మాటలతో బాట వేసుకుంది!
స్ఫూర్తి
మనసులో ఉన్నది చెప్పేందుకు మాట్లాడటం వేరు... మనసులను తాకేట్టుగా మాట్లాడటం వేరు. ఆ కళ, అలా మాట్లాడే తెగువ అందరికీ ఉండవు. కానీ రచనకు ఉన్నాయి. అందుకే ఆమె మాటలతోనే బాట వేసుకుంది. తన మాటలనే అస్త్రాలుగా మార్చి సమస్యలపై ఎక్కుపెడుతోంది. ఎందరి ఆలోచనలకో పదునుపెడుతోంది.
మన దేశం ముందుకెళ్తోందని చాలామంది అంటూంటారు కానీ... వెనకబడిన ప్రాంతాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లాంటి అతి పెద్ద రాష్ట్రంలో ఉన్న పలు చిన్ని చిన్ని గ్రామాల్లో అభివృద్ధి అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. వసతులు ఉండవు. ఆధునికత అన్నమాటకు నిర్వచనం కూడా తెలియదు వారికి. అలాంటిచోట పుట్టిన అమ్మాయి రచన.
ఆడపిల్లలు గడపదాటి బయటకు వెళ్లకూడదు, అందరూ వినేలా మాట్లాడకూడదు లాంటి కట్టుబాట్ల మధ్య నలిగిపోయిందామె. ఆడపిల్ల అంటే ఇక ఇంతేనా, నోరు విప్పి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అనుకునేది. ఆడపిల్ల అంటే ఏంటో మాటలతోనే అందరికీ చెప్పాలని తహతహలాడేది. ఆ తపనే ఆమెను రేడియో జాకీని చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో ఎనభైకి పైగా గ్రామాలున్నాయి. అక్కడి పరిస్థితులను మార్చేందుకు జిల్లా మెజిస్ట్రేట్ రణవీర్ ప్రసాద్ ఓ సరికొత్త ప్రణాళిక వేశారు. పలు సమస్యల మీద అవగాహన కల్పించేందుకు ‘లలిత్ లోక్‌వాణి’ పేరుతో ఓ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ని స్థాపించారు. అందులో పనిచేయడానికి రావాలని, మహిళల సమస్యలపై గళం విప్పాలని ఆహ్వానించారు. కానీ ఏ ఒక్కరూ వెళ్లేందుకు ధైర్యం చేయలేదు... రచన తప్ప. ఇంట్లోవాళ్లు కాదన్నా, కట్టడి చేయాలని ప్రయత్నించినా ఆగలేదామె. ఇంటి గడప దాటి రేడియో స్టేషన్ గడపలో అడుగుపెట్టింది.
మాట్లాడవద్దన్నవాళ్లందరినీ తన మాటలతో ముగ్ధుల్ని చేయడం మొదలుపెట్టింది. ఆమెను చూసి పలువురు అమ్మాయిలు స్ఫూర్తి పొందారు. తామూ జాకీలుగా పనిచేస్తామంటూ వెళ్లారు. ఇప్పుడు ఆ రేడియో స్టేషన్‌లో చాలామంది మహిళా జాకీలు ఉన్నారు. తమ జిల్లాలోని పలు సమస్యల గురించి వివరిస్తూ అందరినీ చైతన్యవంతుల్ని చేస్తున్నారు.