ఎవరూ నడవని బాటలో...
స్ఫూర్తి
ఎంత చదువుకున్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా... ఆడపిల్లలు అనగానే కొన్ని రకాల ఉద్యోగాలు చేస్తేనే బాగుంటుందని తేల్చేస్తారంతా. నాగరికత బాగా అభివృద్ధి చెందింది అని చెప్పుకునే పాశ్చాత్య దేశాల్లో కూడా ఇలాంటి మాటలు వినిపిస్తాయి. సారాకి ఆ మాటలు అస్సలు నచ్చవు. అందుకే ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే వెంటనే ప్రశ్నించేది. ఇవే ఎందుకు చేయాలి? ఇవి ఎందుకు చేయకూడదు? అని నిలదీసేది. ఏదో తెలియక అడుగుతోంది అనుకునేవారు కానీ... నిజంగానే ఎవరూ సాగని బాటలో సాగుతుందని, ఆడపిల్లలు వెళ్లని రంగంలోకి అడుగుపెడుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు.
అమెరికాకు చెందిన సారా చిన్నతనం నుంచే వైవిధ్యంగా ఆలోచించేది. ఆడవాళ్లు మగవాళ్లకు ఏమాత్రం తీసిపోరని ఆమె ఉద్దేశం. అందుకు తగ్గట్టే సాహసాలు చేసేది. మహిళలు నడపడానికే భయపడే పెద్ద పెద్ద వాహనాలను నడపాలని సరదా పడేది. వాటిని నడుపుతున్నప్పుడు బండిలో ఏదైనా లోపం తలెత్తితే దాని గురించి స్టడీ చేసేది. ఆ శ్రద్ధ కాస్తా ఆమెను మెకానిజం వైపు లాక్కెళ్లింది. ఎలాగైనా సరే వాహనాలను బాగు చేయడం నేర్చుకోవాలని నిర్ణయించుంది.
సారా నిర్ణయం గురించి విన్న కుటుంబ సభ్యులు... ‘ఆడపిల్లవై ఉండి మెకానిక్‌గా పని చేస్తావా?’ అన్నారు. స్నేహితులు పరిహాసమాడారు. కానీ సారాకి మాత్రం అది జోక్ చేయాల్సిన విషయంలా అనిపించలేదు. అందుకే ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి కార్ల మెకానిజం నేర్చుకుంది. మెకానిక్ షెడ్ కూడా పెట్టింది.
ఆమెను చూసి మొదట నవ్వినవాళ్లు... ఆమె బళ్లను బాగుచేసే తీరు చూసి మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఆమెను చూసి ఫ్రెండ్‌స కూడా ఆ పని చేయాలని సరదాపడ్డారు. వాళ్లకు కూడా ఆ పని నేర్పింది సారా. వారితో కలిసి ‘180 డిగ్రీ ఆటోమోటివ్’ అనే సంస్థను స్థాపించింది. కాలం గిర్రున తిరిగింది. సారా పేరు అమెరికా అంతటా పాకిపోయింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ లేడీ అంటూ దేశమంతా ఆమెను పొగిడింది!