ఒత్తిడి సైలెంట్‌ కిల్లర్‌.. స్ట్రెస్‌తో వచ్చే వ్యాధులేంటో తెలుసా? | Stress Symptoms: Physical Effects Of Stress On Body | Sakshi
Sakshi News home page

ఒత్తిడి సైలెంట్‌ కిల్లర్‌.. స్ట్రెస్‌తో వచ్చే వ్యాధులేంటో తెలుసా?

Published Mon, Sep 5 2022 9:37 AM | Last Updated on Mon, Sep 5 2022 12:39 PM

Stress Symptoms: Physical Effects Of Stress On Body - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లబ్బీపేట(విజయవాడతూర్పు): మానసికంగా బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరంగా జీవించగలం... మనసు, ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ద్వారానే ఎవరైనా ప్రశాంతంగా జీవించేందుకు వీలుంటుంది. కానీ నేటి పోటీ ప్రపంచంలో  ఉరుకులు, పరుగుల జీవన విధానంలో యంత్రాల్లా మారిన జీవితంలో ప్రతి ఒక్కరూ  ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విధి నిర్వహణ, వ్యాపారం, ఉద్యోగరీత్యా  ఇలా రకరకాల ఒత్తిళ్లు సహజంగానే ఉంటున్నాయి.
చదవండి: దగ్గును బలవంతంగా ఆపుకోకండి!

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు సైతం ఎక్కువగానే వస్తున్నాయి.  తీవ్రమైన ఒత్తిళ్లు చుట్టుముడుతూ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. ఆ ఫలితంగా శారీరక సమస్యలు చుట్టు ముడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో భయం, ఆందోళన, ఒత్తిడితోనే ఎక్కువ మంది శ్యాస ఇబ్బందులతో మృతి చెందినట్లు వైద్యులు అంటున్నారు.

హార్మోన్స్‌పై ప్రభావం..
మానసికంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో డొపమైన్, కార్టిసోల్‌ అనే హార్మోన్స్‌ ఉత్పత్తి అవుతాయి. ఇవి మిగతా  హార్మోన్స్‌పై ప్రభావం చూపుతాయని వైద్యులు అంటున్నారు. ఆ ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈటింగ్‌ డిజార్డర్స్‌తో కొందరు అసలు ఆహారం తీసుకోకపోవడం, మరికొందరు అధిక ఆహారం తీసుకోవడం చేస్తారు. దీంతో కొందరు రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటారని, మరికొందరు ఊబకాయలుగా మారుతున్నారు. అంతేకాదు తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో గ్యాస్టిక్‌ ప్రాబ్లమ్స్‌ కూడా వస్తాయి.

గుండె లయ తప్పుతుంది..
తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో హార్ట్‌బీట్‌లో తేడా వస్తుంది. ఒత్తిడి, ఆందోళన ఎక్కువైన వారిలో ఒక్కోసారి హార్ట్‌రేట్‌ పెరిగి సడన్‌ హార్ట్‌ ఎటాక్‌కు గురయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఒత్తిళ్లతో రక్తపోటు అదుపులో లేని వారిలో హెమరైజ్డ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ తరహా బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.

రిలాక్సేషన్‌ అవసరం..
ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, దాని పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు వ్యాయామం, యోగా, మెడిటేషన్‌  ఉపయోగకరంగా ఉంటాయి. వాటి ద్వారా మన ఆలోచనలను మళ్లించి మనసు రిలాక్సేషన్‌ కలిగేలా దోహదపడతాయి. ఏదైనా పనిలో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు దానికి ఉపశమనం కలిగే మార్గాన్ని అన్వేషించాలి.

మానసిక ప్రశాంతత అవసరం 
ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఒత్తిళ్లకు గురైనప్పుడు వ్యాయామం, యోగా, మెడిటేషన్‌ వంటివి చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. సమస్య ఎదురైనప్పుడు పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మానసిక ఒత్తిళ్లు శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. హార్మోన్‌పై ఎఫెక్ట్‌ చూపి షుగర్‌ లెవల్స్‌ పెరగడం, రక్తపోటు, హార్ట్‌రేట్‌లో తేడాలు వంటివి చోటుచేసుకుంటాయి. మానసికంగా  పటిష్టంగా ఉన్పప్పుడే శారీరకంగా బలంగా ఉంటారు. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించగలుగుతారు.
– డాక్టర్‌ వెంకటకృష్ణ, జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి జీజీహెచ్‌ 

ఏకాగ్రత తగ్గుతుంది
మానసికంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో ఏకాగ్రత తగ్గుతుంది. ఉద్యోగులైతే పనిమీద, విద్యార్థులైతే చదువుపై దృష్టి పెట్టలేరు. పనిని తర్వాత చేయవచ్చులే అని వాయిదా వేస్తూ ఉండటంతో సోమరితనం పెరిగిపోతుంది. ఇలాంటి వారు ఈటింగ్‌ డిజార్డర్‌కు గురవుతారు. అసలు ఆహారం తీసుకోకపోవడం, లేకుండా ఎక్కువ ఆహారం తీసుకోవడం చేస్తారు. దీంతో జీర్ణకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. మనసు, ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.  
– డాక్టర్‌ గర్రే శంకర్రావు, మానసిక నిపుణులు, విజయవాడ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement