అబ్దుల్ కలాం ఆదర్శప్రాయుడు
గుంటూరు (అరండల్‌పేట): యువత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని సినీహీరో సుమన్ పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో కలాం 85వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం వంటి వ్యక్తి మన దేశంలో జన్మించడం దేశ ప్రజల అదృష్టమన్నారు. విద్యార్థులు, యువత ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని అబ్దుల్‌కలాం జీవితాన్ని చూస్తే తెలుస్తుందన్నారు. చివరి వరకు దేశసేవ కోసం ఆయన పరితపించారని పేర్కొన్నారు. కలలు కనండి. సాకారం చేసుకోండి అంటూ యువతకు ఆయన చ్చిన సందేశాన్ని అందరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి యామ మురళీ, పోతురాజు శ్రీనివాస్, టి.శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.