
లాడెన్ నోట గాంధీ మాట
- మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకోవాలంటూ తన శ్రేణులకు పిలుపు
- అమెరికా వస్తువులను బహిష్కరించాలని సూచన
- వెలుగులోకి వచ్చిన 1993 నాటి లాడెన్ ఉపన్యాసాలు
లండన్: 'భారత జాతిపిత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుందాం.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకొని అమెరికా వస్తువులను బహిష్కరిద్దాం' ఇలా పిలుపునిచ్చింది ఎవరో శాంతి కాముకుడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్-ఖైదాకు ఒకప్పటి అధినేత ఒసామా బిన్ లాడెన్ స్వయంగా తన మద్దతుదారులతో పలికిన మాటలు ఇవి. 1993 లో ఒక ఉపన్యాసంలో తన శ్రేణులను ఉద్దేశించి లాడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన ఆడియో టేపులు ఇటీవల బయటపడ్డాయి.
1997 నుంచి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ స్థావరంగా లాడెన్ ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అమెరికా సైన్యం 2001లో అఫ్గాన్‌పై దాడి చేయడంతో లాడెన్‌తో పాటు అతడి మద్దతుదారులు చాలామంది అక్కడి నుంచి పారిపోయారు. ఈ సందర్భంలో లాడెన్‌కు సంబంధించిన వేలాది ఆడియో టేపులను అక్కడే వదిలేశారు. ఈ టేపులు చాలా మంది చేతులు మారి చివరకు అఫ్గాన్ మీడియా ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ప్లాగ్ మిల్లర్‌కు చిక్కాయి. అరబిక్ సాహిత్యంలో నిపుణుడైన ప్లాగ్ ఈ టేపులపై పరిశోధన చేసి 'ది ఆడాసియస్ అసెంటిక్' పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు.
1960 నుంచి 2001 వరకు లాడెన్‌తో పాటు 20 మంది ప్రముఖుల ఆడియో టేపుల సమాచారం ఈ పుస్తకంలో ఉంది. 1993 సెప్టెంబర్ నాటి ఒక టేపులో తన శ్రేణులనుద్దేశించి ప్రసంగించిన లాడెన్.. మహాత్ముడి గురించి ప్రస్తావించారు. గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అమెరికాకు వ్యతిరేకంగా లాడెన్ మొదటిసారి మాట్లాడింది కూడా ఈ టేపులోనే కావడంవిశేషం.