సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని..
‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు.
‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’
‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు.
'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.'
‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’
‘‘చూశాను భగవాన్’’
‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’
బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు..
‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ..
‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’
‘‘ఖాళీగా ఉంది భగవాన్’’
‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు.
అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment