మీ స్ఫూర్తికి సలామ్! | Paralympic medallist holds wheelchair tennis sessions in Colombia | Sakshi
Sakshi News home page

మీ స్ఫూర్తికి సలామ్!

Published Tue, Dec 15 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

మీ స్ఫూర్తికి సలామ్!

మీ స్ఫూర్తికి సలామ్!

మిగిలిన చాలా ఆటలతో పోలిస్తే టెన్నిస్ ఆడటం చాలా కష్టం. దీనికి ఫిట్‌నెస్ ఎక్కువ అవసరం. కోర్టు నలువైపులా పాదరసంలా కదులుతూ షాట్లు ఆడాలంటే చెమటలు కక్కాల్సిందే. అలాంటిది రెండు కాళ్లూ లేకుండా టెన్నిస్ ఆడాలంటే..? ఊహించడానికే భయంగా ఉంది కదా...
 
ఓ చేత్తో కుర్చీని కదుపుకుంటూ బంతి దగ్గరకు వెళ్లాలి. మరో చేత్తో రాకెట్ పట్టుకుని బంతిని ప్రత్యర్థి కోర్టులోకి పంపాలి... నెట్ దగ్గర పడే బంతిని అందుకోవడానికి బేస్‌లైన్ బయటి నుంచి వేగంగా కుర్చీని జరుపుకుంటూ వస్తుంటే... వాళ్ల గొప్పతనాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవు.
 
మన దేశంలో పెద్దగా ఆదరణ లేకపోయినా వీల్‌చెయిర్ టెన్నిస్ ప్రపంచవ్యాప్తంగా మంచి స్థితిలోనే ఉంది. అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా ఉన్నత శిఖరాలకు చేరుకున్న క్రీడాకారులెందరో ఉన్నారు. ఇందులో విజేతలే కాదు... ఆడుతున్న వాళ్లందరి స్ఫూర్తికీ సలామ్.

 
సాక్షి క్రీడావిభాగం: శరీరంలో నడుము నుంచి కింది భాగంలో వైకల్యం ఉన్నవారు మాత్రమే వీల్ చెయిర్ టెన్నిస్ ఆడేందుకు అర్హులు. 1976లో అమెరికాకు చెందిన బ్రాడ్ పార్క్స్ కృషి కారణంగా ఈ వీల్ చెయిర్ టెన్నిస్ వెలుగులోకి వచ్చింది. ప్రారంభంలో రిక్రియేషనల్ ఆట స్థాయిలో ఉన్నా తదనంతరం ప్రొఫెషనల్ క్రీడగా మారింది.

1982లో ఫ్రాన్స్... యూరప్‌లో తొలిసారిగా వీల్ చెయిర్ టెన్నిస్ టోర్నీ నిర్వహించింది. ఆ తర్వాత ఈ ఆటను విశ్వవ్యాప్తం చేసేందుకు 1988లో అంతర్జాతీయ వీల్‌చెయిర్ టెన్నిస్ సమాఖ్య (ఐడబ్ల్యూటీఎఫ్) ఏర్పడింది. అదే ఏడాది1988 సియోల్ పారాలింపిక్స్ క్రీడల్లో ఈ ఆటను ఓ ప్రదర్శన ఈవెంట్‌గా పరిచయం చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు 1992 బార్సిలోనా పారాలింపిక్స్‌లో పూర్తి స్థాయి క్రీడాంశంగా మారింది.

ఇందులో 16 దేశాలు పాల్గొన్నాయి. అటు 1998, జనవరి 1 న ఐడబ్ల్యూటీఎఫ్... అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)లో విలీనమైంది. ఐటీఎఫ్ కూడా ఈ ఆటపై ఎలాంటి వివక్ష చూపకుండా ‘వరల్డ్ క్లాస్’గా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలనూ చేస్తుండటం విశేషం.
 
నిబంధనలు
వీల్ చెయిర్ టెన్నిస్‌లో నిబంధనలు దాదాపుగా రెగ్యులర్ టెన్నిస్‌లో ఉన్నట్టుగానే ఉంటాయి.
* కోర్టుల పరిమాణం, బంతులు, రాకెట్స్ ఇలా వేటిలోనూ మార్పు ఉండదు. ఆటగాళ్లు వీల్ చెయిర్‌లో కూర్చుని ఆడడమే తేడా.
* అలాగే బంతి రెండు సార్లు బౌన్స్ అవ్వచ్చు. రెండోసారి అయ్యే బౌన్స్ కోర్టు లోపల లేదా బయట పడినా పరిగణనలోకి తీసుకుంటారు.
* కానీ కచ్చితంగా మూడో బౌన్స్ అయ్యేలోపు ఆటగాడు బంతిని రిటర్న్ చేయాలి. లేకుంటే పాయింట్ కోల్పోతాడు.
* పురుషులు, మహిళలు, క్వాడ్స్ (రెండు కాళ్లతో పాటు రెండు చేతులు కూడా పనిచేయని వారు) విభాగాల్లో పోటీలు ఉంటాయి.
* క్వాడ్స్ విభాగంలో ఆటగాళ్లు తమ చేతికి రాకెట్ హ్యాండిల్‌ను టేపుతో అతికించి ఎలక్ట్రిక్ వీల్ చెయిర్‌లో కూర్చుని ఆడతారు.
* అన్ని సింగిల్స్ మ్యాచ్‌లు మూడు సెట్‌ల పాటు జరుగుతాయి. అన్ని సెట్లలో టైబ్రేక్ పద్ధతి ఉంటుంది.
* అయితే 2013 సీజన్ నుంచి డబుల్స్ మ్యాచ్‌ల్లో మ్యాచ్ టైబ్రేకర్స్‌ను అమల్లోకి తెచ్చారు. అయితే ఇది ఐటీఎఫ్-1 అంతకన్నా తక్కువ స్థాయి టోర్నీల్లోనే ఉపయోగిస్తారు. గ్రాండ్‌స్లామ్స్‌లో ఆడేటప్పుడు వాటి నిబంధనలే ఉంటాయి.
 
టాప్ స్టార్స్

* ప్రస్తుతం పురుషుల విభాగంలో వీల్‌చెయిర్ టెన్నిస్‌ను శాసిస్తున్న ఆటగాడు జపాన్‌కు చెందిన షింగో కునీడా. ఇప్పటికి సింగిల్స్‌లో 20, డబుల్స్‌లో 19  గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు (2008 బీజింగ్, 2012 లండన్) సాధించాడు. మహిళల్లో జిస్కే గ్రిఫియోన్ (నెదర్లాండ్స్), క్వాడ్‌లో డైలాన్ అల్కాట్ (ఆస్ట్రేలియా) టాప్‌లో ఉన్నారు.
* మహిళల్లో ఏస్తర్ వర్గీర్ (నెదర్లాండ్స్)ను లెజెండ్‌గా చెప్పుకోవచ్చు. ఎనిమిదేళ్ల ఆమె కెరీర్‌లో 42 గ్రాండ్‌స్లామ్స్(సింగిల్స్, డబుల్స్ కలిపి)తో పాటు 22 సీజన్ ఆఖరి చాంపియన్‌షిప్స్, ఏడు పారాలింపిక్స్ టైటిళ్లను నెగ్గి రికార్డు సృష్టించింది. 1999 నుంచి రిటైరయ్యే (2013) వరకు నంబర్‌వన్‌గా కొనసాగింది. 2003 జనవరి నుంచి కెరీర్‌ను ముగించేవరకు 470 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. మొత్తం 700 మ్యాచ్‌ల్లో 25 మాత్రమే ఓడింది.
* పారాలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశంగా నెదర్లాండ్స్ (32) నిలిచింది.
* అలాగే ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో ఈ ఆట ఆడుతున్నారు. వీల్ చెయిర్‌లో కూర్చుని ఆడే ఆటల్లో ఈ క్రీడదే అగ్రస్థానం.
 
 
మేజర్ టోర్నీలు
* ‘వీల్‌చెయిర్ టెన్నిస్ టూర్’లో భాగంగా ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ, సూపర్ సిరీస్, ఐటీఎఫ్ 1,2,3 సిరీస్... ఐటీఎఫ్ ఫ్యూచర్ సిరీస్ జరుగుతాయి. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్... ఈ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలోనూ పోటీలు జరుగుతాయి.
* ‘వీల్‌చెయిర్ టెన్నిస్ మాస్టర్స్’టోర్నమెంట్‌లో పురుషులు, మహిళల్లో టాప్ -8, క్వాడ్‌లో టాప్-4 ర్యాంకర్స్‌ను సింగిల్స్‌లో ఆడనిస్తారు.
* డబుల్స్ మాస్టర్స్‌లో టాప్- 8 పురుషుల, టాప్ -6 మహిళల, టాప్ -4 క్వాడ్ డబుల్స్ జట్లు ఆడతాయి.
* ‘వరల్డ్ టీమ్ కప్’ బాగా ఫేమస్. ఇది ఐటీఎఫ్‌కు చెం దిన అధికారిక వీల్‌చెయిర్ టెన్నిస్ టీమ్ ఈవెంట్. ఓవిధంగా వారికిది డేవిస్ కప్ లాంటిది. ఏడాదిలో ఓసారి వివిధ దేశాల్లో పురుషుల, మహిళల, క్వా డ్స్, జూనియర్ విభాగాల్లో జరుగుతుంది. ఆతిథ్య దేశం ఐటీఎఫ్ సభ్యత్వం కలిగి ఉండాలి.
* ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో ఏటా 160 టోర్నీలు జరుగుతాయి.
 
మనకూ ఉన్నాడొక హీరో
భారత్‌లో వీల్‌చెయిర్ టెన్నిస్ ఇంకా ఎదగలేదు. నిజానికి చాలా మందికి ఇలాంటి ఆట ఒకటుందని కూడా తెలీదు. అయితే ఈ ఆటకు ఆదరణ తెచ్చేందుకు అఖిల భారత లాన్‌టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) 2010 నుంచి జాతీయ వీల్‌చెయిర్ టెన్నిస్ టోర్నీ జరుపుతోంది. ఇక ఈ క్రీడలోనూ మన దేశంలో చెప్పుకోదగ్గ ఆటగాడు ఉన్నాడు. తను బెంగళూరుకు చెందిన హ్యారీ బోనీఫేస్ ప్రభు.

1993లో ప్రొఫెషనల్‌గా మారిన ప్రభు క్వాడ్ విభాగంలో ఆడతాడు. నాలుగేళ్ల ప్రాయంలో వెన్నెముక వ్యాధితో వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యాడు. అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన టెన్నిస్‌లో రాటుదేలాడు. 1978లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించడమే కాకుండా అన్ని గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌లోనూ మెయిన్ ‘డ్రా’ వరకు వెళ్లి సత్తా చాటుకున్నాడు.
 
43 ఏళ్ల ప్రభు సింగిల్స్‌లో అత్యుత్తమ ప్రపంచ ర్యాంక్ 17 కాగా ప్రస్తుతం 48వ స్థానంలో ఉన్నాడు. కెరీర్‌లో 11 టైటిళ్లు సాధించాడు. 2014లో ఆయన్ని భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరిం చింది. దేశంలో వీల్‌చెయిర్ క్రీడలకు ప్రభు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement