‘‘జీవితంలో అది అవ్వాలనుకుని ఇదయ్యాం! కాలం కలిసి రాక నేను అనుకున్నది జరగలేదు అందుకే చివరికి ఇలా స్థిరపడ్డాను’’ అని వాపోతుంటారు చాలామంది. అయితే, మనలో నైపుణ్యం, సాధించాలన్న పట్టుదల, అడుగు ముందుకేసే ధైర్యం ఉంటే.. కాస్త ఆలస్యం అయినా అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు సంజుక్తా దత్త.
అసోంలోని నాగౌన్ జిల్లాలో పుట్టిన సంజుక్తా దత్తాకు చిన్నప్పటినుంచి చీరలంటే మక్కువ. అస్సామీ మహిళలు సాంప్రదాయంగా ధరించే మేఖల ఛాడర్ (రెండు రకాల బట్ట, రంగులలో తయారయ్యే చీర) అంటే బాగా ఇష్టం. ఈ చీరలను మరింత అందంగా ఎలా తీర్చిదిద్దవచ్చో ఆలోచించి, వివిధ రకాల డిజైన్లతో చీరలు రూపొందించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొన్ని తనకోసం తయారు చేసేది. అవి అందర్నీ ఆకర్షిస్తుండడంతో.. ఫ్యాషన్ డిజైనింగ్ మీద మరింత ఆసక్తి పెరిగింది. కానీ ఇంట్లో వాళ్ల ఇష్టం మేరకు ఇంజినీరింగ్ చదివింది. ఇంజినీరింగ్ అయిన వెంటనే ఉద్యోగం రావడంతో ‘అసోం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్’లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరింది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ తన మనసు మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్‌పైనే ఉంది.
పదేళ్ల ఉద్యోగం వదిలేసి...
ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా తనకిష్టమైన ఫ్యాబ్రిక్ డిజైన్ ను చేస్తుండేది. తన డిజైన్లు నచ్చిన వారంతా ‘చాలా బావున్నాయి’ అని పదేపదే పొగుడుతుండడంతో... ఫ్యాషన్ డిజైనింగ్‌కు పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకుంది. పదేళ్లుగా చేస్తోన్న ఇంజినీర్ ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేసి, గువహటీలో మేఖల ఛాడర్‌ల చేనేత యూనిట్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్‌లో స్వయంగా డిజైన్ చేసిన వస్త్రాలను ఏడాదిన్నరలోనే మూడు వేల వరకు విక్రయించింది సంజుక్తా. ఒక్క యూనిట్‌తో ప్రారంభమైన సంజుక్తా చేనేత యూనిట్ రెండేళ్లలోనే వందల యూనిట్లుగా విస్తరించింది. దాంతో కమర్షియల్ బోటిక్‌ను కూడా ప్రారంభించింది. ఈ బోటిక్‌ను కొనుగోలుదారులు కూడా సందర్శించే వీలు కల్పించడంతో మంచి స్పందన వచ్చింది. ఈ ప్రోత్సాహంతో అస్సామీ సాంప్రదాయ జ్యూవెల్లరి దగ్ దుగి, కెరు మోనీ, జున్ బైరీలను సరికొత్తగా తీర్చిదిద్ది విక్రయించింది. ఒకపక్క అస్సామీ పట్టు, మరోపక్క సాంప్రదాయ జ్యూవెల్లరీలను తనదైన డిజైన్లతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందేలా చేసింది.
అస్సామీ పట్టు
ఎంతో నైపుణ్యం కలిగిన ఛాడర్ కళాకారులతోనే మేఖల ఛాడర్‌ను తయారు చేయించడం సంజుక్తా డిజైన్ల ప్రత్యేకత. స్థానికంగా దొరికే పట్టు దారాలు, ఛాడర్‌లను అనుభవజ్ఞులైన చేనేత కళాకారులతో రూపొందిస్తోంది. ప్రస్తుతం సంజుక్తా స్టూడియో, యూనిట్లలో వందలసంఖ్యలో కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది. ఒక్క గువహటీలోనేగాక ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ధరించే ఈ ఛాడర్‌లకు మంచి డిమాండ్ ఉండడంతో సంజుక్తా డిజైన్లు త్వరగానే పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియా ప్రచారం ద్వారా కూడా మరిన్ని ఆర్డర్లు తీసుకుంటూ తన డిజైన్ లను దేశం నలుమూలలకు విస్తరించి, ప్రస్తుతం కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది.
ఆల్ఫూల్..
కరిష్మాకపూర్, బిపాషా బసు, హేమమాలిని, జహీర్‌ఖాన్ వంటి సెలబ్రిటీలు కూడా సంజుక్తా డిజైన్ చేసిన డ్రెస్‌లను పలు ఈవెంట్‌లలో ధరించారు. బ్రిటిష్ రాజవంశానికి చెందిన కేట్ మిడిల్టన్ 2015లో ‘కాజీరంగా జాతీయ పార్క్’ సందర్శించినప్పుడు సంజుక్త రూపొందించిన డ్రెస్‌ను ధరించారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతోన్న న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ – 2022లో ‘ఆల్ఫూల్’ పేరిట తన కొత్త డిజైను ప్రదర్శించింది. అసోం పట్టుతో నేసిన చీరలు, గౌన్లు, డ్రేప్ స్కర్ట్స్ ఇండో వెస్ట్రన్ లెహంగాలను రూపొందించి, 25 రోజులపాటు సమయం కేటాయించి తుదిమెరుగులు దిద్దారు. దీంతో ధగధగ మెరుస్తోన్న పట్టు డ్రెస్‌లు చూపరులనే గాక అంతర్జాతీయ డిజైనర్లనూ ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment