'చైనా ఆర్థిక విజయాలు మాకు ఆదర్శం'
గాంగ్జౌ: చైనాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం భారత్-చైనా బిజినెస్ ఫోరంలో ప్రసంగించారు. భారత- చైనాల పాత బంధాలను బలోపేతం చేయడానికి ఇదొక అద్భుత సమయమని ప్రణబ్ తెలిపారు. చైనా సాధించిన ఆర్థిక విజయాలు భారత్ కు ఆదర్శం అని ఆయన కొనియాడారు. మా ఉత్పత్తులకు చైనా మార్కెట్లో డిమాండ్ పెరగాలని భారత్ ఎదురు చూస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కీలక ప్రాంతాల్లో సమగ్ర సంస్కరణలు ప్రవేశపెట్టడంతో భారత్లో వ్యాపారం చేయడం సులభతరంగా మారిందని పేర్కొన్నారు. చైనా నుంచి భారత్లో పెట్టుబడులు పెరగడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నామని ప్రణబ్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ భారత వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు.
గురువారం బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర నాయకులతో రాష్ట్రపతి చర్చిస్తారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఆ దేశ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ ఝాంగ్ డేజియాంగ్‌లతో కూడా భేటీ అవుతారు.