ఓఐసీ సదస్సులో ప్రసంగిస్తున్న భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్
అబుధాబి: ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతూ.. దేశాలను అస్థిర పరుస్తోన్న ఉగ్రవాదంపైనే తమ యుద్ధం తప్ప మతాలకు వ్యతిరేకంగా కాదని భారత్ స్పష్టం చేసింది. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) రెండు రోజుల సదస్సుకు భారత్ తరఫున విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ.. ‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు 130 కోట్ల మంది భారతీయుల అభినందనలు, ప్రత్యేకంగా 18 కోట్ల మంది ముస్లిం సోదరసోదరీమణుల శుభాకాంక్షలను ఇక్కడికి తీసుకొచ్చాను. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేందుకు మా దేశ ముస్లిం సోదరసోదరీమణులే నిదర్శనం.
అయితే భారత్‌లోని కొంతమంది ముస్లింలు మాత్రమే విషపూరితమైన ఉగ్రవాద, తీవ్రవాద భావజాలాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇస్లాం ధర్మం అంటే శాంతి సూచిక. అల్లాకు ఉన్న 99 పేర్లలో ఎందులోనూ హింస లేదు. అలాగే ప్రతి మతంలో శాంతి, కరుణ, సోదరభావం ఉన్నాయి. భారతదేశం శాంతికి దారి చూపే మార్గంగా ఉంది. అన్ని మతాలకు భారత్ ఇల్లు లాంటిది. మా దేశంలో ఎన్నో మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాల్లో భారత్ ఒకటి. అక్కడ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, రుచులు, భాషలను అవలంబిస్తూ తరతరాలుగా జీవిస్తున్నారు. ఎవరి నమ్మకాలను వాళ్లు పాటిస్తూ.. ఇతరులతో సోదరభావంతో మెలగుతున్నారు.’అని సుష్మా స్వరాజ్ అన్నారు.
సమావేశానికి పాక్ డుమ్మా..
అయితే సుష్మా స్వరాజ్ రాకతో ఓఐసీ నిర్వహించిన ఈ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. భారత విదేశాంగ మంత్రిని ఓఐసీ సదస్సుకు ఆహ్వానించవద్దన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోనందుకు గాను తాను ఈ సమావేశానికి హాజరుకానని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి శుక్రవారం ప్రకటించారు. 57 ముస్లిం దేశాలు హాజరయ్యే ఈ సమావేశానికి భారత్ తరఫున హాజరైన తొలి మంత్రి సుష్మా స్వరాజే కావడం గమనార్హం. గతంలో ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌ను 1969లో జరిగిన మొరాకో రాజధాని రబాట్‌లో ఓఐసీ సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. అయితే ఆయన సమావేశం కోసం రబాట్ చేరుకున్న సమయంలో పాకిస్తాన్ ఒత్తిడి మేరకు ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటినుంచి ఓఐసీ సమావేశాలకు భారత్‌ను ఆహ్వానించడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment