న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. వచ్చే ఏడాది(2025)లో అధికారికంగా ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన కేబినేట్ శాఖల కేటాయింపులపై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురిని తన పాలకవర్గంలోకి తీసుకున్న ట్రంప్.. తాజాగా నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) డైరెక్టర్‌గా మాజీ డెమోక్రాట్ తులసీ గబ్బార్డ్‌ను బుధవారం నియమించారు. తులసి గబ్బార్డ్‌ను గర్వించదగిన రిపబ్లికన్‌గా ట్రంప్ అభివర్ణించారు. నిర్భయమైన స్ఫూర్తిని తులసి.. అమెరికా ఇంటెలిజెన్స్ రంగంలోకి తీసుకురాగలరని పేర్కొన్నారు.
‘‘డెమొక్రాట్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం మాజీ అభ్యర్థిగా, ఆమెకు రెండు పార్టీలలో విస్తృత మద్దతు ఉంది. ఆమె ఇప్పుడు గర్వించదగిన రిపబ్లికన్! తులసి ఇంటెలిజెన్స్ విభాగంలో రాజ్యాంగ హక్కులను సమర్థిస్తూ శాంతిని కాపాడే నిర్భయమైన స్ఫూర్తిని తీసుకువస్తారని నాకు తెలుసు. తులసి మనందరినీ గర్వించేలా చేస్తారు’’ అని ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఎవరీ తులసి గబ్బర్డ్?
సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్‌ను గబ్బార్డ్ వివాహం చేసుకున్నారు. తులసికి గూఢచార విభాగంలో అనుభవం లేనప్పటికీ అమెరికా మిలిటరీలో రెండు దశాబ్దాలకుపైగా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె డెమోక్రటిక్ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. 2013 నుంచి 2021 వరకు హవాయి రెండో జిల్లాకు కాంగ్రెస్ మహిళగా పనిచేశారు. ఆమె హౌస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో రెండేళ్లపాటు పనిచేశారు. ఆమె పేరు కారణంగా తరచుగా భారతీయురాలిగా గుర్తింపు పొందుతున్నారు. కానీ, తులసి గబ్బార్డ్‌కు భారతదేశంతో ఎటువంటి సంబంధాలు లేవు. గబ్బార్డ్ తల్లి హిందూ మతంలోకి మారి.. తన పిల్లలందరికీ హిందూ పేర్లను పెట్టారు. తులసి గబ్బార్డ్ హిందువుగా కూడా గుర్తింపు పొందారు. తొలి హిందూ అమెరికా కాంగ్రెస్ మహిళ. ఆమె అమెరికన్ సమోవా సంతతికి చెందినది కాగా.. కాంగ్రెస్ మహిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు.
2020లో తులసి గబ్బార్డ్.. కమలా హారిస్‌కు వ్యతిరేకంగా డెమోక్రటిక్ ప్రైమరీ ఎంపికకు నామినేషన్ వేశారు.అనంతరం ఆమె రేసు నుంచి తప్పుకున్నారు. 2022లో డెమోక్రటిక్ పార్టీని వీడారు. అప్పటి నుంచి ట్రంప్ మద్దతుతో సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా ట్రంప్‌తో తులసి స్నేహంగా ఉంటున్నారు. ఇక.. ఆమె 2022లో రిపబ్లికన్ పార్టీలో చేరారు. డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి చేపట్టాలని గబ్బార్డ్ ఆమోదం తెలిపారు. మరోవైపు.. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో కమలా హారిస్‌పై డిబేట్లకు ట్రంప్‌ను సిద్ధం చేయటంలో తులసి కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment