చీకటి నీడ!..ఒక బాస్‌ జంటల మధ్య సాగే థ్రిల్లింగ్‌ కథ! | Dark Shadow Story Thrilling Novel Story | Sakshi
Sakshi News home page

చీకటి నీడ!..ఒక బాస్‌ జంటల మధ్య సాగే థ్రిల్లింగ్‌ కథ!

Published Sun, Nov 5 2023 1:16 PM | Last Updated on Sun, Nov 5 2023 1:17 PM

Dark Shadow Story Thrilling Novel Story - Sakshi

వర్షం ధారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్లీ సాధారణ స్థితికి రాగలనా..!

ఎదురుగా కనిపిస్తున్న పిస్తా రంగు వెడ్డింగ్‌ కార్డుపై గోల్డ్‌ కలర్లోని ‘మానస వెడ్స్‌ తరుణ్‌’ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతోంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్‌షిప్‌ని ఎలా వదులుకోగలుగుతోంది మానస. ఆ తరుణ్‌ అనే వాడితో అంత సులువుగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. ‘చిల్‌ యార్‌. తరుణ్‌తో పెళ్ళి అమ్మా..నాన్న, సొసైటీ కోసమే! నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది. నా పెళ్లి తరువాత కూడా మనం మునుపటిలాగానే కలుసుకుందాం..’ అని ఎంత ఈజీగా చెప్పేసింది.

నా మనసులో మానసకు తప్ప మరో మనిషికి చోటు లేదు. కానీ తనెందుకు ఇలా చేసింది! బాల్కనీలోకి వచ్చి సిగరెట్‌ వెలిగించాను. ఆమె పరిచయం, సాన్నిహిత్యం తరువాత నేనొక అనాథనని మరచిపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరినని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది. బెడ్‌ పై వాలి కళ్ళు మూసుకుంటే నిద్ర దరి చేరటం లేదు. 
నాలుగేళ్ల క్రితం నాటి మా మొదటి పరిచయం గుర్తుకు వచ్చింది.
∙∙ 
చురుకుగా ఉండటం, సమయస్ఫూర్తి, కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీతో పాటు చూడగానే ఆకర్షించే నా రూపం.. చిన్న వయసులోనే.. పేరున్న కంపెనీలో టీమ్‌ లీడర్‌గా ఎదగటానికి దోహదపడింది. అది నా రెండో ప్రాజెక్ట్‌ అనుకుంటా. కొత్తగా ఒక జావా డెవలపర్‌ అవసరం పడింది. షార్ట్‌ లిస్ట్‌ చేసిన ముగ్గురిలో ఒకరిని ఫైనల్‌ చేసి రిక్రూట్‌ చేసుకొనే బాధ్యతను నాకు అప్పగించారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ప్రొఫైల్స్‌ చూస్తే ముగ్గురూ టాలెంటెడ్‌ అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరినీ నా క్యాబిన్‌లోకి పంపించమన్నాను.

మొదట వచ్చిన అమ్మాయిది.. బంగారు వర్ణం. ఒకసారి చూస్తే ఏ మగాడికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సోయగం. కొన్ని కోడ్స్, ప్రాబ్లెమ్‌ ఎనాలిసింగ్‌ టెక్నిక్స్‌ డిస్కస్‌ చేశాక ఎందుకో సంతృప్తి కలగలేదు నాకు. తరువాత వచ్చిన అబ్బాయి ఎన్‌.ఐ.టి గ్రాడ్యుయేట్‌. కానీ అతనిలోని కొంచెం నిర్లక్ష్యపు దోరణి నచ్చక రిజెక్ట్‌ చేశాను. చివరగా వచ్చింది మానస. చామనఛాయ రంగు దేహం.. ఆ కళ్ళలోని మెరుపు సమ్మోహనంగా ఉంది. ‘గుడ్‌ మార్నింగ్‌’ అంటూ సన్నని నవ్వు. అదేంటి ఆశ్చర్యంగా ఆ నవ్వు నాలో చక్కిలిగింతలు పెడుతోంది.

ఇదేమి వింత! ఇది కరెక్ట్‌ కాదు కదా అని అనిపించింది. కానీ ఆ పొడవాటి మొహంలోని కాంతి, మెడ దగ్గరి నునుపు నన్ను కళ్ళు తిప్పుకోనివ్వ లేదు. తమాయించుకొని ప్రోగ్రామింగ్‌ మాడ్యూల్స్‌ డిస్కస్‌ చేశా. అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలే. ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ చూస్తే ముచ్చటేసింది. ‘యూ ఆర్‌ సెలెక్టెడ్‌’ అని చెప్పాను. ‘థాంక్‌ యూ సో మచ్‌ ఫర్‌ సెలెక్టింగ్‌ మీ. ఈ జాబ్‌ నాకు రావటానికి మీరే కారణం. మీ గైడెన్స్‌లో పనిచెయ్యటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది.

ఆ మెత్తని స్పర్శకు నా నరనరాల్లో వేల వోల్ట్‌ల విద్యుత్‌ ప్రవహించిన అనుభూతి. సర్దుకొని ‘బై ద వే.. నీ డేట్‌ అఫ్‌ బర్త్‌ చూశాను. నువ్వే నా కన్నా ఆరు నెలలు పెద్ద. సో నేను నీ బాస్‌ అయినప్పటికీ మీరు అనొద్దు. నువ్వు అని సింగిలర్‌ యూస్‌ చెయ్యి. నో ప్రాబ్లెమ్‌’ అన్నాను. కళ్ళతోనే నవ్వింది. ఆ చూపు గుచ్చుకొని నా హృదయంలో తియ్యని అలజడి మొదలయ్యింది. అలా తొలి పరిచయంలోనే తను నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా కనిపించింది. తరువాత నుండి ప్రతిరోజు తనను చూడాలనే తహ తహ మొదలయ్యింది.

అయితే ఒకటే టీమ్‌ అయినా ఆఫీస్‌లో ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైమ్‌ అస్సలు ఉండేది కాదు. మీటింగ్స్‌ కుడా జూమ్‌లోనే అయ్యేవి. కానీ నాకు మాత్రం రోజుకి ఒక్కసారైనా మానసని చూడాలని, చలాకీగా తను మాట్లాడుతుంటే వినాలని అనిపించేది. మానస ఇదేమీ గమనించేది కాదు. నాలో తన పట్ల కలుగుతున్న ప్రేమ పూరిత భావనలు తను కనిపెట్టే అవకాశం అస్సలు లేదు. ‘నువ్వు సిగరెట్లు తగ్గించు. పెదాలు కొంచెం నలుపు రంగులోకి మారేలా కనిపిస్తున్నాయి’ అంది ఒక రోజు. ‘ఇంత అందంగా ఉంటావు. ఆఫీస్‌లో ఇప్పటివరకు ఎవ్వరూ ప్రపోజ్‌ చెయ్యలేదా నీకు?’ చొరవగా అడిగింది ఇంకో రోజు.

‘నువ్వు మామూలు డ్రెస్‌లో కంటే జీన్స్‌.. టీ షర్ట్‌లో సూపర్‌ ఉంటావు’ మరో రోజు కాంప్లిమెంట్‌. ఎప్పుడూ క్యాంటీన్లోనే తినే నాకోసం అప్పుడప్పుడు తన లంచ్‌ బాక్స్‌ షేర్‌ చేసేది.
కొద్ది రోజుల్లోనే ఒక స్నేహితురాలిగా దగ్గరయ్యింది. ఆఫీస్‌ విషయాలు, ఇంట్లో సంగతులే కాకుండా పర్సనల్‌ విషయాలు కూడా  షేర్‌ చేసుకునేది. ఎప్పుడైనా తను లీవ్‌ పెడితే ఆ రోజంతా నా మనసు విలవిల్లాడేది. తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అనే తీవ్రమైన భావన నాలో! నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది.

మా ఆఫీస్‌లో తన లాస్ట్‌ వర్కింగ్‌ డేనాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళలోని తడిని చూసి ‘హే.. ఇప్పుడు ఏమైంది? నేను వేరే కంట్రీకి ఏమీ పొవట్లేదు. ఈ సిటీలోనే ఉంటున్నా. ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీస్‌ల మధ్య దూరం పది నిమిషాలే. రెగ్యులర్‌గా టచ్‌లో ఉందాం. ఓకే నా’ అంటూ హగ్‌ చేసుకొంది. ఆ కౌగిలి తను కాజువల్‌గా ఇచ్చినా అప్పుడు మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. అలారం క్లాక్, మొబైల్‌ రెండూ ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను. టైమ్‌ చూస్తే పది. మానస గురించి ఆలోచిస్తూ లేట్‌గా పడుకున్నానేమో మెలకువ రాలేదు.

మొబైల్‌ చూస్తే తన నుండే కాల్‌. ‘హలో.. గుడ్‌ మార్నింగ్‌ ’ అన్నాను. నా గొంతులో విషాదం నాకే తెలుస్తోంది. ‘హే గుడ్‌ మార్నింగ్‌. ఇప్పుడే లేచావా? కమాన్‌ క్విక్‌గా రెడీ అయ్యి బేగంపేట షాపర్స్‌ స్టాప్‌కి వచ్చేయ్‌. చిన్న షాపింగ్‌. తరుణ్‌ కూడా వస్తున్నాడు. నువ్వుంటే నాకు బాగుంటుంది’ అని చెప్పేసి ఫోన్‌ కట్‌ చేసింది. ఏమనుకుంటుంది ఈ మనిషి అసలు! మా ఇద్దరి మధ్య ఏమీ లేనట్లు ఇంత క్యాజువల్‌గా ఎలా మాట్లాడుతుంది? తరుణ్‌తో షాపింగ్‌ చెయ్యటానికి నన్నెందుకు రమ్మంటోంది? వాళ్ళిద్దరినీ పక్క పక్కన చూస్తే నేను తట్టుకోగలనా!

అలా ఆలోచిస్తూనే రెడీ అయ్యి కిందకి వచ్చి కార్‌ స్టార్ట్‌ చేశాను. రాత్రి తగ్గిన వర్షం మళ్ళీ సన్నని తుంపరతో మొదలయ్యింది. కొన్ని జ్ఞాపకాలకు మరణమే ఉండదు. కొన్ని జ్ఞాపకాలు అస్సలు పురుడు పోసుకోవు. డ్రైవ్‌ చేస్తూ మళ్ళీ పాత జ్ఞాపకాలను వెతుక్కొన్నాను.  మొదటిసారి తను నా కార్‌ ఎక్కటానికి కూడా ఇలాంటి వర్షమే కారణం. ఆ రోజు సాయంత్రం ఆఫీస్‌ నుండి బయటకు వచ్చేసరికి చిన్న ముసురు. నా కార్‌ దగ్గరికి వెళ్తూ, నీటి బిందువులతో ఆనందంగా పరవశిస్తున్న చెట్ల ఆకుల సోయగాన్ని చూస్తే ఎందుకో మానస గుర్తుకు వచ్చింది. స్కూటీ పై ఆఫీస్‌కి వచ్చే తను ఈ వర్షంలో ఇంటికి ఎలా వెళ్తుందో అనిపించి మొబైల్‌ తీసి కాల్‌ చేశా.

నేనేం మాట్లాడక ముందే ‘హే.. హౌ అర్‌ యూ? ఒక్క మెసేజ్‌ లేదు, కాల్‌ లేదు. మర్చిపోయావనుకున్నా బేబీ’ అన్నది గారాలు పోతూ. ఆ గొంతులో ఆ చనువుకి నా వొళ్ళు సంతోషంతో పులకరించింది. ‘ఐ యామ్‌ గుడ్‌. వర్షం వస్తుంది కదా ఎలా వెళ్తావు? ఫైవ్‌ మినిట్స్‌లో వస్తా. ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తా’ అన్నాను. ‘థాంక్‌ గాడ్‌. క్యాబ్‌ కోసం ట్రై చేస్తుంటే రెస్పాన్స్‌ రావట్లేదు. కమాన్‌ తొందరగా వచ్చేయ్‌. నీతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అవుతోంది. వెయిటింగ్‌ ఫర్‌ యూ..’ అన్న తన మాటలకి కొత్త ఉత్సాహం ఆవరించింది నన్ను.

రెడ్‌ కలర్‌ చుడీదార్‌ పై కొన్ని వర్షపు చినుకులు అద్దుకొని మంచి పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి కార్‌లో కూర్చుంది. ఆ కళ్ళు చూస్తేనే మైకం కమ్ముకుంటుంది నాలో. ఎప్పటిలాగానే గలగలా మాట్లాడుతుంటే ముందున్న అద్దంలో మెరిసే తన పెదాలనే  చూస్తున్నా.  ‘హే.. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చల్లటి ఐస్క్రీమ్‌ చప్పరించాలని ఉంది’ అంది. ‘నిజం చెప్పనా! నాకైతే నిన్ను చూస్తూ చిల్డ్‌ బీర్‌ కొట్టాలని ఉంది’ అన్నాను. ‘అబ్బా.. నీకెప్పుడూ బోల్డ్‌ థాట్స్‌ వస్తాయి.. లెట్స్‌ డూ ఇట్‌..’ అంటూ కన్ను గీటింది.

తను అలా చేస్తే ఏదో తెలియని థ్రిల్‌ ఫీలింగ్‌ కలిగింది నాకు. ‘అయితే చలో నా ఫ్లాట్‌కే పోదాం. ఫ్రిజ్‌లో ఐస్క్రీమ్, బీర్‌ రెండూ ఉన్నాయి’ అంటూ నేను కూడా కన్ను గీటాను కావాలని. ‘డన్‌..’ అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బాల్కనీలో కూర్చొని, వర్షాన్ని ఆస్వాదిస్తూ తను బటర్‌ స్కాచ్‌ని, నేను బడ్వైజర్‌ని రుచి చూస్తున్నాం. ఎలా మొదలు పెట్టాలో అర్థంకావటం లేదు నాకు. డైరెక్ట్‌గా ప్రపోజ్‌ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుంటే భరించలేను. నా గురించి అందరికీ చెపితే ఆ అవమానాన్ని తట్టుకోలేను. బాల్కనీ కుండీల్లో రకరకాల మొక్కలు ఉంటే, వాటివైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మానస.

బీర్‌తో పాటు నైట్‌ క్వీన్‌ గుబాళింపు ఒక వైపు, మరువం పరిమళం ఇంకో వైపు నాకు మత్తుని కలిగిస్తున్నాయి. ధైర్యం చేసుకొని తన దగ్గరగా వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. అదే మెరుపు. నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా..చప్పున తన భుజాలు పట్టుకొని ముద్దు పెట్టి ‘లవ్‌ యూ మానసా..’ అన్నాను. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయి నిలుచుంది తను. నా వొంట్లో భయం కలిసిన ఉద్విగ్నత. ‘నీకు ఎందుకు ఇలా అనిపించింది. ఇది కరెక్టేనా?’అని అడిగింది. ముద్దు పెడితే ఏమీ అనకుండా ఆ ప్రశ్న అడగటంతో నాకు ధైర్యం వచ్చింది.

‘కరెక్టో కాదో అన్నది ప్రశ్న కాదు. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. నాకు నువ్వు కావాలి. జీవితాంతం నీ తోడు కావాలి’ అన్నాను. అంతే లతలా నన్ను పెనవేసుకొని ‘లవ్‌ యూ టూ డియర్‌’ అని నా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు. ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలయ్యింది. ఎన్నో కబుర్లు, సినిమాలు, పార్టీలు, అలకలు, ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ.. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాం. అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడన్‌గా తరుణ్‌తో నా పెళ్లి అంటూ వెడ్డింగ్‌ కార్డు ఇచ్చింది. నా ఆలోచనలకు బ్రేక్‌ వేస్తూ బేగంపేట్‌ వచ్చింది.
∙∙ 
నేను వెళ్లేసరికి వెడ్డింగ్‌ డ్రెస్‌ సెలక్షన్‌లో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ‘తరుణ్‌.. మీట్‌ మై బాస్‌ ఇన్‌ మై ఫస్ట్‌ జాబ్‌. అఫ్‌కోర్స్‌ ఇప్పుడు మాత్రం తనే నాకున్న ఒకే ఒక్క క్లోజ్‌ ఫ్రెండ్‌ అనుకో’ అని నన్ను పరిచయం చేసింది. ఆ మాటకు నా హృదయం భగ్గుమంది. ‘ఎంతకు తెగించావే రాక్షసి. నేను క్లోజ్‌ ఫ్రెండ్‌ అంతేనా? ఇంకేమీ కానా? అయినా ఎలా చెపుతావు లే!’అని మనసులో అనుకున్నాను. మొహం మీద బలవంతంగా నవ్వు పులుముకొని ‘హాయ్‌’ అన్నాను. ఇంకేం మాట్లాడబుద్ధి కాలేదు. వాళ్లిద్దరినీ అలా చూస్తుంటే బాధ, కోపం, కసి, చిరాకు.. మనసంతా చేదుగా అయిపోయింది.

మానస లేకుండా నేను అసలు జీవించగలనా! ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ఈ ఇడియట్‌ తరుణ్‌ గాడు? మమ్మల్ని వేరు చెయ్యటానికే పుట్టినట్లున్నాడు. నాకు వాడంటే అసూయ, అసహ్యం రెండూ కలిగాయి. షాపింగ్‌ అయిపోయింది. వస్తుంటే ‘మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఇది నా నుండి ఇన్విటేషన్‌’ అన్నాడు తరుణ్‌. ‘ష్యూర్‌.. సీ యూ’అని చెప్పి బయట పడ్డాను. మానస ఎప్పటికైనా నాకే సొంతం కావాలి. తను లేకుంటే నాకు చావే దిక్కు అనిపించింది. దేవుడా ఎలాగైనా ఈ పెళ్లి ఆపు అని జీవితంలో మొదటిసారి దేవుడికి మొక్కుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించలేదు.

వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నా కళ్ల ముందు అంతా శూన్యం. ఇంత చేసినా ఆశ్చర్యంగా నాకు మానస మీద కోపం మాత్రం రావట్లేదు. ప్రతిరోజు తన గొంతు వినాలని, తనని చూడాలని అనిపించి పిచ్చెక్కేది. కాల్‌ చేస్తే జస్ట్‌ హాయ్, బాయ్‌ అని రెండు మూడు మాటలు మాట్లాడి ఫోన్‌ కట్‌ చేసేది అంతే. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నేనో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అది ఎంత కఠినమయినా కచ్చితంగా ఆచరణలో పెట్టాలని డిసైడ్‌ అయ్యాను. వాళ్ళ పెళ్ళైన వారం రోజుల తరువాత ఒక రోజు ఉదయాన్నే ఫోన్‌ చేసింది మానస.

‘హేయ్‌.. ఏం చేస్తున్నావ్‌? మరిచిపోయావా మమ్మల్ని? ఈ రోజు నేను ఆఫీస్‌కి వెళ్లట్లేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. వచ్చేయ్‌ ఇంటికి’ అంది. అడ్రస్‌ అడిగి జుట్టు కూడా సరిగ్గా దువ్వుకోకుండా బయటపడ్డాను. ఎందుకు రమ్మంది? క్యాజువల్‌గానా లేక ఇంకేదైనా చెప్పటానికా? నాలో అంతులేని ప్రశ్నలు. నేను వెళ్లేసరికి తరుణ్‌ ఇంకా పోలేదు. రెడీ అయ్యి షూ వేసుకుంటున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యంగా ‘అరే చెప్పకుండా వచ్చారు? ముందే చెపితే నేను కూడా లీవ్‌ పెట్టే వాడిని కదా! ఎనీవే ఆఫ్టర్‌ నూన్‌ వచ్చేస్తాను. లంచ్‌ ముగ్గురం కలిసే చేద్దాం. బాయ్‌’ అంటూ వెళ్ళిపోయాడు. వీడికి మా ఇద్దరి మీద డౌట్‌ వచ్చే అవకాశం అస్సలు లేదులే అనుకున్నాను.

నన్ను చూస్తూనే గట్టిగా కౌగిలించుకొని ‘మిస్‌ యూ బేబీ..’ అంటూ ముద్దు పెట్టింది మానస. నాకు ఏడుపు ఆగలేదు. ‘ఎందుకిలా చేశావ్‌? నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావ్‌? నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా?’ నిలదీశాను. నా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ‘ఇప్పుడేమైంది? నిన్ను దూరం పెట్టను అని చెప్పాగా. నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమే’ అంది. ‘మరి అలాంటప్పుడు ఆ తరుణ్‌గాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు?’ కొంచెం కోపంగా అడిగాను. ‘ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటే లోకం ఒప్పుకోదు కాబట్టి.

చూడు అమృతా.. నాకు నీ ప్రేమ కావాలి. సోషల్‌ లైఫ్‌ కావాలి. అలాగే పిల్లలు కూడా కావాలి. అందుకోసం తరుణ్‌ని పెళ్లి చేసుకున్నాను. కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు..’ అని చెప్పుకుంటూ పోతోంది. తన నుండి దూరంగా జరిగి ‘ప్రేమంటే రెండు దేహాల కలయిక మాత్రమే కాదు. రెండు మనసుల అపూర్వ సంగమం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. ఇంకో వ్యక్తికి చోటు ఉండదు. కానీ నువ్వు అలా కాదు. నీది నిజమైన ప్రేమ కాదు’ అన్నాను. ‘అమృతా.. ప్లీజ్‌ అలా అనకు. నన్నర్థం చేసుకో’ నా చేతులు పట్టుకుంటూ అడిగింది.

‘ఒకే జెండర్‌ అయినా, జెండర్స్‌ వేరైనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మూడో వ్యక్తితో రిలేషన్‌ అంటే అది మొదటి ప్రేమికుడు లేదా ప్రేమికురాలికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అది మానసిక వ్యభిచారం లాంటిదే’ స్థిరంగా చెప్పాను. ‘అమృతా.. చెప్పానుగా.. సమాజం కోసం.. ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్‌ కోసమే నేను తరుణ్‌ని పెళ్లి చేసుకుంది. నాకు  నువ్వే ప్రాణం’ అంది. ‘నేను నీ ప్రాణమే అయితే నన్నిలా వదిలేసే దానివి కాదు. జీవితాంతం నాకు తోడుగా ఉండేదానివి. నీ కోసం ఎవ్వరినైనా ఎదిరించి బతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు? నీది స్వార్థం. నిజమైన ప్రేమకు కావాల్సింది నమ్మకం. అది నీ మీద నాకు ఇప్పుడు లేదు. మళ్ళీ నా జీవితంలో ప్రవేశించాలని చూడకు. గుడ్‌ బై’ అని చెప్పి బయటకు నడిచాను. 

--మొగలి అనిల్‌ కుమార్‌ రెడ్డి

(చదవండి:
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement