బీజింగ్: ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తూ, వారి స్థావరాలను కాపాడుతున్న దేశాలను గుర్తించడం కూడా ఉగ్రవాదంపై పోరాటంలో భాగమేనంటూ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రాథమిక మానవ హక్కులకు ఉగ్రవాదం ఓ శత్రువని మంగళవారం సుష్మ పేర్కొన్నారు. చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ సహా మొత్తం 8 సభ్యదేశాల విదేశాంగ మంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ‘ప్రపంచం నేడు అనేక సవాళ్లను ఎదుర్కోంటోంది. వాటిలో ప్రప్రథమమైనది ఉగ్రవాదం. ప్రాథమిక మానవ హక్కులైన జీవనం, శాంతి, సౌభాగ్యాలకు ఉగ్రవాదం శత్రువు. బహుళత్వం పరిఢవిల్లుతున్న దేశాల్లో భయం అనే గోడలను నిర్మించాలనీ, స్థిరత్వాన్ని దెబ్బతీయాలని ఉగ్రవాదులు చూస్తున్నారు. వారిని సరిహద్దులు ఆపలేవు.
ఉగ్రవాదులను మాత్రమే అంతం చేస్తే సరిపోదు. ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్న దేశాలను కూడా గుర్తించి వాటిని నియంత్రించినప్పుడే మన పోరాటం విజయవంతమవుతుంది. ఇందుకోసం అన్ని దేశాలూ కలసి ఉమ్మడి పోరు సాగించాలి’ అని సుష్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) సంస్కరణలపై కూడా ఆమె మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే సామర్థ్యం యూఎన్‌ఎస్‌సీకి రోజురోజుకూ తగ్గిపోతోందనీ, కొన్నిసార్లు అసలు సమస్యలను పరిష్కరించడమే తనకు ఇష్టం లేనట్లుగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. చైనా పర్యటనను ముగించుకున్న సుష్మ మంగళవారం మంగోలియా చేరుకున్నారు.
చైనా చేపట్టిన వివాదాస్పద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రాజెక్టును ఈ సదస్సులో భారత్ వ్యతిరేకించగా మిగిలిన ఏడు సభ్య దేశాలూ ఆమోదించాయి. విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఈ విషయాన్ని చైనా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment