బీజింగ్ : పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిచ్చేందుకు భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టే విషయంలో భారత్ విజయం సాధించింది. పుల్వామా ఉగ్రదాడి- సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్- పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకే మెరుపు దాడులు చేశామంటూ.. భారత్- చైనా -రష్యా విదేశాంగ మంత్రుల భేటీలో పాల్గొన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. అదే విధంగా ఉగ్రవాదుల పట్ల పాక్ అనుసరిస్తున్న మెతక వైఖరి గురించి చైనా వేదికగా ఆమె అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పారు.(పాక్ కుటిలనీతిపై సుష్మా ఫైర్)
ఈ క్రమంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడనాడాల్సిందేనంటూ భారత్- రష్యా -చైనా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఏ చర్యనైనా, ఏ దేశాన్నైనా సహించబోమని మూడు దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే పాకిస్తాన్‌పై గుర్రుగా ఉన్న అమెరికా... పాక్ భూభాగంలోని ఉగ్రవాద గ్రూపులపై సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యానికి ఇప్పుడు చైనా, రష్యా కూడా తోడవడంతో అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిని చేయడంలో భారత్ పైచేయి సాధించింది. భారత్ ప్రతినిధిగా హాజరైన సుష్మా స్వరాజ్ తన కార్యాచరణను అమలు చేయడంలో సఫలీకృతమయ్యారంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment