ఇన్‌స్పిరేషన్‌ #తనూటూ..! | Tanushree Datta is a short film Inspiration | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పిరేషన్‌ #తనూటూ..!

Published Thu, Mar 21 2019 11:43 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Tanushree Datta is a short film Inspiration - Sakshi

‘మీటూ’తో పెద్దపెద్ద హీరోల నిజస్వరూపాలనుబయటపెట్టేందుకు ప్రేరణగా నిలిచిన తనుశ్రీ..అకస్మాత్తుగా కామ్‌ అయిపోయారెందుకు?ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచి, ‘ఇన్‌స్పిరేషన్‌’ అనే లఘుచిత్రాన్ని కూడా తీసిన తనుశ్రీ దత్తా ఆఖరి నిముషంలో చిత్రంలోని కథను ఎందుకు మార్చేశారు? ‘మీటూ’ పోరాటాన్ని మధ్యలోనే వదిలివెళ్లేలా ఆమెపై ఒత్తిడి తెచ్చినశక్తులే, ఆమె ‘ఇన్‌స్పిరేషన్‌’నూ దెబ్బతీశాయా?!

తనుశ్రీ దత్తా తీసిన షార్ట్‌ ఫిల్మ్‌.. ‘ఇన్‌స్పిరేషన్‌’ ఈ నెల 8న మహిళా దినోత్సవానికి విడుదల కావలసి ఉంది. కానీ కాలేదు! మార్చి 19 తనుశ్రీ బర్త్‌ డే. ఆ రోజు కూడా ‘ఇన్‌స్పిరేషన్‌’ విడుదల అవలేదు! విడుదలై ఉంటే ఈసరికి బాలీవుడ్‌లోని పురుష పుంగవులు గగ్గోలు పెడుతూ ఉండేవారు. ‘ఇన్‌స్పిరేషన్‌’.. బాలీవుడ్‌ ‘మీటూ’ చీకటి కథల లఘుచిత్రం. అతుల్‌ భల్లా డైరెక్ట్‌ చేశారు. డైలాగ్స్‌ తనుశ్రీవే. భల్లా మునుపెన్నడూ సినిమాల్ని డైరెక్ట్‌ చెయ్యలేదు. కానీ స్త్రీపక్షపాతి. జర్నలిస్టు. గత ఏడాది ‘వధాయాన్‌ జీ వధాయాన్‌’ (శుభాకాంక్షలండీ శుభాకాంక్షలు) అనే పంజాబీ సినిమాకు మాత్రం డబ్బులు పెట్టాడు. రొమాంటిక్‌ కామెడీ అది. కామెడీకి డబ్బులు పెట్టిన మనిషిని, ‘సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌’ థీమ్‌కి మనసు పెట్టమని అడిగారు తనుశ్రీ. ఓకే అన్నాడు ఆయన. తీశాడు కూడా. కానీ రిలీజ్‌ కాలేదు!!

మాఫియా ఎంటర్‌ అయిందా?!

‘ఇన్‌స్పిరేషన్‌’ని రిలీజ్‌ చెయ్యొద్దని ఎవరైనా తనుశ్రీని బెదరించారా? బాలీవుడ్‌ మాఫియా రంగంలోకి దిగిందా? లేకా తనుశ్రీనే ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారా? తలనొప్పి ఎలా ఉంటుందో తనుశ్రీకి బాగా తెలుసు. ఆరు నెలలు ఇండియాలో ఉండి, ఇటీవలే ఆమె తిరిగి యు.ఎస్‌.వెళ్లిపోయారు. ఉండడం అక్కడి న్యూజెర్సీలో. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇండియా వచ్చిపోతున్నారు. ఈ ట్రిప్పులో మాత్రం ఊరికే వెళ్లలేదు తనుశ్రీ. ‘మీటూ’కు ఆజ్యం పోసి వెళ్లారు. ఆజ్యం అనే మాట కరెక్ట్‌ కాదు. ‘మీటూ’ను రాజేసి వెళ్లారు.అమెరికా నుంచి రెండేళ్ల తర్వాత గత ఏడాది జూలైలో ఇండియా చేరుకున్న మాజీ అందాలరాణి, బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి కొన్ని నిముషాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలో రూపురేఖలు మారిపోయి పూర్తిగా కొత్త మనిషిలా కనిపించడం పెద్ద విశేషం అయింది! తొలి చిత్రం ‘ఆషిక్‌ బనాయా అప్‌నే’లో ఎమ్రాన్‌ హష్మీతో నటించి, బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తనుశ్రీని విమానాశ్రయంలో కొద్దిమంది ఫొటోగ్రాఫర్‌లు మాత్రం గుర్తుపట్టారు. అంతేతప్ప ఆమె కారణంగా ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి ఊపిరి అందుతుందని ఎవరూ ఊహించలేదు.

ఆమె వచ్చేటప్పటికే మన దేశంలో మీటూ గురించి అక్కడో మాట ఇక్కడో మాట వినిపిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం.. ఈ మూడు చిత్రపరిశ్రమల నుంచి కొంతమంది నటీమణులు బయటికి వచ్చి.. ‘ఒకవేళ లైంగిక వేధింపులు ఉంటే వాటిని ఖండించవలసిందే’ అన్నంత వరకు మాట్లాడగలిగారు. బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, సుస్మితాసేన్, రీమా ఛద్ధా, రాధికా ఆప్టే కూడా.. ‘మీటూ’ అన్నది సపోర్ట్‌ చేయవలసిన మూవ్‌మెంట్‌ అన్నంత వరకే స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఊరుకున్నారు. ఒక బాధితురాలిగా తొలిసారి బయటికి వచ్చి మీటూ ఫిర్యాదు చేసింది మాత్రం తనుశ్రీ దత్తానే. ఆమె ఇచ్చిన ధైర్యంతో బాలీవుడ్‌లోని అజ్ఞాత బాధిత మహిళలు, దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల్లోని మహిళా నటులు తామెలా లైంగిక వేధింపులకు గురైందీ రివీల్‌ చేశారు. సాజిద్‌ఖాన్, రాజ్‌కుమార్‌ హిరాణి, అనూ మాలిక్, కైలాష్‌ ఖేర్, సుభాష్‌ కపూర్, సుభాష్‌ ఘాయ్, అలోక్‌ నాథ్‌.. ఇలా ఆరోపణలు వచ్చినవాళ్లంతా పరువు కోసం పరుగులు మొదలు పెట్టారు. ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. వారిలో నానా పటేకర్‌ ముఖ్యుడు. 

మనసుకు సర్దిచెప్పుకోలేకే..!
నానా పటేకర్‌ జెంటిల్మన్‌. రైతు జన బాంధవుడు. ముంబై చుట్టుపక్కల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి వాళ్లకు ఒక్కొక్కరికీ లక్ష చొప్పున నగదు చెక్కులను ఇస్తూ కాస్త మంచి పేరును కూడపెట్టుకున్నాడు. తనుశ్రీ వచ్చి ఆ పేరును కూలగొట్టేశారు. పేరును కూలగొట్టడం ఆమె ఉద్దేశం కాదు. ఆత్మాభిమానం దెబ్బతిన్న కారణంగా పదేళ్లుగా ఆమె రగిలిపోతున్నారు. 2008లో ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ చిత్రంలో ఒక సాంగ్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్నప్పుడు నానా పటేకర్‌ ఆమెను వేధించాడు. అప్పటికి ఆయన స్టార్‌ యాక్టర్‌. అప్పటికి ఆమె మిస్‌ ఇండియా. కొత్తగా సినిమాల్లోకి వచ్చింది. వచ్చీ రాగానే చేదు అనుభవం.  ఆ దెబ్బతో ఆమె సినిమాలు వద్దనుకుని వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం ఏకంగా హిమాలయాలకు వెళ్లి కూర్చున్నారు. అప్పటికి ఆమె వయసు ఇరవై ఐదేళ్లు. నానా పటేకర్‌ వయసు అప్పటికి 58 ఏళ్లు. అప్పుడు ఏమీ చేయలేక వెళ్లిపోయిన తనుశ్రీ, తిరిగొచ్చాక అతడి ముసుగు తొలగించారు.

అయితే ఇదంతా కూడా తనుశ్రీ కల్పించినదే తప్ప నిజం కాదని ఆరోపిస్తూ ఆమెపై కేసు వేశారు నానా పటేకర్‌. కానీ ఆయన కరెక్ట్‌ మనిషా కదా అనే దానిపై పెద్దగా చర్చ జరగలేదు. తనుశ్రీని మాత్రం ఇండస్త్రీలోని అమ్మాయిలు, సీనియర్‌ మహిళా ఆర్టిస్టులు నమ్మారు. ఎక్కడో యు.ఎస్‌.లో ఉన్న మనిషి, ఇండియా వచ్చి, లేనిపోని తలనొప్పిని ఎందుకు తెచ్చుకుంటుంది అనే అనుకున్నారు. ఆ మాట నిజమే. తనుశ్రీకి మంచి లైఫ్‌ ఉంది. కానీ ఆ లైఫ్‌ని పశ్చాత్తాపం లేకుండా లీడ్‌ చెయ్యడానికి పాతవి తుడిచేసుకోవాలి కదా. ఇప్పుడు సమయం వచ్చింది. యు.ఎస్‌.లో మొదలైన మీటూ ఆమెలోని ఆనాటి నిస్సహాయతకు శక్తినిచ్చి, నిద్రాణంగా ఉన్న నిస్సత్తువను పోగొట్టింది. ‘వెళ్లి ఫైట్‌ చెయ్యి’ అని ప్రేరేపించింది. 

కథ ఎందుకు మారింది?!
ఎందరికో ఇన్‌స్పిరేషన్‌ ఇచ్చి.. బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో, మాలీవుడ్‌లో.. ఎందరో బాధితుల్ని బయటికి రప్పించి, మర్యాదస్తుల అసలు రంగును బట్టబయలు చేసిన తనుశ్రీ తిరిగి తన ప్రశాంత జీవనంలోకి.. న్యూజెర్సీకి వెళ్లిపోయారు. అయితే అది నిజమైన ప్రశాంతతేనా?! కాదు అన్నదే సమాధానం. అందుకే ఆమె అర్థంతరంగా ముగించిన వెళ్లిన పోరాటాన్ని షార్ట్‌ ఫిల్మ్‌తో కొనసాగించాలనుకున్నారు. గత పదేళ్లలో ఎవరెవరు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైందీ సమాచారం సేకరించారు. స్క్రిప్టు రాసుకున్నారు. డైరెక్టర్‌నీ పెట్టుకున్నారు. ఫిల్మ్‌ కంప్లీట్‌ అయింది. కానీ రిలీజ్‌ కాలేదు. ఉద్యమంలోంచి వెనక్కు తగ్గినట్లే ఫిల్మ్‌ లోంచీ వెనక్కు తగ్గారా తనుశ్రీ.

బాలీవుడ్‌ మాఫియా ఆమెను ఏమైనా హెచ్చరించిందా? అందుకే ఫిల్మ్‌ని చెత్తబుట్టలో వేసేశారా? అలాంటిదేమీ లేదంటున్నారు తనుశ్రీ. మొన్న బర్త్‌డే రోజు కూడా ఫిల్మ్‌ త్వరలో రిలీజ్‌ కాబోతోందని చెప్పారు. అయితే కథ మాత్రం అది కాదు అన్నారు!! అందులో బాలీవుడ్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఎపిసోడ్స్‌ ఏమీ లేవని చెప్పారు. మరి ఏం ఉంటుంది? ఇన్‌స్పిరేషనల్‌ టాక్‌ ఉంటుందట తనది. అది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇంకే ఉండబోతోంది! అదీ చెప్పారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలను ఉద్దేశించి ‘డూస్‌ అండ్‌ డోంట్స్‌’ ఉంటాయట.

హార్వర్డ్‌ కి వెళ్లొచ్చాక
‘బోస్టన్‌లోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో అతిథి వక్తగా ప్రసంగించడానికి నాకు అవకాశం వచ్చింది. నేను చాలా ఎక్సయిటెడ్‌గా ఉన్నాను’’ అని ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో తనుశ్రీ దత్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. పోస్ట్‌కి తగిలించిన తన ఫొటోలో కూడా ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించారు. కళ్లద్దాలు పెట్టుకుని చిరునవ్వుతో అచ్చు హార్వర్డ్‌ స్కూల్‌ విద్యార్థినిలాగే ఉన్నారు. హార్వర్డ్‌ స్కూల్‌లో స్పీచ్‌ ఇవ్వడం అంటే మామూలు సంగతేం కాదు. ప్రపంచ ఆలోచనా ధోరణిని ప్రభావితం చేయగల భిన్న రంగాలలోని సుప్రసిద్ధులకు మాత్రమే ఆ ఆహ్వానం దక్కుతుంది. స్పీచ్‌ ఫిబ్రవరి 16న. వెళ్లొచ్చారు. చక్కగా మాట్లాడారు. తక్కిన వక్తల నుంచి, తన ప్రసంగానికి హాజరైన విద్యార్థుల నుంచి ఆమెకు  ప్రశంసలు లభించాయి.

మీడియా, మూవీస్, హ్యూమన్‌ ట్రెండ్స్‌.. ఇలా చాలావాటి గురించి తనుశ్రీ మాట్లాడారు. సమాజంలోని ‘మిసాజిని’ (స్త్రీద్వేషం) పైన ఆమె అభిప్రాయాలకు మాత్రం మంచి అటెన్షన్‌ లభించింది. ప్యానల్‌ డిస్కషన్‌లో కూడా తనుశ్రీ కూర్చున్నారు. ఒకరిద్దరు.. ఇండియాలో మీటూ పయనీర్‌గా ఆమెను గుర్తించారు. తనుశ్రీ నవ్వారు. ‘‘ధైర్యంగా బయటికి వచ్చిన ప్రతి స్త్రీ కూడా పయనీరే’’ అన్నారు. చొరవ, నాయకత్వ గుణం మాత్రమే స్త్రీలను వారు ఎదుర్కొనే ఇబ్బందులనుంచి బయటపడేస్తాయని చెప్పారు. స్త్రీ నుంచి పురుషుడికి లభించే సపోర్ట్‌ కన్నా, స్త్రీ నుంచి స్త్రీకి లభించే సపోర్టే ఎక్కువగా ఉంటుందనీ, అది మాత్రమే నమ్మకమైనది’’ అని తనుశ్రీ అన్నారు. 

హార్వర్డ్‌ స్పీచ్‌ ఇచ్చి వచ్చాక తనను కలిసిన ఫిల్మ్‌ క్రిటిక్, జర్నలిస్ట్‌ సుభాష్‌ కె. ఝాతో మాట్లాడినప్పుడు ఆమెలో అతడికి మునుపటి తనుశ్రీ కన్నా భిన్నమైన వ్యక్తి సాక్షాత్కరించారు. ముఖ్యంగా ఆమె తీస్తున్న ‘ఇన్‌స్పిరేషన్‌’ ఫిల్మ్‌ గురించే ఆయన తరచి తరచి అడిగారు. 20 నిముషాల నిడివి ఉండే ఆ చిత్రం ఇన్‌సైట్‌తో (లోతైన దృష్టి), క్రిస్ప్‌గా (సంక్షిప్తంగా) డైరెక్టుగా (నీళ్లు నమలకుండా) ఉంటుందని ఆమె చెప్పారు. అంటే.. చిత్రం ఎలా ఉంటుందన్నది మాత్రమే తనుశ్రీ చెప్పారు. ఏం ఉండబోతోందన్న చెప్పలేదు. ఇప్పుడు అదీ క్లియర్‌ చేసేశారు. అదొక ఆసక్తికరమైన హార్వర్డ్‌ స్పీచ్‌లా మాత్రమే ఉండబోతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement