ఉగ్ర పోరుకు చైనా సహకారం
- పౌర అణు ఒప్పందానికి సహకరిస్తుందని ప్రణబ్ ఆశాభావం
- ముగిసిన రాష్ట్రపతి నాలుగు రోజుల చైనా పర్యటన
బీజింగ్: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌తో మరింత చురుగ్గా కలిసి పనిచేసేందుకు చైనా అంగీకరించిందని, ఐరాసలోను ఉమ్మడి సహకారంపై ఏకాభిప్రాయం కుదిరిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం చెప్పారు. నాలుగు రోజుల చైనా పర్యటన ముగించుకున్న ఆయన తిరుగు ప్రయాణంలో విమానంలో విలేకరులతో ముచ్చటించారు. పౌర అణు పథకంలో భారత్ చేరేందుకు సానుకూల, సహకారంతో కూడిన వాతావరణం చైనా కల్పిస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉగ్రవాదం ప్రధాన అజెండాగా చర్చలు సాగాయని, ఉగ్రవాద చర్యలు పెరుగుతుండడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఉందంటూ చైనా నాయకత్వానికి వివరించానన్నారు.
మూడున్నర దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని, మంచి ఉగ్రవాది, చెడ్డ ఉగ్రవాది ఉండరంటూ జిన్‌పింగ్‌తో స్పష్టం చేశానని తెలిపారు. పొరుగు దేశంగా ఉన్న చైనా ఉగ్రవాదంపై భారత్‌తో కలిసి పనిచేయాలని సూచించానన్నారు. మసూద్ అజహర్ అంశంపై చర్చించారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా ప్రత్యేకంగా ఒక్క అంశంపై చర్చించలేదని, విధానపర అంశాలపైనే భేటీ సాగిందన్నారు.ఇరుగు పొరుగు దేశాల మధ్య విభేదాలు ఉండడం సహజమని, విభేదాల్ని పరిష్కరించుకుంటూ సంబంధాల్ని విస్తృత పరచుకోవాలంటూ ఇరు దేశాలు నిర్ణయించాయన్నారు. సరిహద్దు సమస్యకు త్వరిత పరిష్కారం కనుగొనాలన్న చైనా వాదనతో తాను ఏకీభవించానని, సరిహద్దు నిర్వహణ, శాంతి పరిరక్షణను మెరుగుపర్చుకోవాలని నిర్ణయించామని తెలిపారు. చైనా పర్యటన విజయవంతమైందని, ఆ దేశ నేతలతో చర్చలు ఫలప్రదంగా సాగాయని చెప్పారు.