ఉమ్మడి పోరుతో ఉగ్ర నిర్మూలన
ఘనా పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్
ఆక్రా: ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, ప్రపంచమంతా కలసి పనిచేస్తే దాన్ని నిర్మూలించవచ్చని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. 30 ఏళ్లుగా భారత్ కూడా ఉగ్రవాద బాధితురాలేనని,, ఉగ్రవాదం ఇప్పడు ప్రపంచానికే ప్రమాదంగా పరిణమించిందని అన్నారు. రెండు రోజుల పర్యటనకు ఘనా చేరుకున్న ప్రణబ్.. ఆ దేశాధ్యక్షుడు జాన్ మహామా ఆదివారం ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ‘విధ్వంసమే ఉగ్రవాద సిద్ధాంతం. ప్రపంచమంతా కలసి పనిచేస్తే దాన్ని నిర్మూలించవచ్చు.
మీతో కలసి పనిచేసేందుకు భారత్ సిద్ధం’ అని అన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం.. ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధి దాటి ముందుకెళ్లాలని అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో భారత తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌తో ఘనా తొలి రాష్ట్రపతి క్వామే క్రుమాల భేటీ ఫొటోను మహామాకు బహూకరించారు. అణు ఇంధన రంగంలో భారత్ అగ్ర భాగాన ఉన్నందున ఆ దేశంతో నుంచి తాము పౌర అణు రంగంలో సహకారాన్ని కోరుకుంటున్నామని మహమా తెలిపారు.