Kanha National Park
-
సువర్ణావకాశం.. పులి ఇంట్లో రెండ్రోజులు
కథల్లో విన్న పులిని చూడాలని ఉంటుంది. పులి కోసం కాన్హా నేషనల్ పార్కుకు వెళ్లాలని కూడా ఉంటుంది. దట్టమైన అడవిలో బస చేసి రాత్రిళ్లు పులి సంచారాన్ని స్వయంగా వీక్షించాలని సరదా పడితే... అది గొంతెమ్మ కోరిక ఏమీ కాదు. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న కాన్హా జంగిల్ స్టే ఎక్స్ రాయ్‌పూర్ (Sఏఏ069) టూర్ ప్యాకేజ్‌లో రెండు రోజులు కాన్హా అడవుల్లో బస చేయవచ్చు. పులులు సంచరించే జోన్లో విహరిస్తూ గంభీరమైన పులి నడకను, పాదముద్రలను చూడవచ్చు. మూడు రోజుల ఈ టూర్ ప్యాకేజ్‌లో రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని కాన్హా ఫారెస్ట్ టూర్ (రెండు రాత్రుల బస) పూర్తయిన తర్వాత మూడవరోజు రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టు లో దించే వరకు ఐఆర్‌సీటీసీదే బాధ్యత. కాన్హా మధ్యప్రదేశ్‌లోని రెండు వేల చదరపు కిలోమీటర ్లకు పైగా విస్తరించిన దట్టమైన అటవీ ప్రదేశం. -
పులి విహారం.. టూరిస్టు గైడ్లుగా మహిళలు
రెండువేల చదరపు కిమీల విస్తీర్ణం రెండు వందల రకాల పూల చెట్లు మూడు వందల పక్షిజాతులు వందకు పైగా పులుల ఆవాసం వేలాది పర్యాటకులకు వినోదం వందలాది మందికి ఉపాధి జీపు డ్రైవర్లు... టూరిస్టు గైడ్లుగా మహిళలు ఇది కాన్హా నేషనల్ పార్కు ముఖచిత్రం పులి విహారం పర్యాటకులు జీపులో ఎక్కిన తర్వాత జీపు నీటి మడుగులో నుంచి ప్రయాణిస్తుంది. జీపు టైర్లు శుభ్రం కావడానికన్నమాట. ఆ తర్వాత కొద్దిదూరంలో వాష్రూమ్లుంటాయి. అక్కడ ఆపుతారు. ఆ తర్వాత జీపు దిగకూడదు. అడవి మధ్యలోకి వెళ్లిన తర్వాత ఇక ఏ అవసరం వచ్చినా జీపును ఆపరు. పులి కోసం మాటు వేసిన సమయంలో కూడా పర్యాటకులు జీపు దిగకూడదు. జీపు వేగం ఇరవై కిలోమీటర్లకు మించదు. జంతువులకు అసౌకర్యం కలగకుండా ఉండడానికే ఈ నిబంధన. పర్యాటకులు డియోడరెంట్లు, ప్లాస్టిక్ కూడా వాడకూడదు. పులులు ఉదయం వేళల్లో పొదల్లో నుంచి ఆరుబయటకు వచ్చి నాలుగైదు గంటల సేపు విశ్రమిస్తాయి. కొంత సేపు విహరిస్తాయి కూడా. పులులు రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తాయి. కానీ, రాత్రి సఫారీలో వెళ్తే పులి రోడ్డు మీదకు వచ్చినప్పుడు మాత్రమే చూడగలుగుతాం. పొదల మాటున సంచరిస్తున్న పులిని చూడలేం. అందుకే మేము రెండుసార్లు కూడా పగటి పూట సఫారీనే ఎంచుకున్నాం. దట్టమైన అడవిలో రకరకాల జంతువులను చూడడం మనకు కొత్తగా ఉంటుంది. కానీ పర్యాటకులను చూడడం ఇక్కడి జంతువులకు బాగా అలవాటైపోయింది. పరిచయం లేని వాళ్లను చూసినట్లు ఒకసారి అలా చూసి తమ దారిన తాము వెళ్లిపోతుంటాయి. దట్టమైన అడవి. చిన్నప్పుడు విన్న కథల్లోని చీమలు దూరని చిట్టడవి, పాములు దూరని కారడవి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అడవిలో చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆ చెట్ల మీద గూళ్లు కట్టుకున్న నల్లకొంగ, చిలుకలు, పాలపిట్టలు, గుడ్లగూబలు... ఇంకా పేర్లు తెలియని ఎన్నో పక్షులు. ఆ పక్షుల కువకువరవంలో తేడా వచ్చింది. జింకలు పెద్ద కళ్లను విప్పార్చుకుని బెదురు చూపులతో తమను దాచుకునే పొద కోసం చూస్తున్నాయి. నక్క దొంగచూపులు చూస్తోంది. ఈ అడవిలో గేదెను తలపించే ఆవులున్నాయి. నల్లగా పొట్టిగా ఉండడంతో గేదె అనుకుంటాం. కానీ అవి ఆవులే. అవి నిమిత్తమాత్రంగా చెవులు రిక్కించాయి. పక్షుల చూపులు, జంతువుల కదలికను బట్టి జీప్ డైరెక్షన్ మార్చుకున్నాడు డ్రైవర్. అంతలోనే గైడ్ పెదవుల మీద వేలిని ఉంచి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా సూచించాడు. అందరూ ఎదురు చూసిన అడవి పెద్ద ఠీవిగా నడుచుకుంటూ రానే వచ్చింది. రోడ్డు మీద అటూ ఇటూ తిరిగింది. చెట్ల పొదల్లో నడిచింది. గడ్డి మాటున దోబూచులాడి కొంతసేపటికి దూరంగా ఉన్న తటాకం వైపు వెళ్లి పోయింది. అప్పటి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసిన వాళ్లందరూ ఒక్కసారిగా దీర్ఘంగా ఊపిరి వదిలారు. ‘అమ్మో! పులిని చూడాలంటే చాలా ధైర్యం కావాలి’ అని నవ్వుకుంటూ మరోసారి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పులి పాదముద్రలు కాన్ హా నేషనల్ ఫారెస్ట్‌లో రకరకాల జింకలు కనిపిస్తాయి. నలభై వేల జింకలుంటాయని అంచనా. బారా సింఘా అనేది ఒక రకం జింక. మన దగ్గర మనుబోతు అంటారు. చిత్తడి నేలల్లో తిరిగే జింక ఇది. మధ్యప్రదేశ్ రాష్ట్ర జంతువు కూడా. పులులైతే వందకు పైగా ఉన్నాయట. మన చేతి వేళ్ల మీద గీతల్లాగ పులుల పాదముద్రలు వేటికవే ప్రత్యేకం. పులి పాద ముద్రల ఆధారంగా వేసిన లెక్క అది. పాదముద్రల ఆధారంగా పులులను గుర్తించి వాటికి పేర్లు కూడా పెట్టారు. పులి పిల్లల్లో ఆడపిల్లలు తల్లితోనే ఉంటాయి. మగ పిల్లలు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుని సొంత టెరిటరీని ఏర్పరుచుకుంటాయి. ఈ పర్యటనలో ఉత్కంఠ అంతా మన సఫారీ టైమ్‌లో పులి బయటకు వస్తుందా లేదా అనేదే. పర్యాటకులను నిరాశ పరచకుండా పులిని చూపించి పంపించాలనే చిత్తశుద్ధితో పని చేస్తారు గైడ్లు. ఒక్కోసారి ఎంతగా అన్వేషించినా పులి కనిపించకపోవచ్చు. మొత్తానికి ఈ పర్యటన ప్రతి ఒక్కరినీ బాల్యంలోకి తీసుకెళ్లి తీరుతుంది. రడ్యార్డ్ క్లిప్పింగ్ రాసిన జంగిల్ బుక్‌ని టీవీలో చూశాం. కాన్ హా నేషనల్ పార్క్‌లో పర్యటన అంటే జంగిల్ బుక్‌లోని అడవిని లైవ్‌లో చూడడమే. శ్రవణుడి సరస్సు కాన్హా నేషనల్ పార్క్ టూర్లో ప్రధాన ఆకర్షణల్లో శ్రవణ్ తాల్ ఒకటి. శ్రవణుడు అనే మునికుమారుడు ఈ సరస్సులో నీళ్లు ముంచుతున్నప్పుడు ఆ శబ్దాన్ని ఏనుగుగా భావించి దశరథ మహారాజు బాణం వేసినట్లు రామాయణలో ఉంది. ఆ సరస్సును ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. ఎండాకాలంలో పులులు ఈ సరస్సులో సేదదీరుతాయి. వైల్డ్ లైప్ ఫొటోగ్రాఫర్లు, ఆర్నిథాలజిస్టులతో ఫారెస్ట్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వనసౌందర్యాన్ని ఆస్వాదించడమే కాదు, ఇక్కడి మనుషులను కలవడం కూడా సంతోషాన్నిచ్చింది. చాలా నిరాడంబరులు, స్నేహపూర్వకంగా ఉన్నారు. దారి కోసం గూగుల్‌ని నమ్ముకోవడం కంటే మనుషులను నమ్ముకోవడం బెస్ట్ అనిపించింది. ఫారెస్ట్ లోపల ఫోన్ సిగ్నల్స్ అందవు. మేము రూట్‌ను ముందుగానే డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ టూర్లో ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ప్రకృతితో సహవాసం చేయవచ్చు. – శశాంక్, హారిక కాన్ హా నేషనల్ పార్కు పర్యాటకులు అడవి మధ్య ప్రయాణం కాన్ హా నేషనల్ పార్కుకు వెళ్లడానికి హైదరాబాద్ నుంచి జబల్పూర్కి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. మేము హైదరాబాద్ నుంచి కారులో తెల్లవారు జామున నాలుగన్నరకు బయలుదేరాం. కాన్ హా నేషనల్ పార్కు చేరేటప్పటికి సాయంత్రం ఆరైంది. అడవి మధ్యలో ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. ఆ రాత్రికి టూరిజం ప్యాకేజ్ బసలో విడిది. తెల్లవారి ఉదయం ఆరున్నర గంటల సఫారీలో పులి కోసం అన్వేషణ మొదలు పెట్టాం. కాన్ హా నేషనల్ పార్కులోకి ప్రధానంగా ‘ఖటియా గేట్, ముఖీ గేట్, సర్హీ గేట్’ అని మూడు గేట్లున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి సఫారీలుంటాయి. హాలిడే సఫారీ తీసుకుంటే రోజు మొత్తం అడవిలో విహరించవచ్చు. -
మున్నాగారి పేరు మొహం మీదే ఉంది..
మధ్యప్రదేశ్: చిత్రంలోని రాయల్ బెంగాల్ టైగర్ పేరు మున్నా.. దాని మొహం మీద చూడండి. ఏమని ఉందో? క్యాట్ అని.. పులులు, సింహాలు, చిరుతలు బిగ్ క్యాట్ జాబితాలోకి వస్తాయి. ఈ పులి మొహం మీద ఉండే చారలు ఇలా క్యాట్ అనే పేరును సూచిస్తుండటంతో ఇదో సెలబ్రిటీగా మారిపోయింది. మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ పార్కులో ఉండే మున్నాను క్లిక్‌మనిపించడానికి పర్యాటకులు పోటీ పడుతుంటారు. -
పులిబిడ్డ!
స్ఫూర్తి సాహసం చేసే వాళ్లు మాత్రమే ‘పులిబిడ్డలు’ కాదు. మంచి పని చేసే వారు కూడా పులి బిడ్డలే. పులుల క్షేమంకోసం నడుం బిగించిన హన్స్ దలాల్.... అక్షరాలా పులిబిడ్డే! రకరకాల శబ్దాల గురించి, తన కెరీర్ గురించి తప్ప... హన్స్ దలాల్ పులుల గురించి ఆలోచించిన సందర్భం మునుపెన్నడూ లేదు. అదేమి చిత్రమో, మధ్యప్రదేశ్‌లోని కాన్హా నేషనల్ పార్క్‌లో పులిని చూసిన క్షణం నుంచి... పులుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆయనలో వెల్లువెత్తింది. ముంబైలోని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ రాత్రి దలాల్‌కు నిద్ర పట్టలేదు. సాధారణంగా పులి అనగానే ఒకలాంటి గాంభీర్యం కళ్ల ముందు కదలాడుతుంది. తనకేమో వాటి దీనత్వం మాత్రమే కనిపించింది. వాటి మూగరోదన కళ్లలో కనిపించింది. పులుల గురించి సమాచారాన్ని అంతర్జాలంలో చదువుతున్నప్పుడు అవి ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయనే విషయం అర్థమై దలాల్ మనసు కదిలిపోయింది. ‘‘పులులను వేటాడడం సాహసం కాదు. అది పిరికివాళ్లు మాత్రమే చేస్తారు. పులులను రక్షించడం సాహసం. అది కొందరు మాత్రమే చేస్తారు’’ అనుకున్న దలాల్ ఆ కొందరిలో తాను ఒకడు కావాలనుకున్నాడు. ‘ప్రావ్ల్’ (ప్రిజర్వేషన్ ఆఫ్ వైల్డ్ ల్యాండ్‌స్కేప్స్) పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. నిజానికి అప్పటికీ ఆయనకు కొన్ని స్వచ్ఛందసంస్థల మీద సదభిప్రాయం లేదు. పులుల సంరక్షణ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాడు. వర్క్‌షాప్‌లు, క్యాంపులు నిర్వహించాడు. పులులకు సంబంధించి ఫుల్‌టైం ‘సమాచార కార్యకర్త’గా మారిపోయాడు. పట్టణంలో కంటే అడవుల దగ్గరే ఎక్కువ కాలం గడపడం అలవాటు చేసుకున్నాడు. పులుల వేట మీద హృదయం ద్రవించే డాక్యుమెంటరీని తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రాజస్థాన్‌లోని మోగియ తెగ ప్రజలకు చూపెట్టాడు. మోగియలకు తరతరాలుగా వేట అనేది ప్రధాన వృత్తి. పులిని వేటాడిన వారిని ‘మొనగాడు’గా పరిగణిస్తారు. మొఘల్‌ల కాలానికి ముందు వీరికి ‘రాయల్ హంటర్’లుగా పేరు. రాజులతో కలిసి వేటకు వెళ్లేవారు. ఒకవిధంగా చెప్పాలంటే వారికి అడవిలో వేట తప్ప బయటి ప్రపంచం తెలియదు. వారిని అర్థం చేసుకోవడానికి దలాల్ అడవుల్లో చాలారోజుల పాటు గడిపాడు. ‘‘మీరు ఇలా కాదు... అలా ఉండాలి’’ అని చెప్పడానికి కూడా చాలామంది భయపడేవారు. ఎందుకంటే వారికి కోపం ఎక్కువ! అలాంటి వారు సైతం దలాల్ రూపొందించిన డాక్యుమెంటరీ చూసి చలించిపోయారు. ముంబై యూనివర్శిటీ, మెల్బోర్న్ యూనివర్శిటీల నుంచి ఆడియో ఇంజనీరింగ్‌లో డిగ్రీలు తీసుకున్న దలాల్ ముంబైలోని దేవానంద్ రికార్డింగ్ స్టూడియోలో మొదటి ఉద్యోగం చేశాడు. ఆ తరువాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సౌండ్ ఇంజనీర్‌గా కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో... దలాల్ ఇలా పులుల సంరక్షణ అంటూ అడవులు పట్టుకు తిరగాలన్న నిర్ణయం గురించి విని ఆశ్చర్యపోయిన వారు తప్ప ‘మంచి నిర్ణయం’ అన్నవారు లేరు. ‘‘వణ్యప్రాణులను రక్షించాలనుకునే వాళ్లకు సహకారం అందించడమే మా సంస్థ ధ్యేయం’’ అని చెబుతున్న దలాల్ తొలి దశలో భాగంగా ఫారెస్ట్ గార్డ్లకు చేరువ కావాలనుకుంటున్నాడు. నిజానికి వణ్యప్రాణులను రక్షించడంలో వారు రకరకాల ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. కొందరు వేటగాళ్ల చేతిలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ‘‘వన్యప్రాణుల కోసం వాళ్లు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దురదృష్టమేమిటంటే చాలామంది చేతిలో కాలం చెల్లిన పరికరాలు మాత్రమే ఉన్నాయి. మా స్వచ్ఛందసంస్థ నిర్వహించిన రకరకాల కార్యక్రమాలు, వర్క్‌షాప్‌ల నుంచి వచ్చిన డబ్బులతో ఫస్ట్-ఎయిడ్ కిట్స్లాంటివి వారికి ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నాడు దలాల్. గమ్యం దిశగా తొలి అడుగు వేశాను అంటున్న దలాల్ ‘‘వణ్యప్రాణుల కళ్లలో భయం లేని కాలం రావాలి’’ అని కోరుకుంటున్నాడు. అతని కోరిక ఫలించాలని ఆశిద్దాం. ప్రతికూల పరిస్థితిలో... చిన్నప్పుడు ‘సెరెబ్రల్ పాల్సి’ అనే మెదడుకు సంబంధించిన రుగ్మతతో బాధ పడ్డాడు హన్స్ దలాల్. సానుకూల దృక్పథంతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుండేవాడు. సంగీతకారుడు కావాలనేది దలాల్ కల. కానీ ఎలాంటి సంగీత పరికరాన్ని పట్టుకోవడానికీ చేతులు సహకరించేవి కాదు. నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవాడు. బడిలో చదువు కంటే కళల మీదే ఎక్కువగా ఆసక్తి చూపేవాడు. వయసు పెరుగుతున్నకొద్దీ సంగీతం మీద ఆసక్తి అంతకంతకూ పెరిగింది. గిటారు వాయించడానికి ప్రయత్నించేవాడుగానీ, చేతి వేళ్లు సహకరించేవి కాదు. ఇంకా పాక్షికంగా ఆ ప్రభావం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు.