ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా | Travelling With Village As Family | Sakshi
Sakshi News home page

ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా

Published Sun, Sep 24 2023 9:06 AM | Last Updated on Sun, Sep 24 2023 9:36 AM

Travelling With Village As Family - Sakshi

కొండకు బోయొచ్చినప్పటి నుంచి కత్తి గెలిసిన కోడే గతం మా జయక్క మగం ఎలిగిపోతావుంది. కుమ్మరి ఎంగటప్ప చేత్తో తయారు చేసిన మొంటి ఉండీని మా జయక్క పది రూపాయలుకి ఇంటికి కొనక్కచ్చింది. ఎంగటప్ప దానికి ఎంతో సుందరంగా పూజులు కూడా తీర్సినాడు. ఆ ఉండీని ఎంగట్రమణ సామి పటాలకాడ పెట్టి ‘ఉండీ నిండిన్నాపొద్దు దావకర్సులకు ఈ దుడ్డు పెట్టుకొని నీ కొండకు వస్తాను సామీ’ అని మొక్కుంది.

ఆ పొద్దు నుండి జయక్క చీర కొంగున ముడేసిన రూపాయి బిల్లలు, అరుదుగా చేతికి మిగిలే ఐదు రూపాయల బిల్లలు, ఎబుడన్న కతగెతిగ మిగిలిన యాబై రూపాయల నోట్లు, పంటపలం అమ్మిన సొమ్ములో అవసరం కోసం అప్పుచేసిన డబ్బుల్లో, కూలి డబ్బుల్లో కొద్దిగా తీసి ఉండీలో ఏసేది. అన్ని రకాల డబ్బుల్లో నుండి ఈ నోటు పక్కకు పోయిన బాద లేదులే అనుకోని ఏసిన నూరు రుపాయల నోట్లు, ఎంత ఉన్నా మనచేతిలో కర్సయిపోతుంది అనుకోని తెంపుచేసి ఏసిన ఒగటో రెండో ఐదు నూర్లు కాగితాలు కూడా ఉండేవి. ఈ రకంగా మూడేండ్ల నుండి కూడేసిన ఉండీ నిండి నిబ్బాలాడతా ఉంది.

"మా ఊర్లోవాల్లు తిరుపతి కొండకు పోవాలంటే ఒగ ఇంట్లోవాల్లే పోరు. ఊర్లో కాగలిగినోల్లు అమ్మలక్కలు, అబ్బలబ్బలు మాట్లాడుకుని ఒగ పది పదైదు మందన్న జమై పోతారు."
జయక్క నన్ను నా మొగున్ని పైనం చేసే. ‘ఇద్దరం వొచ్చేస్తే ఇంటికాడ మనిసి ఉండల్ల ఆ యమ్మిని తోడుకొనిపో’ అనే నా మొగుడు. ‘ఏం పాపా ఈ పైనం అట్ల పదాం పద మూడేళ్ల నాటి మొక్కుబడి తీర్సుకొని వద్దాము’ అనే జయక్క. ‘సర్లే’ అంటి.
 
తిరపతికి పోను జతకు మనిసి దొరికితే సాలు అని కాసుకోనుండేవాల్లు. మా ఊరి లింగమ్మత్త, రెడ్డమ్మ, సరోజి, మగోల్లు నాగన్న, ఎంగటప్ప, రమణన్న.. అంతా తొమ్మిది మంది జమైనాము. మా ఊరు దావన పోయే తొమ్మిదిగంట్ల రైలు ఎక్కితే సరిగ్గా రెండు గంటలకు తిరపతిలో దిగతాం అని ఈ పొద్దే అందరం మాట్లాడుకొని పయనాలు కడతా ఉండాము. మా జయక్క ఉండీని చేతికి ఎత్తుకొని బరువు చూసే. కోటీసురాలు ఐనట్టు ఎలిగిపోతా వుంది మగం.

ఆ వుండి పగలగొట్టే. సిల్లరంతా జల్లున రాలే. నోట్లన్నీ ఓపక్క, సిల్లరంతా ఓ పక్క లెక్కేసుకుండే. అంతా మూడేలు పైచిలుకు ఉన్నింది. ‘ఈ దుడ్డు మల్ల మిగిలించుకొని రాకూడదంట పాపా. అంతా కర్సు పెట్టేయలంట’ అని నాకు బింకంగా సెప్తా ఉంది. ఆ మరుసునాడు తెల్లారుజామునే లేసి అందరం తయారై ఒగ పూటకు సింతపులుసన్నం, గోదుమ రొట్లు, చెనిగ్గింజల గెట్టూరిబిండి ఏసి మనిసికి ఒగ పట్లాము కట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని పోతిమి.

మా జయక్క వక్కాకు బలే ఏస్తుంది. ‘పాపా నాకు అన్నము లేకపోయినా ఉంట. వక్కాకు  లేకుండా ఉండ్లేను’ అంటుంది. ఈ అమ్మకు దోడుమైనోల్లే సరోజమ్మ.. లింగమ్మ కూడా. ఈ ముగ్గురూ మేము పోయే తొక్కు వక్కాకు సిక్కదేమో అని మల్ల కొండ నుంచి తిరుక్కోని ఇంటికి వొచ్చిందంక ఉండేటిగా టౌనుకు పోయి కాలకట్ట తమలపాకులు, పిడుకుడు వక్కలు, పావు సేరు దుగ్గు తెచ్చుకున్నారు.

మొగోల్లు మా యంగటన్న బీడీలు ఇపరీతంగా తాగతాడు. నాగన్న, రమణన్న కూడా తాగేవాల్లే. వాల్లకు కావాల్సిన బీడీలు, అగ్గిపెట్లు తెచ్చుకొని బ్యాగుల్లో పెట్టుకున్నారు. రెడ్డెక్క నేను తప్పనిడిసి మిగతా ఏడు మందికి బస్సెక్కినా రైలెక్కినా కిటికీ పక్కన వారసీటే కావాలంటారు వక్కాకు ఊంచుకోను. గెడిసేపన్నా వాల్ల నోర్లు ఊరికే ఉండవు. మేక నమిలినట్లు నమలతానే ఉంటారు. యాడబడితే ఆడ ఊంచుతారు. మాకు సగిచ్చదు. మేము వాల్ల మింద సిటుమొరుక్కుంటానే తిరపతి అలిపిరి మెట్లకాడికి పోతిమి కాలిదావన పోదామని.
 
మా జయక్క కొండకు ముందే రెండుసార్లు వొచ్చింది. ఎంగటన్న కూడా ముందు వొచ్చినోడే. మిగతావాల్లకు ఇదే తొలిసారి. అందరం కియిలోకి పొయి నిలబడి ఆడ నుంచి బ్యాగుల్ని మనుసుల్ని తనికీ చేసే తావుకు పొయినాం. వీలంతా ఎనకెనకనే గుంజిట్లు పెడతా ఉంటే నేను రెడ్డెక్క ముందుగా పోతిమి. మావి చూసి అంపించేసిరి. మేము కడగా బారడు దూరం నిలబడితిమి. ఈల్లు ఎంచేపటికీ రాలా. మల్లొచ్చిరి. ఏమట ఇంతసేపు అంటే మా జయక్క మగం తప్ప మిగతా అందరివీ  చింతాకంత అయిపొయినాయి. లింగమత్త ఐతే  ఏడుపు మగమే పెట్టేసింది. ఎంగటన్న మటుకు నగుమొగంతో కనపడే.

సరోజమ్మ ఉండుకొని ‘నేను నా వక్కాకు తిత్తి కనపడదు కదా అని పావడ నాడాకు కట్టి రెండు కాళ్ళ సందులో దిగేసుకోనుంటే అదెవుతో పోలీసిది ఒల్లంతా పామేటప్పుడు మూట పెద్దగా ఉండి చేతికి తగిలింది. తీయే అని పెరుక్కొని అంతా ఇసిరి పారేస. వక్కాకు పోతేపానీ బంగారట్ల తిత్తి ఆరు పారవులు ఏసి కుట్టిండేది. ఆరు ఏండ్లుకు ముందు కనుపూరి గంగమ్మ తిరణాల్లో తీసుకోనుంటి. ఎంత దుడ్డు మోసిందో ఎంత వక్కాకు మోసిందో! దుడ్డుతో ఎక్కువ బిక్కటైనబుడు తిత్తిని గాలిస్తే ఏదో ఒగ పార్వలో అంతో ఇంతో దొరికేది.

అంత అచొచ్చిన తిత్తి పాయనే’ అని ఒకటే బాధపడే. ఇంతలో లింగమ్మ ‘ఓ నీ తిత్తి పోతే మల్ల తీసుకోవచ్చులే నాది సీమెండి పొడువు సున్నంకాయి. మాయమ్మ వాల్ల అమ్మ కాడ నుండి మూడు తరాల కాయి. మాయమ్మ  గుర్తుగా అట్లే పెట్టుకో నుంటి. కాయినిండా ఒకసారి సున్నం పెడితే వారమంతా నమిలినా అయిపోయేదికాదు. ఆ సున్నంగాయి మూతకు ఎండి గొలుసు ఏసి, మూడు గెజ్జిలు కట్టి సున్నం లోడుకోను చిన్నగెంటి, పొల్లు గుచ్చుకునే పుల్ల, గుబిలిగెంటి ఇవన్నీ మూతకు కుచ్చు ఏసింటి. నా శనికాటం దాన్ని యాడన్న దాసిపెట్టుకోకూడదా! కడుపు సెన్నిట్టు అయిపోయా’ అని బాధపడే.

నేను ఉండుకొని ‘పోతేపోనీలే వక్కాకే కదా ఏమో కలిమి పోయినట్టు ఏడస్తుండారే’ అంటే ‘అయ్యో నాయనా అదే మా పానాదరవ. పది దినాలు పస్తయిన ఉంటాము. గెడిసేపు వక్కాకు లేదంటే తలకాయి ఎర్రియాకోలం పడుతుంది. తెలిసినోల్లను గాని తెలీనోల్లను గాని అడగదామా అనిపిస్తుంది. మే జయా నువ్వు ముందే వచ్చింటివి కదా మాకు చెప్పిండకూడదా ఇంతకు నువ్వేమి చేసినావు’ అని అడిగిరి.

‘నేను వొట్టి తిత్తి నడుములో చెక్కోని వక్కాకు అంత మూటగట్టి గుడ్ల బ్యాగులో నడన పెట్టిన. ఆ నడుసుకొని పోయే మిసన్లో బ్యాగు ఏస్తే అది కిర్రుమనే. ఆ పోలీస్‌ది బ్యాగులో ఏందో ఉంది తీ బయటికి అనే. అమ్మా బజన చెక్కలు గిని అంటే ఏది చూపించు అనే. అవి పైనే ఉన్నాయి ఒగ జత అవి తీసిచూపిస్తే సరే పో అనే. పోనిలే మా ఇల్లిలప దేవుడు ఆ ఎంగట్రమన సామే నన్ను కాపాడినాడు. ఆ యప్ప సాస్టాగా నాపాలిటున్నాడు’ అని చెప్పే జయక్క. కత్తి గెలిసిన కోడేగతం మా జయక్క మగం ఎలిగిపాతా ఉంది.

లింగమ్మకు కోపమొచ్చే ‘ఎంత మోసకారుదానివే! నీ యట్లాదాని మాటలకు ఎంగట్రరమణ సామే యామారి పోయినాడంట. నీ యట్లాడిది సామీ నేను అనుకునింది జరిగితే నీకు సిటికెల పందిరి ఏపిస్తాను అని మొక్కునిందంట. దేవుడు ఒరే ఇంతవరకు ఎవరు "తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు."  

ఏపీలేదే ఎట్లుంటుంది ఈ సిటికెల పందిరి చూద్దాం అని అసోద్దపోయి ఆ యమ్మ కోరిన మొక్కుతీర్సినాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట ఇంగ ఎప్పుడు వచ్చి ఏపిస్తుంది సిటికెల పందిరి అని.

ఆ యమ్మ నలగరు ఆడోల్లను పిలుసుకొనిబొయ్యి నలగర్నీ నాలుగు సమకాలంగా నిలబెట్టి నడిమిద్ద ఆ యమ్మ నిలబడుకొని అందరూ కలిసి సుట్టూ సిటికెలు ఏసిరంట. ఇదేసామి సిటికెల పందిరి నా మొక్కు సెల్లిపోయింది అంటే సామే బెబ్బిర్లకపోయి ఓరే ఎంత యామారిపోయినాను అనుకున్నంట. అట్లా దానివి నువ్వు’ అనే! లింగమ్మ చెప్పిన కతకు అందరం నగుకుంటూ ఉండగానే మగోల్ల మగాలు కూడా సప్పగిల్లినాయి. ఈల్ల బీడీలకట్టలు కూడా పెరుక్కొన్నారు. రమనన్న బీడీలకట్టని సరాయి లోజోబిలో పెట్టుకొని ఉన్నాడు. పోలీసులు తడిమేటప్పుడు చేతికి తగిలి పెరికి అక్కడ బారేసినరంట. నాగన్నది కూడా అట్లే పెరుక్కొన్నారు. ఎంగటప్ప మాత్రానికి బీడీలు కట్ట అగ్గిపెట్టి కట్‌ డ్రాయర్‌లో ఆయప్ప మాను కింద పెట్టుకున్నాడంట! ఈయప్ప ముందే రెండుసార్లు కొండకు వచ్చి పోయినాడు అందుకే తెలివి చేసినాడు. ఆయప్పవి మిగిలినాయి.

మెటికిలు ఎక్కేటప్పుడు నాగన్న ఊరికే ఉండేదిలే కొండంతా పారజూస్తా ఎదో ఒకటి చెబతానే ఉంటాడు. ‘తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు. ఎంగట్రమణ సామికి పెండ్లి పెట్టుకున్నారు.

చెప్పులు కుట్టే ఆయప్పకు జరం వొచ్చి మూర్తం టయానికి ఇవ్వలేక పెండ్లి అయిపోనంక చెప్పులు కుట్టకపోయి ఇచ్చినాడంట. మూర్తం టయానికి చెప్పులు బిన్నతేలేదని నువ్వు ఎన్ని మెట్లు కుట్టిన నీకు మెట్టు కరువైతుంది అని ఆ దేవుడు శపించినాడు. అందుకే కుట్టేవోనికి మెట్టు కరువు అనేది. ఇప్పుడు కూడా దినామూ మన మాదిగోడు జత మెట్లు కుట్టకపోయి ఆడ పెట్టాల అందుకే కొండన మనకు పావలా బాగం వస్తుంది’ అనే! అయితే ‘మనం దీని గురించి సెరియ తీసుకోవాల్సిందే’ అని ఎకసక్కలాడిరి.

సద్ది మూట్లు మోయాలంటే బరువు అదే కడుపులో ఉంటే అంత బరువు ఉండదని నడన అందరూ కూసోని తినేస్తిమి. కొండెక్కి గుండ్లు కొట్టుకొని ఆ దేవుని దర్శనం బాగా చేసుకుంటిమి. గుళ్లో నుండి బయట పన్నాము. లింగమ్మ, సరోజమ్మ.. జయక్క యాడికిపోతే ఆడికి పోయేది ఎనకాలే వక్కాకు కోసం. ఎంగటప్ప యాడికి పోతే ఆడికి నాగన్న రమనన్న బంట్రోతులే గతం బీడీల కోసం పోయేది. అవి ఆయప్ప సామాన్లో పెట్టుకోనున్నివైనా సరే వాల్లు ఇడిసిపెట్లా. ఇదే తంతు ఇంటికి వచ్చిందంక.
మా జయక్క మాత్రానికి వక్కాకు మిగిల్చినందుకు ఎంగట్రమణ సామి పటం తెచ్చుకుంది పూజించుకోను!

(చ‌ద‌వండి: అన్నింటిలో కన్నా అన్న‌దానమే గొప్ప‌ దానం! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement