ద్వారకలో శ్రీకృష్ణుడు సభలో కొలువుతీరి ఉండగా, ఒకరోజు ఒక బోయవాడు చేతిలో ఉత్తరంతో వచ్చి శ్రీకృష్ణుడి దర్శనాన్ని కోరగా, సేవకులు అతడిని శ్రీకృష్ణుడి సముఖానకు తెచ్చి, వచ్చిన పనియేదో ప్రభువుల వారితో విన్నవించుకోమనగా, ఆ బోయవాడు ‘కుండినపురంలోని భీష్మక మహారాజు సభలో అమాత్యులవారు వ్రాసి ఇచ్చిన వర్తమానాన్ని యేలినవారి సముఖాన పెట్టడానికి రయాన వచ్చాను ప్రభూ!’ అని వివరం చెప్పాడు.
‘మహారాజశ్రీ అఖండలక్ష్మీ సమేతులైన శ్రీకృష్ణులవారికి మేము వ్రాసి పంపించే విన్నపము. ఇక్కడి సర్వక్షేమ స్థితిని శ్రీవారికి ఈవరకే తెలిపియుంటిమి. ఇప్పుడు విన్నవించుకొనుట యేమనగా– భీష్మక మహారాజులవారు వారి కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించి, స్వయంవరానికై రాజులందరికీ వర్తమానాలు పంపించారు. ఆ సందర్భంగా శ్రీకృష్ణులవారు కూడా వేంచేయాలని కోరుకుంటూ ఎంతో ఆదరంతో మిమ్ములను ఆహ్వానించమని మాకు ఉత్తరువులను ఇచ్చారు.
కనుక స్వామివారు తప్పక విచ్చేయగలరని మా విన్నపము!’ అని ఆ లేఖలోని విషయాన్ని మంత్రివర్యులు చదివి వినిపించగా విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, సభలో కొలువై ఉన్న వారిని ఉద్దేశించి ‘కూతురు పెళ్ళి ఘనంగా చేయాలని ఉత్సాహంతో భీష్మక మహారాజు పంపిన వర్తమానాన్ని విన్నారు కదా! ఆ ఆహ్వానంపై మీ అభిప్రాయాన్ని ఆలోచించి చెబితే బాగుంటుంది. ఆప్తులైన మీరందరూ మేలైనదిగా ఏది అనుకుంటారో, ఆ దారిలో నడుచుకుంటేనే కదా ప్రభువునైన నాకు శుభం చేకూరుతుంది!’ అని అంటాడు. శ్రీకృష్ణుడి మాటలకు సభలోని అందరూ ముగ్ధులై–
"నీరజనాభ కార్యముల నిశ్చయమిట్టిదటంచు దెల్పగా
నేరుచువారలుం గలరె నీయెదుటన్ సకలాంతరాత్మవై
నేరిచినట్టివారలను నేర్వనివారనిపించి దిద్దగా
నేరిచినట్టి దేవుడవు నీకొకరా యెఱిగించు నేర్పరుల్"
‘ఓ పద్మనాభ స్వామీ! జరగవలసిన పనిని గురించి ‘ఇది ఇలా జరిగితే బాగుంటుంది’ అని మీకు చెప్పగలిగినవారు ఉన్నారా? సకలమూ తెలుసునని భావించేవారి చేత కూడా వారికి ఏమీ తెలియదని వొప్పించగలిగే నేర్పు కలిగిన దేవుడవైన మీకు చెప్పగలవారు ఎవరైనా ఈ ముల్లోకాలలోనూ ఉన్నారా?’ అని భక్తితో బదులిచ్చారని కోటేశ్వరకవి రచించిన ‘భోజసుతా పరిణయం’ కావ్యం, ప్రథమాశ్వాసంలోని సన్నివేశంలో రసవత్తరంగా వర్ణించబడింది. ‘సకలాంతరాత్మవు’ అని ఒక్క మాటలో ‘జగత్తులోని ప్రతిదీ ఈశ్వరాంశయే!’ అని చెప్పడం ఇందులో గ్రహించదగినది. – భట్టు వెంకటరావు
Comments
Please login to add a commentAdd a comment