ముందుగానే ‘టిప్’ ఇద్దాం.. | History also shows the impact of the event in our lives | Sakshi
Sakshi News home page

ముందుగానే ‘టిప్’ ఇద్దాం..

Published Sun, Aug 10 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

ముందుగానే ‘టిప్’ ఇద్దాం..

ముందుగానే ‘టిప్’ ఇద్దాం..

ప్రేరణ
 
కొన్నిసార్లు ఎంతో సాధారణమైన సంఘటన కూడా మన జీవితాలపై ఎనలేని ప్రభావం చూపిస్తుంది. అది ఒక విలువైన పాఠంగా మారుతుంది. కొన్నేళ్ల క్రితం అలాంటి సంఘటనే నాకు కూడా ఎదురైంది. నేను, నా స్నేహితుడు కలిసి లంచ్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడి పరిశుభ్రత నచ్చింది. భోజనం చాలా బాగుంది. ఆహ్లాదకరమైన రెస్టారెంట్ వాతావరణంలో నేను, నా ఫ్రెండ్ చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? నేను ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అక్కడే జరిగింది.
 
భోజనానికి ముందే టిప్
 
మేము రెస్టారెంట్‌కు వెళ్లి, టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్న తర్వాత నా మిత్రుడు తన జేబులోంచి పర్సు తీశాడు. వంద రూపాయల నోటును బయటకు లాగి అక్కడి వెయిటర్‌కు ఇచ్చేశాడు. అతడు చిరునవ్వుతో ఆ నోటును స్వీకరించాడు. ఇది నాకు అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్ద నోటు అని కాదు, ఇచ్చిన సమయం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇలాంటిది చూడడం నా జీవితంలో ఇదే మొదటిసారి. సాధారణంగా ఎవరైనా భోజనం ముగించిన తర్వాత వెయిటర్‌కు టిప్ ఇస్తారు. కానీ, వంటకా లు ఆర్డర్ చేయకముందే నా ఫ్రెండ్ టిప్ ఇచ్చాడు. తర్వాత మాకు రాచమర్యాదలు జరిగాయని చెప్పనవసరం లేదు కదా! వెయిటర్ మాతో గౌరవంగా మసలుకొన్నా డు. తన ముఖంపై చిరునవ్వు చెదరనీయకుండా సర్వీస్ చేశాడు. వంటకాలను వేడివే డిగా వడ్డించాడు. నిజంగా ఆ రోజు లంచ్‌ను చాలా ఎంజాయ్ చేశాం. రెస్టారెంట్ నుంచి ఆనందంగా బయటికొచ్చాం.
 
అందరికీ ఒక మంచి పాఠం

 
రెస్టారెంట్ సంఘటన గురించి ఆలోచిస్తే.. అందులో అందరికీ ఒక మంచి పాఠం ఉందనిపిస్తుంది. ఇతరులకు అప్పగించిన పనిని ప్రారంభించడానికి ముందే వారికి తగిన బహుమానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అనుకున్న పని మొదలు పెట్టడానికి ముందు మనకి మనం కూడా బహుమతి ఇచ్చుకోవచ్చు. అది గొప్ప ప్రేర ణగా పనిచేస్తుంది. అంతేకాకుండా పని విజయవంతంగా పూర్తికావడానికి దోహదప డుతుంది. రెస్టారెంట్‌లో టిప్ ముందే ఇవ్వడం ద్వారా నా మిత్రుడు వెయిటర్‌కు.. నువ్వు బాగా పని చేస్తావని, మాకు మంచి సర్వీస్ అందిస్తావని తెలుసు! అంటూ పరోక్షంగా సందేశం ఇచ్చాడు. నేను బాగా పనిచేస్తానని వారు నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజం చేస్తా, మంచి సర్వీస్ ఇస్తా.. అని వెయిటర్ తనకు తాను చెప్పుకొని ఉంటాడు. నా ఫ్రెండ్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది.
 
ముందే రిస్టువాచీ
 
దురదృష్టవశాత్తూ.. చాలామంది షరతులతో కూడిన ప్రేమ, గుర్తింపుతో పెరుగుతుం టారు. ‘క్లాస్‌లో ఈసారి నీకు ఫస్టు ర్యాంకు వస్తే రిస్టు వాచీ ఇస్తా..’ అంటూ తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు ఆశ పెడుతుంటారు. క్లాస్‌లో ఫస్టు ర్యాంకు ఒక్కరికే వస్తుం ది. మరి మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి? తమకు తెలివితేటలు లేవని, చదువురాదని అనుకుంటూ కుంగిపోతుంటారు. పరీక్ష జరగడానికి ముందే రిస్టువాచీ ఇస్తే ఏం జరు గుతుందో ఊహించండి. విద్యార్థి ఆలోచన మారిపోతుంది. తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గుర్తిస్తాడు. దాన్ని నిలబెట్టాలని కష్టపడి చదువుతాడు. ఫస్టు ర్యాంకు రాక పోయినా తన శక్తిమేర ప్రయత్నిస్తాడు. దీంతో అతడిలో అసలైన ప్రతిభ బయటపడు తుంది. ఇది మంచి పరిణామమే కదా!
 
కోర్సు ప్రారంభానికి ముందే
 
యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే)లో ప్రతిష్టాత్మకమైన సంగీత కళాశాల ఉంది. అందులో చేరేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా పోటీ ఉంటుంది. ఆ కాలేజీలో చేరిన తర్వాత కొంద రు విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. అనవసరంగా భయపడుతుంటారు. ఇక్కడ కోర్సు విజయవంతంగా పూర్తిచేయగలనా? లేదా? అని మథనపడుతుంటారు. ఇలాంటివారిని దారిలో పెట్టడం అధ్యాపకులకు సమస్యగా మారింది. దాన్ని పరిష్కరిం చేందుకు ఓ మంచి మార్గం కనిపెట్టారు. అదేమిటంటే... ఏడాదికల్లా ప్రతి ఒక్కరూ ‘ఎ’ గ్రేడ్ సాధించబోతున్నారంటూ కోర్సు ప్రారంభానికి ముందే చెప్పేస్తారు. మరుసటి ఏడాది తేదీతో ఇప్పుడే ఓ లేఖ రాయాలని కోరతారు. కోర్సులో ‘ఎ’ గ్రేడ్ ఎలా సాధించా రు? ఇక్కడ ఏం నేర్చుకున్నారు? ఎంత సాధించారు? సంగీతంలో నిష్ణాతుడిగా ఎలా మారారు? తదితర ప్రశ్నలకు ఆ లేఖలో సమాధానాలు ఉండాలని చెబుతారు. సాధించ బోయే విజయాన్ని ఊహించుకుంటూ విద్యార్థులు లేఖలు రాసి ఇచ్చేవారు. భయాన్ని వదిలేసి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా చదువుకొనేవారు. ఏడాది తిరిగేసరికల్లా అందరూ ‘ఎ’ గ్రేడ్ సర్టిఫికెట్‌తో బయటికొచ్చేసేవారు.
 
మార్పు చూడండి
 
ఇక్కడొక మంచి ఎక్సర్‌సైజ్ ఉంది, ప్రయత్నించండి. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ లేదా ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ పేరుతో మీకు మీరే బహుమతి ఇచ్చుకోండి. ఏడాది తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ లేదా కంపెనీ సీఈఓ మిమ్మల్ని అభినందిస్తున్నట్లుగా లేఖ రాసుకోండి. మీరు సాధించిన విజయాలను వారు ఎలా పొగుడుతున్నారో వారి మాటల్లోనే రాయండి. తర్వాత మార్పు చూడండి. ఆయా విజయా లను మీరు కచ్చితంగా సాధిస్తారు. అది మీ జీవితంలో మర్చిపో లేని సంవత్సరంగా నిలిచిపోతుంది. వెయిటర్లు, మ్యుజీషియన్లు, మీరు, నేను.. మనందరం పని ప్రారంభానికి ముందే బహుమతి ఇచ్చుకుందాం. జీవితాలను మార్చుకుందాం.
 
 - ప్రకాశ్ అయ్యర్, ఎండీ, కింబర్లీ - క్లార్క్ లీవర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement