విశ్వాసంతో ముందుకు..
♦ రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన నేపథ్యంలో చైనా ప్రకటన
♦ ఈ నెల 24 నుంచి 27 వరకు రాష్ట్రపతి చైనా పర్యటన
బీజింగ్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌కు ఇదే తొలి చైనా పర్యటన. ఈ సందర్భంగా పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ద్వారా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తామని బుధవారం చైనా ప్రకటించింది. ఆదేశ విదేశాంగ అధికార ప్రతినిధి హాంగ్‌లీ మీడియాతో మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్, చైనాలు అంతర్జాతీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయని, ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం ఇరు దేశాలూ గణనీయంగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఉభయ దేశాలకూ లాభం చేకూర్చేలా భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని లీ పేర్కొన్నారు. పర్యట నలో ప్రణబ్ చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్, ప్రధాని లీ కెకియాంగ్‌లతో పాటు ఇతర చైనా నాయకులతో సమావేశమవుతారు.
ఉగ్ర పోరులో కలసి రండి: ప్రణబ్
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌తో చేతులు కలపాలని ప్రణబ్ చైనాను కోరారు. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో మసూద్ అజార్‌ను చేర్చాలంటూ ఐక్యరాజ్యసమితిలో వచ్చిన ప్రతిపాదనను చైనా తిరస్కరించిన నేపథ్యంలో ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద దేశాలైన భారత్, చైనాలు భిన్న జాతులు, సంస్కృతులకు నిలయాలని, ఉగ్రవాదంపై జరిపే పోరులో ఈ రెండు దేశాలు చేతులు కలిపితే సరైన ఫలితం వస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదన్నారు.