- పెట్రోల్, పొగాకు ఉత్పత్తులపై పన్నులను జీఎస్‌టీ పరిధి నుంచి తొలగించండి
- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ వినతి
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధి నుంచి పలు రకాల పన్నులు తొలగించకపోతే రాష్ట్ర ఆదాయానికి భారీ గండి పడుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. జీఎస్‌టీ బిల్లు నుంచి పెట్రోల్, పొగాకు ఉత్పత్తులు, వ్యాపార ప్రకటనలపై పన్నులను మినహాయించాలని కేంద్రాన్ని కోరింది. అలాగే అంతరాష్ట్ర మద్యం రవాణాపై పన్నునూ జీఎస్‌టీ పరిధి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. తొలుత మద్యంపై పన్నును కూడా జీఎస్‌టీ కిందకు తీసుకువచ్చిన కేంద్రం.. రాష్ట్రాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కితగ్గింది.
అంతరాష్ట్ర మద్యం రవాణా పన్నును మాత్రం జీఎస్‌టీ నుంచి తొలగించలేదు. ఇది రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులపై 33.50 శాతం వ్యాట్‌ను విధిస్తోంది. తద్వారా నెలకు రూ.600 కోట్ల మేర ఆదాయం వస్తోంది. పెట్రోల్ ధరలు ఎంత పెరిగితే అంత ఎక్కువ మొత్తంలో రాష్ర్ట ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో ఆదాయం వస్తుంది.
(ఇటీవలి కాలంలో పెట్రోల్ లీటర్ ధర రూ.పదికి పైగా తగ్గిపోయింది.దీనితో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయంలో రూ.2,000 కోట్ల మేరకు గండిపడుతుందని అంచనా. అంతరాష్ట్ర మద్యం రవాణాపై ప్రవేశ పన్ను విధించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏపీకి మద్యం రవాణా అవుతోంది.
దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపన్ను విధిస్తోంది. మరోవైపు పొగాకు ఉత్పత్తులపై విధించే పన్ను ద్వారా రాష్ట్రానికి నెలకు రూ.32 కోట్ల ఆదాయం వస్తోంది. ఇక సిగరెట్లపై పన్ను జీఎస్‌టీ పరిధిలోకి వెళ్లనుంది.ప్రకటనలు, బెట్టింగ్, గాంబ్లింగ్‌లపై పన్నును స్థానిక సంస్థలు వసూలు చేస్తాయని, వాటని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువెళితే స్థానిక సంస్థలు నష్టపోతాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.