బాధ్యత తీసుకోండి | Take responsibility | Sakshi
Sakshi News home page

బాధ్యత తీసుకోండి

Published Mon, Aug 4 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

బాధ్యత తీసుకోండి

బాధ్యత తీసుకోండి

ప్రేరణ
 
ఎవరి జీవితం ఎలా ఉంటుందనేది వారి పనులను బట్టే ఉంటుంది. ఎవరి భవితవ్యానికి వారే బాధ్యత వహించాలి. మరెవరో బాధ్యత తీసుకోవడం కష్టమైన పని. నా జీవితం ఇలా కావడానికి ఫలానా వ్యక్తులు, పరిస్థితులే కారణమంటూ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తే నష్టపోయేది ముమ్మాటికీ మీరే. ఇతరులపై నిందలేయడం సరి కాదు. ముళ్ల పొదల్లా గజిబిజిగా ఉన్న జీవితాన్ని సుందర నందనవనంగా మార్చుకోవాలి. ఒకేరకమైన పరిస్థితుల మధ్య పెరిగిన ఇద్దరు కుర్రాళ్లు వాటిని తమ జీవితానికి ఏ విధంగా అన్వయించుకున్నారో తెలుసుకుందాం..
 
పేద కుటుంబం, నాన్న తాగుబోతు
 
ఓ నగరంలో ఓ యువకుడు చిన్న నేరం చేసి పోలీసులకు దొరికాడు. ఉద్యోగం దొరక్కపోవడంతో చిన్నచిన్న నేరాలు చేస్తూ బతుకుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఇలా ఎందుకు మారావని పోలీసులు ప్రశ్నించగా.. ‘‘మాది చాలా పేద కుటుంబం. రెండు పూటలా కడుపు నింపుకోవడానికి కూడా డబ్బు లేదు. మా నాన్న తాగుబోతు. నన్ను, మా తమ్ముడిని చావ బాదేవాడు. చదువుకుందామంటే డబ్బుల్లేవు. మాది చిన్న ఇల్లు. అందులో చదువుకోవడానికి అనువైన వాతావరణం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య పెరిగిన నేను దొంగను కాక ఇంకేమవుతాను? నేను ఇలా మారిపోవడానికి కచ్చితంగా మా నాన్న, నేను పుట్టి పెరిగిన పరిస్థితులే కారణం’’ అంటూ.. చెప్పాడు. ఈ యువకుడి వాదన ఇలా కొనసాగుతుండగా ఇక్కడికి సమీపంలోనే ఓ సన్మాన కార్యక్రమం జరుగుతోంది.
 
విధిని, తలరాతను నేనే నిర్దేశించుకున్నా..
 
మురికివాడలో పుట్టి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన యువకుడిని అక్కడ సన్మానిస్తున్నారు. అతడికి పూల దండలేసి, శాలువాలు కప్పి గొప్పవాడంటూ పొగిడారు. ఇదంతా ఎలా సాధించావో చెప్పాలని కోరగా ఆ యువకుడు ఇలా ప్రసంగించాడు.. ‘‘మాది చాలా పేద కుటుంబం. రెండు పూటలా కడుపు నింపుకోవడానికి కూడా డబ్బు లేదు. మా నాన్న తాగుబోతు. మద్యం మత్తులో నన్ను, మా అన్నను చావ బాదేవాడు. చదువుకుందామంటే డబ్బుల్లేవు. మాది చిన్న ఇల్లు. అందులో చదువుకోవడానికి అనువైన వాతావరణం లేదు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి, మంచి జీవితం గడపాలంటే బాగా కష్టపడాలని అర్థం చేసుకున్నాను. నా జీవితానికి నేనే బాధ్యత తీసుకున్నాను. నా విధిని, తలరాతను నేనే నిర్దేశించుకున్నాను. రాత్రింబవళ్లూ శ్రమించి అనుకున్నది సాధించాను’’ అని చెప్పాడు.
 
మనం ఎలా స్పందిస్తున్నాం?
 
ఇప్పుడు మీరు ఊహించింది నిజమే. వారిద్దరూ సొంత అన్నదమ్ములే. కారణం చిన్నదే.. అన్న తన జీవితానికి ఇతరులను బాధ్యులను చేసి, చిల్లర దొంగగా మారిపోయాడు. తమ్ముడేమో బాధ్యతను తన భుజాలపైనే వేసుకొని, బతుకును బంగారంగా మార్చుకున్నాడు. మనకు ఏం జరిగింది అనే దాన్ని బట్టి కాకుండా.. జరిగిన దాని పట్ల మనం ఎలా స్పందిస్తున్నాం అనేదాన్ని బట్టే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇతరులను, పరిస్థితులను నిందించడం, సాకులు చెప్పడం ద్వారా మనం బాధ్యత నుంచి తప్పుకుంటున్నాం. తద్వారా జీవితాలను మార్చుకొనే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంటున్నాం.
 
నిమ్మరసం చేయడం నేర్చుకోవాలి
 
‘జీవితం నీకు నిమ్మకాయ ఇస్తే.. దాంతో నిమ్మరసం చేసుకోవడం నేర్చుకో..’ అనే సామెత ఉంది. నిమ్మకాయలో చేదు కూడా ఉంటుంది. చేదు తగలకుండా రసాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. పరిస్థితులు కూడా అలాంటివే. వాటిలో చెడును వదిలేసి, మంచిని గ్రహించడం మన చేతుల్లోనే ఉంది.
 
నిందలు, సాకులు మానేయండి

 
పరిస్థితులపై నిందలేయడం, సాకులు వెతకడం ఈరోజే మానేయండి. అదృష్టం, తలరాత, తల్లిదండ్రులు, టీచర్లు, యజమానులు.. మీ జీవితానికి వీరిని బాధ్యులను చేయకండి. మిమ్మల్ని మీరే బాధ్యులను చేసుకోండి. అనుకున్నది సాధించి చూపండి. మీ మనస్సు అనే కాక్‌పిట్‌లో ఒకే సీటు ఉంది. అందులో ఏ పైలట్‌ను కూర్చోబెడతారు. బాధ్యత నుంచి తప్పించుకొనే సాకునా? లేక బాధ్యతనా? నిర్ణయించుకోవాల్సింది మీరే.
 
-‘కెరీర్‌‌స 360’ సౌజన్యంతో..

 
 ప్రకాశ్ అయ్యర్, ఎండీ, కింబర్లీ- క్లార్క్ లీవర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement