కోట, ప్రకాష్‌రాజ్ పాత్రలే ఆదర్శం
విలక్షణ నటులు కోట శ్రీనివాస్‌రావు, ప్రకాష్‌రాజ్‌ల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని, వారి నటనే తనకు ఆదర్శమని సినీ ఆర్టిస్ట్ శ్రావణ్ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఆయన తమ సమీప బంధువుల గృహప్రవేశానికి శనివారం సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రావణ్ తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
-సిద్దిపేట అర్బన్
సాక్షి: ప్రస్తుతం మీరు ఎన్ని సినిమాలలో నటిస్తున్నారు.
శ్రావణ్: ప్రస్తుతం నేను ఆరు సినిమాల్లో నటిస్తున్నాను. పండగ చేసుకో సినిమాలో హీరో రామ్‌కు మామయ్యగా, హీరో బాలకృష్ణ నటిస్తున్న లయన్ సినిమాలో ప్రకాష్ రాజ్‌కు తమ్ముడిగా నెగెటివ్ రోల్ పోషిస్తున్నాను. సాయికిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న అల్లరి నరేష్ సినిమా లో విలన్ పాత్ర, కొరటాల శివ డెరైక్షన్‌లో మహేష్‌బాబు నటిస్తున్న శ్రీమంతుడు సినిమాలో విలన్‌గా నటిస్తున్నా. తమిళంలో రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వైశాలి హీరో ఆది సరసన సెకండ్ హీరో రోల్ చేస్తున్నాను. కన్నడంలో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సజ్జు చేస్తున్న సినిమాలో విలన్‌గా చేస్తున్నాను. వైజాక్ డిస్ట్రిబ్యూటర్ రాజు తనయుడు కార్తిక్ ‘టిప్పు’ సినిమాలోనూ విలన్ పాత్ర పోషిస్తున్నాను.
సాక్షి: మీరు నటించిన గోల్డెన్ ఛాన్స్ సినిమా విశేషాలు?
శ్రావణ్: గోల్డెన్ ఛాన్స్ సినిమాలో హీరో హీరోయిన్‌ను, హీరోయిన్ హీరోను మైండ్‌గేమ్, మనిగేమ్ ఆడుతూ సినిమా ఆధ్యంతం ఆసక్తి కరంగా సాగుతుంది.
సాక్షి: ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు..?
శ్రావణ్: ఇప్పటి వరకు సుమారు 60కి పైగా సినిమాల్లో నటించాను. అందులో ఓ పది సినిమాల్లో పాజిటీవ్ రోల్స్ చేశాను. మిగితావన్ని నెగెటివ్ రోల్సే చేశాను.
సాక్షి : మీకు గుర్తింపు, సంతృప్తినిచ్చిన పాత్రలు?
శ్రావణ్ : నేను నటించిన తులసి, లెజెండ్, నమో వెంకటేష, బిందాస్, సై సినిమాలలో నటించిన పాత్రలు గుర్తింపు తేవడంతో పాటు సంతృప్తినిచ్చాయి. సైలో చోటు పాత్ర ఎంతో సంతృప్తిని కలిగించింది.
సాక్షి : మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
శ్రావణ్ : అపరిచితుడు సినిమాలో విక్రమ్ చేసిన పాత్ర చేయాలని ఉంది.
సాక్షి: విలన్ పాత్ర కోసం ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు..?
శ్రావణ్ : కోట శ్రీనివాస్ స్ఫూర్తితో విలన్ పాత్రలు చేస్తున్నాను. ప్రస్తుతం ప్రకాష్‌రాజ్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళుతున్నాను.
సాక్షి : హిందీలో ఏదైనా సినిమా చేశారా..?
శ్రావణ్ : రాకేష్ శ్రావణ్ దర్శకత్వంలో హిందీలో అమావాస్య్ సినిమాను చేశాను. అందులో పోలీస్ అధికారి పాత్ర పోషించాను. తెలుగులో డెడ్ ఐస్‌గా రూపొందుతుంది. త్వరలోనే హిందీ, తెలుగులో రిలీజ్ కానుంది.
సాక్షి: ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటి..?
శ్రావణ్ : ప్రేక్షకులు సినిమాను వినోదంగా మాత్రమే చూడాలి. సమాజానికి పనికి వచ్చే సినిమాలను ఆదరించాలి. సినిమాలకు ప్రాంతీయ, భాష తారతమ్యం ఉండవని భావించాలి.