు మెడ, భుజాలు, బాహుమూలాల వద్ద, తొడలు, గజ్జల వద్ద చర్మం ముడుతలతో ఉంటుంది. ఇలాంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడుతలు ఉన్నచోట్ల ప్రత్యేకంగా పూర్తిగా పొడిగా అయ్యేలా టవల్‌తో తుడుచుకోవాలి. ఇక బాహుమూలాల కింద కొందరు డియోడరెంట్స్, యాంటీ పెర్‌స్పిరెంట్స్‌ వంటి స్ప్రేలు వాడుతుంటారు. అవి వాడటం కొంతవరకు పరవాలేదు కానీ ఎక్కువగా వాడటం సరికాదు.

ఇలాంటివి సరిపడనివారు వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. చాలామందిలో పొడి చర్మం ఒక సమస్యగా పరిణమిస్తుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో వారి సమస్య రెట్టింపవుతుంది. ఇలాంటివారు మాయిష్చరైజింగ్‌ క్రీమ్స్‌ రాసుకోవాలి.ఇక చలికాలంలోనైతే ఇది తప్పనిసరి. లేకపోతే చర్మం మీద మంట, దురద వస్తాయి. పొడిచర్మం ఉన్నవారి చర్మంపై గీరుకుపోయినా, కాస్తంత ఒరుసుకుపోయినా వారి పైచర్మం దోక్కుపోయి కిందిచర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్‌కు గురికావచ్చు.

నఖారవిందాల కోసం
గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్‌ చేసుకోవాలి. అంటే గోరు చివరకంటా కత్తిరించకుండా, మకొద్దిపాటి గోరంచు ఉండేలా కట్‌ చేసుకోవాలి. గోరు మరీ ఎక్కువగా పెరగకుండా ఎప్పటికప్పుడు ఇలా కత్తిరించుకుంటూనే ఉండాలి. మట్టిచేరకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భోజనం చేసే సమయంలో గోళ్ల ద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. తద్వారా నీళ్లవిరేచనాలు, గ్యాస్ట్రోఎంటిరైటిస్‌ వంటి ఎన్నోరకాల వ్యాధులను నివారించుకున్నట్లూ అవుతుంది. ఇదే సూచన పాదాల గోళ్లకు కూడా వర్తిస్తుంది. కొందరు గోళ్లను చిగుర్లలోపలికి కట్‌ చేసుకుంటారు. ఇలాంటి వాళ్లలో గోటి చివర ఇన్ఫెక్షన్‌ వచ్చి, ఆ తర్వాత గోరు లోపలికి పెరుగుతూ చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే కాలిగోర్లు కట్‌ చేసుకునే సమయంలో మరీ అంచుల చిగుర్లలోకి కట్‌ చేసుకోకూడదు.

చేతులు శుభ్రం చేసుకోవడం ఇలా...
మనం ఆహారం తీసుకునే ముందర క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే మూత్ర, మల విసర్జన తర్వాత వీలైతే సబ్బుతోనో, హ్యాండ్‌వాష్‌తోనో తప్పక శుభ్రం చేసుకోవాలి. దీనికి కారణం ఉంది. వాష్‌రూమ్‌ తలుపు తెరవడం కోసం ప్రతివారూ తప్పనిసరిగా ‘నాబ్‌’ను ముట్టుకుంటారు. వారి చేతులకు ఏవైనా బ్యాక్టీరియల్, వైరల్, ఏకకణజీవుల వంటి పరాన్నజీవులు అంటుకొని ఉంటే... వారు ముట్టుకున్న ప్రదేశాన్నే మళ్లీ మనం ముట్టుకోవడం వల్ల మనకూ ఆ వైరస్, బ్యాక్టీరియా, ఏకకణజీవులు అంటుకు పోయి వ్యాధులు సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే వాష్‌రూమ్‌కు వెళ్లివచ్చాక తప్పక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక హాస్పిటల్‌లో పనిచేసేవారు సైతం తరచూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండటం అవసరం. వీలైతే ఆల్కహాల్‌ బేస్‌డ్‌ హ్యాండ్‌వాష్‌లు వాడటం కూడా చాలవరకు మంచిదే.

పాదాల శుభ్రత...
మన కాళ్లనూ, మోకాళ్లనూ, పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మన మడమలు శుభ్రంగా ఉన్నాయా లేక ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్నది పరీక్షించుకోండి. పాదాలపై పుండ్లుగానీ, ఇన్ఫెక్షన్లుగానీ, పగుళ్లుగానీ ఏర్పడకుండా సంరక్షింకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోండి. పాదాలు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా పొడిఅయ్యేంతవరకూ తుడుచుకోండి. కాలివేళ్ల గోళ్లు తీసుకుంటూ ఉండాలి.

ఇలాంటి సమయంలో ముఖ్యంగా మన కాలి బొటనవేలి (పెద్దనేలు) గోరును జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక మన పాదరక్షలు ధరించినప్పుడు అవి కాలికి సౌకర్యంగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. షూ ధరించేవారు పరిశుభ్రమైన సాక్స్‌ను మాత్రమే తొడుక్కోవాలి. మామూలు వారిలోకంటే పాద సంరక్షణ డయాబెటిస్‌ రోగుల్లో మరింత ఎక్కువ అవసరం. హైహీల్స్‌ కాకుండా తక్కువ హీల్‌ ఉన్న పాదరక్షణలే వేసుకోవాలి. ఇక్కడ పేర్కొన్న విధంగా రోజూ దేహ పరిశుభ్రత పాటిస్తే మేనూ, మనసూ ఈ  రెండూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా హాయిగానూ ఉంటామని గుర్తుంచుకోవాలి.

డాక్టర్‌ శ్యామల అయ్యంగార్, సీనియర్‌ కన్సల్టెంట్,
ఫిజీషియన్‌ అండ్‌ డయాబెటాలసిస్ట్,
అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement