పులిబిడ్డ! | They do good work, are also tiger | Sakshi
Sakshi News home page

పులిబిడ్డ!

Published Mon, Jun 9 2014 10:24 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

పులిబిడ్డ! - Sakshi

పులిబిడ్డ!

స్ఫూర్తి
 
 సాహసం చేసే వాళ్లు మాత్రమే ‘పులిబిడ్డలు’ కాదు.
 మంచి పని చేసే వారు కూడా పులి బిడ్డలే.
 పులుల క్షేమంకోసం నడుం బిగించిన హన్స్ దలాల్....
 అక్షరాలా పులిబిడ్డే!

 
రకరకాల శబ్దాల గురించి, తన కెరీర్ గురించి తప్ప... హన్స్ దలాల్ పులుల గురించి ఆలోచించిన సందర్భం మునుపెన్నడూ లేదు. అదేమి చిత్రమో, మధ్యప్రదేశ్‌లోని కాన్హా నేషనల్ పార్క్‌లో పులిని చూసిన క్షణం నుంచి... పులుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆయనలో వెల్లువెత్తింది.
 
ముంబైలోని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ రాత్రి దలాల్‌కు నిద్ర పట్టలేదు. సాధారణంగా పులి అనగానే ఒకలాంటి గాంభీర్యం కళ్ల ముందు కదలాడుతుంది. తనకేమో వాటి దీనత్వం మాత్రమే కనిపించింది. వాటి మూగరోదన కళ్లలో కనిపించింది.
 
పులుల గురించి సమాచారాన్ని అంతర్జాలంలో చదువుతున్నప్పుడు అవి ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయనే విషయం అర్థమై దలాల్ మనసు కదిలిపోయింది. ‘‘పులులను వేటాడడం సాహసం కాదు. అది పిరికివాళ్లు మాత్రమే చేస్తారు. పులులను రక్షించడం సాహసం. అది కొందరు మాత్రమే చేస్తారు’’ అనుకున్న దలాల్ ఆ కొందరిలో తాను ఒకడు కావాలనుకున్నాడు. ‘ప్రావ్ల్’ (ప్రిజర్వేషన్ ఆఫ్ వైల్డ్ ల్యాండ్‌స్కేప్స్) పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. నిజానికి అప్పటికీ ఆయనకు కొన్ని స్వచ్ఛందసంస్థల మీద సదభిప్రాయం లేదు.
 
పులుల సంరక్షణ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాడు. వర్క్‌షాప్‌లు, క్యాంపులు నిర్వహించాడు. పులులకు సంబంధించి ఫుల్‌టైం ‘సమాచార కార్యకర్త’గా మారిపోయాడు. పట్టణంలో కంటే అడవుల దగ్గరే ఎక్కువ కాలం గడపడం అలవాటు చేసుకున్నాడు.
 
పులుల వేట మీద హృదయం ద్రవించే డాక్యుమెంటరీని తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రాజస్థాన్‌లోని మోగియ తెగ ప్రజలకు చూపెట్టాడు. మోగియలకు తరతరాలుగా వేట అనేది ప్రధాన వృత్తి. పులిని వేటాడిన వారిని ‘మొనగాడు’గా పరిగణిస్తారు. మొఘల్‌ల కాలానికి ముందు వీరికి ‘రాయల్ హంటర్’లుగా పేరు. రాజులతో కలిసి వేటకు వెళ్లేవారు. ఒకవిధంగా చెప్పాలంటే వారికి అడవిలో వేట తప్ప బయటి ప్రపంచం తెలియదు. వారిని అర్థం చేసుకోవడానికి దలాల్ అడవుల్లో చాలారోజుల పాటు గడిపాడు.
 
‘‘మీరు ఇలా కాదు... అలా ఉండాలి’’ అని చెప్పడానికి కూడా చాలామంది భయపడేవారు. ఎందుకంటే వారికి కోపం ఎక్కువ! అలాంటి వారు సైతం దలాల్ రూపొందించిన డాక్యుమెంటరీ చూసి చలించిపోయారు. ముంబై యూనివర్శిటీ, మెల్‌బోర్న్ యూనివర్శిటీల నుంచి ఆడియో ఇంజనీరింగ్‌లో డిగ్రీలు తీసుకున్న దలాల్ ముంబైలోని దేవానంద్ రికార్డింగ్ స్టూడియోలో మొదటి ఉద్యోగం చేశాడు.

ఆ తరువాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సౌండ్ ఇంజనీర్‌గా కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో... దలాల్ ఇలా పులుల సంరక్షణ అంటూ అడవులు పట్టుకు తిరగాలన్న నిర్ణయం గురించి విని ఆశ్చర్యపోయిన వారు తప్ప ‘మంచి నిర్ణయం’ అన్నవారు లేరు. ‘‘వణ్యప్రాణులను రక్షించాలనుకునే వాళ్లకు సహకారం అందించడమే మా సంస్థ ధ్యేయం’’ అని చెబుతున్న దలాల్ తొలి దశలో భాగంగా ఫారెస్ట్ గార్డ్‌లకు చేరువ కావాలనుకుంటున్నాడు. నిజానికి వణ్యప్రాణులను రక్షించడంలో వారు రకరకాల ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. కొందరు వేటగాళ్ల చేతిలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
 
‘‘వన్యప్రాణుల కోసం వాళ్లు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దురదృష్టమేమిటంటే చాలామంది చేతిలో కాలం చెల్లిన పరికరాలు మాత్రమే ఉన్నాయి. మా స్వచ్ఛందసంస్థ నిర్వహించిన రకరకాల కార్యక్రమాలు, వర్క్‌షాప్‌ల నుంచి వచ్చిన డబ్బులతో ఫస్ట్-ఎయిడ్ కిట్స్‌లాంటివి వారికి ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నాడు దలాల్.
 
గమ్యం దిశగా తొలి అడుగు వేశాను అంటున్న దలాల్ ‘‘వణ్యప్రాణుల కళ్లలో భయం లేని కాలం రావాలి’’ అని కోరుకుంటున్నాడు. అతని కోరిక ఫలించాలని ఆశిద్దాం.
 
ప్రతికూల పరిస్థితిలో...

చిన్నప్పుడు ‘సెరెబ్రల్ పాల్సి’ అనే మెదడుకు సంబంధించిన రుగ్మతతో బాధ పడ్డాడు హన్స్ దలాల్. సానుకూల దృక్పథంతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుండేవాడు. సంగీతకారుడు కావాలనేది దలాల్ కల. కానీ ఎలాంటి సంగీత పరికరాన్ని పట్టుకోవడానికీ చేతులు సహకరించేవి కాదు. నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవాడు.
 
బడిలో చదువు కంటే కళల మీదే ఎక్కువగా ఆసక్తి చూపేవాడు. వయసు పెరుగుతున్నకొద్దీ సంగీతం మీద ఆసక్తి అంతకంతకూ పెరిగింది. గిటారు వాయించడానికి ప్రయత్నించేవాడుగానీ, చేతి వేళ్లు సహకరించేవి కాదు. ఇంకా పాక్షికంగా ఆ ప్రభావం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement