రెండువేల చదరపు కిమీల విస్తీర్ణం రెండు వందల రకాల పూల చెట్లు మూడు వందల పక్షిజాతులు వందకు పైగా పులుల ఆవాసం వేలాది పర్యాటకులకు వినోదం వందలాది మందికి ఉపాధి జీపు డ్రైవర్‌లు... టూరిస్టు గైడ్‌లుగా మహిళలు ఇది కాన్‌హా నేషనల్ పార్కు ముఖచిత్రం
పులి విహారం
పర్యాటకులు జీపులో ఎక్కిన తర్వాత జీపు నీటి మడుగులో నుంచి ప్రయాణిస్తుంది. జీపు టైర్‌లు శుభ్రం కావడానికన్నమాట. ఆ తర్వాత కొద్దిదూరంలో వాష్‌రూమ్‌లుంటాయి. అక్కడ ఆపుతారు. ఆ తర్వాత జీపు దిగకూడదు. అడవి మధ్యలోకి వెళ్లిన తర్వాత ఇక ఏ అవసరం వచ్చినా జీపును ఆపరు. పులి కోసం మాటు వేసిన సమయంలో కూడా పర్యాటకులు జీపు దిగకూడదు. జీపు వేగం ఇరవై కిలోమీటర్లకు మించదు. జంతువులకు అసౌకర్యం కలగకుండా ఉండడానికే ఈ నిబంధన. పర్యాటకులు డియోడరెంట్‌లు, ప్లాస్టిక్ కూడా వాడకూడదు. పులులు ఉదయం వేళల్లో పొదల్లో నుంచి ఆరుబయటకు వచ్చి నాలుగైదు గంటల సేపు విశ్రమిస్తాయి. కొంత సేపు విహరిస్తాయి కూడా. పులులు రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తాయి.
కానీ, రాత్రి సఫారీలో వెళ్తే పులి రోడ్డు మీదకు వచ్చినప్పుడు మాత్రమే చూడగలుగుతాం. పొదల మాటున సంచరిస్తున్న పులిని చూడలేం. అందుకే మేము రెండుసార్లు కూడా పగటి పూట సఫారీనే ఎంచుకున్నాం. దట్టమైన అడవిలో రకరకాల జంతువులను చూడడం మనకు కొత్తగా ఉంటుంది. కానీ పర్యాటకులను చూడడం ఇక్కడి జంతువులకు బాగా అలవాటైపోయింది. పరిచయం లేని వాళ్లను చూసినట్లు ఒకసారి అలా చూసి తమ దారిన తాము వెళ్లిపోతుంటాయి.
దట్టమైన అడవి. చిన్నప్పుడు విన్న కథల్లోని చీమలు దూరని చిట్టడవి, పాములు దూరని కారడవి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అడవిలో చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆ చెట్ల మీద గూళ్లు కట్టుకున్న నల్లకొంగ, చిలుకలు, పాలపిట్టలు, గుడ్లగూబలు... ఇంకా పేర్లు తెలియని ఎన్నో పక్షులు. ఆ పక్షుల కువకువరవంలో తేడా వచ్చింది. జింకలు పెద్ద కళ్లను విప్పార్చుకుని బెదురు చూపులతో తమను దాచుకునే పొద కోసం చూస్తున్నాయి. నక్క దొంగచూపులు చూస్తోంది. ఈ అడవిలో గేదెను తలపించే ఆవులున్నాయి. నల్లగా పొట్టిగా ఉండడంతో గేదె అనుకుంటాం. కానీ అవి ఆవులే. అవి నిమిత్తమాత్రంగా చెవులు రిక్కించాయి.
పక్షుల చూపులు, జంతువుల కదలికను బట్టి జీప్ డైరెక్షన్ మార్చుకున్నాడు డ్రైవర్. అంతలోనే గైడ్ పెదవుల మీద వేలిని ఉంచి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా సూచించాడు. అందరూ ఎదురు చూసిన అడవి పెద్ద ఠీవిగా నడుచుకుంటూ రానే వచ్చింది. రోడ్డు మీద అటూ ఇటూ తిరిగింది. చెట్ల పొదల్లో నడిచింది. గడ్డి మాటున దోబూచులాడి కొంతసేపటికి దూరంగా ఉన్న తటాకం వైపు వెళ్లి పోయింది. అప్పటి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసిన వాళ్లందరూ ఒక్కసారిగా దీర్ఘంగా ఊపిరి వదిలారు. ‘అమ్మో! పులిని చూడాలంటే చాలా ధైర్యం కావాలి’ అని నవ్వుకుంటూ మరోసారి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
పులి పాదముద్రలు
కాన్ హా నేషనల్ ఫారెస్ట్‌లో రకరకాల జింకలు కనిపిస్తాయి. నలభై వేల జింకలుంటాయని అంచనా. బారా సింఘా అనేది ఒక రకం జింక. మన దగ్గర మనుబోతు అంటారు. చిత్తడి నేలల్లో తిరిగే జింక ఇది. మధ్యప్రదేశ్ రాష్ట్ర జంతువు కూడా. పులులైతే వందకు పైగా ఉన్నాయట. మన చేతి వేళ్ల మీద గీతల్లాగ పులుల పాదముద్రలు వేటికవే ప్రత్యేకం. పులి పాద ముద్రల ఆధారంగా వేసిన లెక్క అది. పాదముద్రల ఆధారంగా పులులను గుర్తించి వాటికి పేర్లు కూడా పెట్టారు. పులి పిల్లల్లో ఆడపిల్లలు తల్లితోనే ఉంటాయి. మగ పిల్లలు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుని సొంత టెరిటరీని ఏర్పరుచుకుంటాయి.
ఈ పర్యటనలో ఉత్కంఠ అంతా మన సఫారీ టైమ్‌లో పులి బయటకు వస్తుందా లేదా అనేదే. పర్యాటకులను నిరాశ పరచకుండా పులిని చూపించి పంపించాలనే చిత్తశుద్ధితో పని చేస్తారు గైడ్‌లు. ఒక్కోసారి ఎంతగా అన్వేషించినా పులి కనిపించకపోవచ్చు. మొత్తానికి ఈ పర్యటన ప్రతి ఒక్కరినీ బాల్యంలోకి తీసుకెళ్లి తీరుతుంది. రడ్‌యార్డ్ క్లిప్పింగ్ రాసిన జంగిల్ బుక్‌ని టీవీలో చూశాం. కాన్ హా నేషనల్ పార్క్‌లో పర్యటన అంటే జంగిల్ బుక్‌లోని అడవిని లైవ్‌లో చూడడమే.
శ్రవణుడి సరస్సు
కాన్‌హా నేషనల్ పార్క్ టూర్‌లో ప్రధాన ఆకర్షణల్లో శ్రవణ్ తాల్ ఒకటి. శ్రవణుడు అనే మునికుమారుడు ఈ సరస్సులో నీళ్లు ముంచుతున్నప్పుడు ఆ శబ్దాన్ని ఏనుగుగా భావించి దశరథ మహారాజు బాణం వేసినట్లు రామాయణలో ఉంది. ఆ సరస్సును ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. ఎండాకాలంలో పులులు ఈ సరస్సులో సేదదీరుతాయి. వైల్డ్ లైప్ ఫొటోగ్రాఫర్‌లు, ఆర్నిథాలజిస్టులతో ఫారెస్ట్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వనసౌందర్యాన్ని ఆస్వాదించడమే కాదు, ఇక్కడి మనుషులను కలవడం కూడా సంతోషాన్నిచ్చింది. చాలా నిరాడంబరులు, స్నేహపూర్వకంగా ఉన్నారు. దారి కోసం గూగుల్‌ని నమ్ముకోవడం కంటే మనుషులను నమ్ముకోవడం బెస్ట్ అనిపించింది. ఫారెస్ట్ లోపల ఫోన్ సిగ్నల్స్ అందవు. మేము రూట్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఈ టూర్‌లో ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ప్రకృతితో సహవాసం చేయవచ్చు.
– శశాంక్, హారిక
కాన్ హా నేషనల్ పార్కు పర్యాటకులు
అడవి మధ్య ప్రయాణం
కాన్ హా నేషనల్ పార్కుకు వెళ్లడానికి హైదరాబాద్ నుంచి జబల్‌పూర్‌కి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. మేము హైదరాబాద్ నుంచి కారులో తెల్లవారు జామున నాలుగన్నరకు బయలుదేరాం. కాన్ హా నేషనల్ పార్కు చేరేటప్పటికి సాయంత్రం ఆరైంది. అడవి మధ్యలో ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. ఆ రాత్రికి టూరిజం ప్యాకేజ్ బసలో విడిది. తెల్లవారి ఉదయం ఆరున్నర గంటల సఫారీలో పులి కోసం అన్వేషణ మొదలు పెట్టాం. కాన్ హా నేషనల్ పార్కులోకి ప్రధానంగా ‘ఖటియా గేట్, ముఖీ గేట్, సర్హీ గేట్’ అని మూడు గేట్‌లున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి సఫారీలుంటాయి. హాలిడే సఫారీ తీసుకుంటే రోజు మొత్తం అడవిలో విహరించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment