అస్వస్థతతో ఉన్న మహాత్మాగాంధీ
‘గాంధీ ప్రాణాలపై ఆయనకు కాదు, దేశానికి హక్కు ఉంది.. ఎందుకంటే ఆయన దేశం ఆస్తి’1918లో దేశం నలుమూలలా వినిపించిన మాట. అప్పటికి ఆయన ‘జాతిపిత’అనిపించుకోలేదు. ఆయన గురించి ఇంకా అంత గొప్ప ప్రచారం జరగలేదు. అయినా జనం ఇలా కోరుకున్నారు. ఆంగ్లేయులను తరిమే ఆశాకిరణంగా ఆయనను అప్పటికే భావించారు. వారి ఆవేదనకు అసలు కారణం.. దేశాన్ని శవాల దిబ్బగా మార్చిన స్పానిష్ ఫ్లూ బారిన ఆయన పడటమే. నీతులు చెప్పే ముందు ఆచరించి చూపే తత్వం ఉన్న గాంధీ, ఆరోగ్యమే మహాభాగ్యం సూత్రాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. మరి దాని ప్రభావమేనేమో.. ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ వైరస్‌ను జయించి ఆంగ్లేయుల పాలన అంతు చూసేందుకు అడుగు ముందుకేశారు..
సాక్షి, హైదరాబాద్: ఆంగ్లేయులను ఓడించటానికి ముందే మహాత్మా గాంధీ మహమ్మారిని జయించారు. రక్తం చిందించకుండా శాంతి మంత్రాన్నే ఆయుధంగా చేసుకుని ఆంగ్లేయులను జయిస్తే.. ఆరోగ్య సూత్రాలను నిరంతరం పాటించే అలవాటున్న ఆయన ప్రాణాంతక స్పానిష్ ఫ్లూ మహమ్మారిపై విజయం సాధించారు. నాడు మహాత్ముడు చెప్పిన ఆరోగ్య సూత్రాలను ప్రజలు పాటించి ఉంటే ఇప్పుడు కరోనా విషయంలో మన దేశం ఇంతగా భయపడి ఉండేది కాదేమో.. కనీసం ఇప్పటికైనా జాతిపిత ఆరోగ్య సందేశాన్ని మననం చేసుకుని ఆచరించే మనసుపెడితే భవిష్యత్తులో మహమ్మారుల వ్యాక్సిన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా మన ఇమ్యూనిటీతోనే తరిమికొట్టొచ్చు..!!!
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చి సరిగ్గా నాలుగేళ్లయింది.. 48 ఏళ్ల మహాత్మాగాంధీ సబ ర్మతి ఆశ్రమంలో నిరంతరం దీర్ఘాలోచనతో ఉంటున్నారు. అప్పుడు దేశంలోని చాలా ప్రాంతాలు కరువుకోరల్లో చిక్కుకున్నాయి. కాలం కలసిరాక అన్నదాత చెమట చుక్క బీళ్లు తేలి న భూముల్లో ఆవిరైంది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం పన్నుల కోసం వేధిస్తోంది. ‘కరువు తీవ్రం గా ఉన్న సమయంలో పన్ను లు చెల్లించం’నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్నదే గాంధీ దీర్ఘాలోచనకు కారణం. అందుకు ఆయన సత్యాగ్రహాన్ని నమ్ముకున్నారు. ఆ సత్యాగ్రహం ఎలా ఉండాల న్న విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో కలసి సమాలోచనలు చేస్తూ దానికి తుది రూపం ఇస్తున్నారు. కానీ కరువును మించిన ప్రమాదకారి అప్పటికే దేశంలోకి చొరబడిందన్న సంగతి మహాత్ముడికి తెలియదు.
అదే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మందికిపైగా పొట్టనపెట్టుకున్న స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా. ఆ ప్రమాదకర వైరస్ తొలి దాడి సాధారణంగా ఉన్నా, రెండో విడత విరుచుకుపడింది. చూస్తుండగానే దేశం అల్లకల్లోలమైంది. కోటిన్నర మంది (కచ్చితమైన అంచనా లేదు) మన దేశంలో దానికి బలయ్యారు. అంతటి ప్రమాదకర వైరస్ దాడి ప్రారంభమైన సమయం. సబర్మతి ఆశ్రమంలో తన అనుచరులతో కలసి ఉన్న మహాత్ముడిని కూడా అది వదల్లేదు. తీవ్ర జ్వరం, అలసట, నీరసం, ప్రాణం ఉంటుందో లేదోనన్న బాధ.. స్పానిష్ ఫ్లూ ఆవహించిందని మహాత్ముడు సులభంగానే గ్రహించారు. సత్యాగ్రహాన్ని విజయవంతంగా జనంలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యం.. దాన్ని సాధించాలంటే ముందుగా వైరస్ చెర నుంచి విడిపించుకోవాలి. వెరసి బాపూ ముందు రెండు టార్గెట్లు..
ఆరోగ్య సూత్రాలే కాపాడి ఉంటాయి..
ప్రపంచం మొత్తాన్ని కబళించాలన్న కసితో పంజా విసిరిందా అన్నట్టు నాటి స్పానిష్ వైరస్ ఉగ్రరూపాన్ని చూసి మానవజాతే వణికిపోయిం ది. అంతటి భయంకరమైన వైరస్ బారిన పడ్డ వృద్ధుల్లో చాలామంది చనిపోయా రు. అలా అని మధ్య వయస్కులంతా బయటపడలేకపోయారు. కానీ శరీరం లో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉన్నవారిలో చాలామంది వైరస్ సోకినా కూడా ప్రాణా లు దక్కించుకోగలిగారు. 48 ఏళ్ల వయసు కావటం వల్లనేమో గాంధీ కూడా దాన్ని తరిమేయగలిగారు. అయితే, అది అంత సులువుగా జరిగింది కాదు. గాంధీ జీవితంలో ఎక్కువ రోజు లు అనారోగ్యంతో గడిపిన సందర్భం అదేనట. కొన్ని నెలల పాటు ఆయన అనారోగ్యంతో పోరాడి గెలిచా రు. క్రమశిక్షణకు మారుపేరైన కరంచంద్ గాంధీ.. ఆరోగ్యం విషయంలోనూ అలాగే ఉండేవారు.
ముఖ్యంగా ఆయన భోజన అలవాట్లు చాలా ఆరోగ్యకరం గా ఉండేవి. రాత్రి తొందరగా పడుకోవటం, ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర లేవడం, ధ్యానం, యోగా, వేళకు భోజనం, అదీ మితంగా, అందులోనూ సాత్వికాహారం.. వెరసి ఆయన శరీరం తన చేతుల్లో ఉండేది. కఠోర కాలాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించదగ్గ మానసిక స్థితి గాంధీని కాపాడిందని చరిత్రకా రులు చెబుతారు. ‘వందేళ్ల నాడు దాదాపు భారతీయులందరూ ఈ వైరస్ బారినపడ్డవారే.. కొందరిలో దాని తీవ్రత ఎక్కువ, కొందరిలో తక్కువ. చాలామందికి అసలు వైరస్ సోకిందన్న సంగతే తెలియదు. రోగ నిరోధక శక్తి ఉన్నవారు మామూలు జలుబు జ్వరంగానే భావించి దాని నుంచి బయటపడ్డారు. గాంధీ శరీరంలోకి చేరిన వైరస్ తీవ్రత గురించి తెలియదు. కానీ, క్రమశిక్షణతో కూడిన జీవనం, ఆహార అలవాట్లున్న వారు కాస్త తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వైరస్ నుంచి తేరుకోగలరు. గాంధీ అలా బయటపడి ఉండొచ్చు’ అని చరిత్రకారుడు డాక్టర్ రాజారెడ్డి వ్యాఖ్యానించారు.
ఆ సమయమే పోరాటపటిమను పెంచింది..
దేశం నుంచి ఆంగ్లేయులను తరిమికొట్టాలన్న కసితో ఉన్న గాంధీకి ఆ వైరస్ సోకిన సమయం గొప్ప పోరా ట పటిమను పెంచిందంటారు. దేశంలో కోటిన్నర మంది చనిపోయేంత అతి తీవ్ర పరిస్థితులు నెలకొన్నా బ్రిటిష్ పాలకులు సరిగా వ్యవహరించకపోవటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. వారిని తరిమికొట్టే వరకు పోరు ఆపొద్దని గట్టిగా సంకల్పించుకున్నారు.
‘ఆరోగ్య’ నినాదానికి పదునప్పుడే..
స్వాతంత్య్రోద్యమంలో ప్రజలను సమాయత్తం చేసేందుకు దేశం నలుమూలలా తిరిగిన గాంధీ, వారిలో ఉత్తేజం నింపే ఉద్యమ మాటలే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడుకునే గొప్ప నినాదాన్నీ వారికి నూరిపోశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని ఊరూరుకు తీసుకెళ్లగలిగారు. ఇందుకు నాటి వైరస్ రోజుల్లో అనుభవించిన కష్టాలే కారణం. అప్పటికే ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చే గాంధీ, స్పాని ష్ ఫ్లూ లాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉండాలని పిలుపిచ్చారు.
మహాత్ముడు.. మేక పాలు: ఆవు, గేదె పాలు తాగొ ద్దని నిర్ణయించుకుని చివరకు మేక పాలు తాగటాన్ని అలవాటు చేసుకున్న గాంధీ.. ఆ నిర్ణయాన్ని కడవరకూ ఎలా అమలు చేశారో ఆయన చరిత్రలో కథలు కథలుగా చెప్పుకొంటారు. మేకలు అన్ని చోట్లా ఉన్నా, వాటి పాలు అందుబాటులో ఉండవు. వాటిని తాగే వారి సంఖ్య అతి తక్కువగా ఉండటమే కారణం. గాంధీ వేరే ప్రాంతానికి వెళ్తే మేక పాలు దొరికేవి కావు. ఒకసారి ఆవు, గేదె పాలు తాగొద్దని నిర్ణయించుకున్నాక వాటిని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకపోవటం ఆయన నియమం. అందుకోసం ఆయన ఎక్కడికెళ్లినా వెంట మేకను తీసుకెళ్లే వారు, విదేశాలకు వెళ్లినా ఆయన వెంట రెండు మేకలు కూడా ఉండేవి.
ఆ మాటలు ఆచరించి ఉంటే కరోనా కష్టాల తీవ్రత తగ్గేది
ఆరోగ్యం విషయంలో మహాత్ముడు చెప్పిన అంశాలను నాటి జనం విన్నా, నేటి తరం పెడచెవిన పెడుతోంది. ఆరోగ్యం బాగుంటేనే ఉద్యమం చేయగలుగుతామని నాటి స్వాతంత్య్ర సమర సమయంలో గాంధీ తేల్చుకున్నారు. వైరస్ దెబ్బకు దేశం మొత్తం కుదేలవటాన్ని కళ్లారా చూసిన ఆయన, తొలుత ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితేనే బ్రిటిష్ వారిని తరమగలరని భావించారు. అందుకే తన ఉద్యమ ఉపన్యాసంలో ‘ఆరోగ్య మంత్రాన్నీ’చేర్చారు. తాను ఆచరించి చూపితేనే ప్రజలు అమలు చేస్తారని భావించి వారికి అదర్శంగా నిలిచారు.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ మాటను ఆయన నిజం చేసుకున్నారు
‘గాంధీలోని గొప్ప లక్షణం ఏంటంటే తను నమ్మిన సిద్ధాంతాన్ని ముందుగా తను ఆచరించే జనాన్ని అనుసరిం చాలని కోరేవారు. ఆరోగ్యం విషయంలోనూ అంతే. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంద ని బలంగా నమ్మిన ఆయన, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ జనానికి చేసిన హిత బోధ మామూలుది కాదు. ఈ విషయంలో ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆరోగ్య సూత్రాలు పాటించే తత్వం అయినందునే ఆయన అత్యంత ప్రమాదకరంగా చరిత్రలో నిలిచిపోయిన స్పానిష్ ఫ్లూ నుంచి బయటపడ్డారని భావిస్తాను. నేను పాఠశాల విద్యార్థిగా ఉండగా, ఆయన ఫ్లూ బారిన పడి మళ్లీ పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎదిగిన తీరుపై మాట్లాడుకోవడం విన్నాను...’ – చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త
Comments
Please login to add a commentAdd a comment