జాతి నిర్మాణంలో పాలుపంచుకోండి
నేపాలీలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు
కఠ్మాండు: సమాజంలో అన్ని వర్గాలు నేపాల్ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య నిర్మాణ ప్రక్రియలో అందరికీ సమాన బాధ్యత ఉందన్నారు. మూడు రోజుల పర్యటన కోసం నేపాల్ వెళ్లిన రాష్ట్రపతి స్థానిక దినపత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేపాల్ శాంతి, సుస్థిరత, అభివృద్ధి సాధించాలని పొరుగు దేశంగా భారత్ ఆకాంక్షిస్తుందన్నారు. శాంతి, సుస్థిర పాలన, ప్రజాస్వామ్యంతో కూడిన సమాజంలోనే స్థిరమైన సాంఘిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని స్వీయానుభవం ద్వారా గ్రహించామని అన్నారు. తనదైన శైలిలో ప్రజాస్వామ్య ప్రక్రియను మొదలుపెట్టిన నేపాల్‌కు ఈ అనుభవాలు ప్రయోజనం కలిగిస్తాయన్నారు. మాదేశి ఆందోళనలతో నేపాల్‌కు అత్యవసర వస్తువుల కొరత ఏర్పడిన నేపథ్యంలో భారత్‌తో ఆ దేశ సంబంధాలు దెబ్బతినడంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ప్రణబ్ స్పందించారు.
ఎలాంటి సంబంధంలోనైనా కొన్నిసార్లు కొన్ని అంశాలపై అభిప్రాయ భేదాలుండటం సర్వసాధారణమని అన్నారు. కానీ అలాంటి అభిప్రాయ భేదాలను తాము అర్థం చేసుకుంటామని, ఇరు దేశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తామని అన్నారు. ఇరు దేశాలు ఉమ్మడి లక్ష్యాలైన అభివృద్ధి, శాంతి, ఆర్థిక శ్రేయస్సుల కోసం కలసి కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సార్క్, బిమ్స్‌టెక్ తదితర ప్రాంతీయ గ్రూపుల గురించి మాట్లాడుతూ ఉగ్రవాదం నేపథ్యంలో సార్క్ సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం ఉండే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. విశాఖపట్నం పోర్టు ద్వారా తమ సరుకుల రవాణాకు అనుమతించాలన్న నేపాల్ అభ్యర్థనకు ఆ సదుపాయం ఇప్పటికే ఉందన్నారు. భారత్ ద్వారా నేపాల్, బంగ్లాదేశ్‌లకు సరుకు రవాణా చేయడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. నేపాల్ విద్యార్థులూ ఇకపై ఐఐటీ ల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేం దుకు అవకాశమిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.
పశుపతినాథ్ ఆలయంలో పూజలు
నేపాల్‌లోని బాగమతి నది ఒడ్డున గల పశుపతినాథ్ ఆలయాన్ని ప్రణబ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఐదో శతాబ్దానికి చెందిన ఈ ఆలయ ట్రస్ట్ అధికారులు ప్రణబ్‌కు సాదర స్వాగతం పలికారు.