స్ఫూర్తినిచ్చే సినిమాలు చూశారా..
ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, నిలదొక్కుకోవడం అన్నది అంత సులువైన వ్యవహారం కాదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కుంగిపోకుండా పోరాడితేనే విజయం సాధ్యమవుతుంది. ఇందుకోసం స్ఫూర్తినిచ్చేవి చిత్రాలు అనేకం ఉన్నాయి. అలా ఎంట్రప్రెన్యూర్లు చూడతగ్గ ఆస్కార్ అవార్డు స్థాయి హాలీవుడ్ చిత్రాల్లో కొన్ని..
మనీబాల్
వనరులు లేక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బేస్‌బాల్ టీమ్‌ను మళ్లీ పైకి తీసుకొచ్చేందుకు మేనేజర్ (బ్రాడ్ పిట్) చేసిన ప్రయత్నాలు దీని కథాంశం. సాధారణంగా చిన్న వ్యాపారాలు చేసే వారికి అనేక పరిమితులు ఉంటాయి. అలాం టప్పుడు అందుబాటులో ఉన్న స్వల్ప నిధులను, వనరులను సమర్ధంగా ఎలా వినియోగించుకోవచ్చనేది తెలుసుకోవచ్చు.
ది పర్‌స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్
అమెరికన్ ఇన్వెస్టర్ క్రిస్టొఫర్ గార్డ్‌నర్ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం ఇది. నిలువ నీడ లేని పరిస్థితుల నుంచి గార్డ్‌నర్ కోటీశ్వరుడిగా ఎదిగారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ.. లక్ష్యంపై గురి తప్పకూడదని, కష్టాలను ఓర్చుకుంటే అంతిమంగా విజయాన్ని దక్కించుకోవచ్చన్నది ఈ చిత్రం చెప్పే సారాంశం.
పైరేట్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ
దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థల సృష్టికర్తల బయోగ్రఫీలాంటి చిత్రం ఇది. రెండు కంపెనీల తొలినాళ్ల పరిస్థితులను పోల్చి చూపుతుంది. దీన్ని ఎందుకు చూడొచ్చంటే.. స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్.. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రోల్ మోడల్స్ లాంటి వాళ్లు. వారిద్దరూ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు, విజయాలు సాధించారు, టెక్నాలజీ ప్రపంచానికి ఎలా ఆద్యులయ్యారనేది తెలుసుకోవచ్చు.
ఫ్లాష్ ఆఫ్ జీనియస్
ఒక ఆటోమొబైల్ ఆవిష్కర్త.. కొత్త ఉత్పత్తిని రూపొందిస్తాడు. ఆటోమొబైల్ రంగంలో అది సంచలనంగా మారినా క్రెడిట్ మాత్రం అతనికి దక్కదు. దీంతో గుర్తింపు, మేథోహక్కుల కోసం అతను పెద్ద కంపెనీలతో పోరాడాల్సి వస్తుంది. ఐడియా మనదే అయినా వాటిని కాపీ కొట్టేసి తమదని చెప్పుకునే పోటీ సంస్థలు చాలా ఉంటాయి. కాబట్టి మన ఐడియాలు చోరీకి కాకుండా చూసుకోవాల్సిన అవసరం గురించి ఇది చెబుతుంది.