కుక్కతోక వంకరే.. చైనా మళ్లీ పాక్ భజన
బీజింగ్: కుక్క తోక ఎప్పటికీ వంకరే అన్న చందాన ఉంది పాకిస్థాన్ విషయంలో చైనా తీరు. ఉగ్రవాదంపై తాము గట్టిగా స్పందించిన తర్వాత పాకిస్థాన్ అలకలో ఉన్నట్లు గమనించింది కాబోలు.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చైనా బుజ్జగింపు చర్యలకు దిగింది. ఒకరి తర్వాత ఒకరు అదే పనిగా పాక్‌ను తెగ పొగిడేస్తున్నారు. ఓ పక్క పాకిస్థాన్‌కు అమెరికా గట్టి వార్నింగ్‌లు ఇస్తూ ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తుండగా చైనా మాత్రం పాక్‌ను వెనుకేసుకొస్తోంది. పాకిస్థాన్ ఇప్పటికే భారీ మొత్తంలో త్యాగాలు చేసిందంటూ కితాబిచ్చింది. 'పాకిస్థాన్ ప్రభుత్వం, అక్కడి ప్రజలు పెద్ద మొత్తంలో త్యాగాలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వారు అలుపులేని పోరాటం చేస్తున్నారు. అలాంటి కృషిని, త్యాగాలను ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఉంది' అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు.
'అంతర్జాతీయ సమాజం కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించాలి.. పాకిస్థాన్‌కు ఆ ఖ్యాతి దక్కి తీరాలి.. అందుకు ఆ దేశం అర్హత కలిగింది' అంటూ తెగ పొగిడేశారు. అప్ఘన్ సైనికులపైన, అక్కడ ఉన్న అమెరికా సైనికులపైన పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, ఇది ఇలాగే ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాక్‌కు గట్టి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు బ్రిక్స్ సదస్సులో చైనా కూడా పాక్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం చైనా పాక్‌తో బంధం బీటలువారకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.