స్ఫూర్తి నింపిన క్రీడలు
Published Tue, Nov 15 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
భానుగుడి (కాకినాడ) :
వారు చీకటిలో వెలుగును వెతుకుతూ పరుగెత్తారు.లక్ష్యాన్ని ఊహించుకుని బరువులు విసిరారు. విధి వంచించినా ప్రతి క్రీడలోనూ తమదైన ప్రతిభ చాటారు. మొత్తానికి అందరిలో స్ఫూర్తి నింపారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కాకినాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో మంగళవారం నిర్వహించిన పలు పోటీల్లో వారు చూపిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. చూపరుల హృదయాలను కదిలించింది.ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ ఈ పోటీలు నిర్వహించింది. విద్యార్థులకు రన్నింగ్, లాంగ్ జంప్, చందరంగం, క్యారమ్స్, షాట్‌ఫుట్, సైకిల్ రేస్ వంటి పలుక్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 850 మంది విద్యార్థులు హాజరయ్యారు. క్రీడా పోటీలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. విజేతలకు డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో బహుమతీ ప్రధానం చేస్తామని వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కేవీవీ సత్యనారాయణ తెలిపారు.
Advertisement
Advertisement