'అది హైదరాబాద్, దారుల్‌షిఫా, మలక్‌పేట్, నూర్‌ఖాన్ బజార్‌లోని బాల్‌షెట్టీ ఖేత్ గ్రౌండ్. పది నుంచి పదిహేనేళ్ల వయసు బాలికలు ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. వారి మధ్యలో ఓ అరవై ఏళ్ల మహిళ. ఆ మహిళకు హైఫైవ్ ఇస్తూ, ఫిస్ట్ పంచ్‌లతో ఆడుకుంటున్నారు. ఆ బాలికలు సంతోషంగా రెక్కలు విచ్చుకోవడానికి కారణం ఆ మహిళ. ఆమె పేరు రుబీనా నఫీస్ ఫాతిమా. అమ్మాయిలు గడపదాటి బయటకు రావడానికి ఆంక్షలున్న కుటుంబాల ఆడపిల్లలకు ఆకాంక్షల రెక్కలు తొడిగారామె.
ఆశయాల లక్ష్యాలను వారి మెడలో హారంగా వేశారు. ఇందుకోసం సఫా అనే సంస్థను స్థాపించారు. బాలికలు తమ కలలను సాధించుకోవడానికి తగిన సాధన కోసం గ్రౌండ్‌ను వారి కోసం కేటాయిచేలా చేశారు. ఇస్లాం సంప్రదాయాల గౌరవానికి విఘాతం కలగని విధంగా దుస్తులు ధరించి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తారు. పదిహేనేళ్లుగా వ్యవస్థీకృతంగా సేవలందిస్తున్న రుబీనా నఫీస్ ఫాతిమా తన స్వచ్ఛంద సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.'
తాతగారి స్ఫూర్తితో..
‘‘మా నాన్న లెఫ్టినెంట్ కల్నల్ ఖాన్. అమ్మ మిలటరీ స్కూల్‌లో టీచర్. మా కుటుంబం అభ్యుదయ భావాలతో ఎదగడానికి కారణం మా తాతగారు సులేమాన్ ఆఫ్తాబ్ అలీ (అమ్మవాళ్ల నాన్న). మహిళలు చదువుకోవాలని, ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకూడదని, అప్పుడే సమాజంలో మహిళకు గౌరవం దక్కుతుందని చెప్పేవారు. ఆయన అమ్మను అలాగే పెంచారు. ఇక పేరెంట్స్ ఉద్యోగరీత్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరిగాను. సెక్యులర్ వాతావరణంలో పెరగడంతో పాటు అన్ని రకాల సంస్కృతులను గౌరవించడం నేర్చుకున్నాను.
ఆడపిల్ల అనే కారణంగా ఇంట్లో నాకు ఎటువంటి ఆంక్షలూ లేవు. బాడ్‌మింటన్ ప్లేయర్‌గా జాతీయస్థాయిలో ఆడాను కూడా. ఇరవై ఏళ్లకే స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేశాను. పెళ్లి తర్వాత భర్తతో΄ాటు సౌదీ అరేబియాకు వెళ్లాను. అక్కడ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేసిన భారతీయ మహిళను. కొంతకాలానికి ఇండియాకి వచ్చేశాం. ఇక్కడకు వచ్చిన తర్వాత సొంతంగా బిజినెస్ మొదలుపెట్టి దారుణమైన నష్టాలను చూశాను. ఆ తర్వాత నాకు బాగా తెలిసిన పర్యాటక రంగంలో శిక్షణ, ప్లేస్‌మెంట్స్ నన్ను విజేతగా నిలిపింది.
నాకు సర్వీస్ మీదున్న ఆసక్తికొద్దీ కొంత సమయం మహిళల కోసం పని చేయడం మొదలుపెట్టాను. సేవలను మరింత సమగ్రంగా చేయడం కోసం సీఎస్‌ఐఎమ్ నుంచి సర్టిఫికేట్ కోర్సులు చేశాను. మా తాత, నాన్నగారి పేర్లు కూడా వచ్చేటట్లు నా సేవా సంస్థకు సఫా అనే పేరు ఖాయం చేసుకున్నాను. సఫా ద్వారా 2008 నుంచి ముస్లిమ్ మహిళల ఆర్థిక సామాజిక పురోగతి కోసం పని మొదలుపెట్టాను. అప్పటినుంచి కొత్త అనుభవాలు ఎదురయ్యాయి.
ఈ గ్రౌండ్‌లో క్రీడాకారులు పుట్టారు!
సాధారణంగా మగపిల్లలను స్వేచ్ఛగా పెరగనిస్తారు. బాలికలకు కూడా ఆడుకోవాలని ఉంటుంది. వాళ్లు ఆడుకోవడానికి నేను అండగా నిలిచాను. ఒకరోజు ఓ వ్యక్తి బైక్‌తో నేరుగా గ్రౌండ్ మధ్యకు వచ్చేసి బాలికలు ఆడుకోవడాన్ని ప్రశ్నించారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న ఆడపిల్లల మీద మగపిల్లలు రాళ్లు రువ్వారు. జీహెచ్‌ఎమ్‌సీ అధికారులతో మాట్లాడి ఈ గ్రౌండ్‌ను రోజూ రెండు గంటలపాటు బాలికల కోసం రిజర్వ్ చేయించాను. ఆ సమయంలో మగవాళ్లు గ్రౌండ్‌లో అడుగుపెట్టడానికి వీల్లేకుండా అడ్డుకోగలిగాం. ఇప్పుడు రోజూ బాలికలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆడుకుంటున్నారు.
ఈ గ్రౌండ్ నుంచి ఇద్దరు బాలికలు డిస్ట్రిక్ట్ లెవెల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌లుగా ఎదిగారు. నగరంలో 542 గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి గ్రౌండ్ లోనూ బాలికల కోసం రెండు గంటలు కేటాయించి ఆటలను ప్రోత్సహించాలి. క్రీడాకారులుగా ఎదుగుతారు. కనీసం సూర్యరశ్మి తగిలేలా మెలిగితే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ‘గోల్స్ ఫర్ గాళ్స్’ సంస్థ బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి శిక్షణనిస్తుంది. ఆ శిక్షణ కోసం పాత బస్తీ నుంచి బాలికలు వెళ్లడం గొప్ప విజయం అనే చెప్పాలి. పేదమహిళల ఆర్థిక స్వావలంబన సాధన మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక సంస్కరణ చేయగలిగానని గర్వంగా చెప్పగలను. – రుబీనా నఫీస్ ఫాతిమా, సంఘ సేవకురాలు
ఇంటింటికీ వెళ్లాను!
మహిళలను చైతన్యవంతం చేయడానికి గడపగడపకూ వెళ్లాను. వాళ్ల ఇళ్లలో కూర్చుని బయట ప్రపంచం గురించి చెప్పాను. మహిళ ఎలా ఎదగవచ్చో వివరించాను. వాళ్లతో మాట్లాడిన తరవాత నాకు తెలిసినదేమిటంటే... మహిళలకు ఆలోచనలున్నాయి, ఆశయాలున్నాయి, ఆకాంక్షలున్నాయి. వాటన్నింటినీ మొగ్గలోనే తుంచి వేస్తున్న ఆంక్షలు కూడా ఉన్నాయి. పెద్దల గౌరవానికి భంగం కలిగించకుండా, మనోభావాలకు విఘాతం కలగకుండా ఎదగడం నేర్పించాను. బోలా నగర్‌లో చిన్నగదిలో రెండు సెకండ్ హ్యాండ్ టైలరింగ్ మెషీన్‌లతో మొదలైన నా సర్వీస్ ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్, లైవ్లీహుడ్, క్లౌడ్ కిచెన్, ధనక్‌బజార్ వంటి పదిహేను ప్రాజెక్టులకు విస్తరించింది.
ఆరువందల మందికి వండగలిగిన ఇండస్ట్రియల్ కిచెన్ ఉంది. లుక్మా బ్రాండ్ తో మా మహిళలు తయారు చేసే ఆహార ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. ‘ఆర్టిజానియా’ పేరుతో టైలరింగ్ సెంటర్‌లు నడుస్తున్నాయి. ఉద్యోగం కోసం బయటకు వెళ్లడానికి ఇష్టపడని వాతావరణం ఇంకా ఉంది. అలాంటి కొంతమంది ఇళ్లలోనే హ్యాండీక్రాఫ్ట్సŠ, ఇతర వస్తువులు తయారు చేసి వారానికొకసారి మేము ఏర్పాటు చేసే ధనక్ బజార్‌లో స్టాల్ పెట్టుకుని విక్రయిస్తారు. చదువుకు నోచుకోక ఇంతవరకూ పెన్ను వాడని వాళ్లు కూడా పెన్ హోల్డర్‌లు తయారు చేస్తున్నారు. వీటన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడం ఒక ఎత్తయితే బాలికలను క్రీడాకారులుగా తయారు చేయడం మాత్రం కత్తిమీద సాములా మారింది.
శిక్షణనిచ్చాను... పని చూపించాను!
నేను ఎవరికీ ఏదీ ఉచితంగా ఇవ్వలేదు. పని నేర్పిస్తాను, పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తాను. వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడాలి. ఒకరు సంపాదించి, ఐదుగురు తినాలంటే ఆ ఇల్లు ఆర్థికంగా ఎదిగేది ఎప్పటికి? ఇద్దరు సంపాదిస్తుంటే... పిల్లలకు మంచి చదువు సాధ్యమవుతుంది. అందుకే మహిళల ఆర్థిక వృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాను. స్వయం ఉపాధి మార్గాల కోసం జీహెచ్‌ఎంసీతో అనుసంధానమయ్యాం. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ మహిళలు సాధికారత సాధిస్తున్నారు.
సఫా సేవలు హైదరాబాద్ నగరంలో 48 స్లమ్ ఏరియాలకు విస్తరించాయి. మొత్తానికి పాతబస్తీలో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాగలిగాను. బాలికలు చదువుకుంటున్నారు, మహిళలు సొంతంగా డబ్బు సంపాదించుకుంటున్నారు. పిల్లల, పోషణ, పెంపకం గురించి బాధ్యతగా ఉంటున్నారు. తల్లి సంపాదిస్తున్నప్పుడే పిల్లలు ఆమెను గౌరవిస్తారు అని తాతగారు చెప్పిన మాటను ఆచరణలో చూస్తున్నాను’’ అన్నారు రుబీనా నఫీజ్ ఫాతిమా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment