తెంచుకోండి.. నమ్మకాల బంధనాలు | Reasons for beliefs | Sakshi
Sakshi News home page

తెంచుకోండి.. నమ్మకాల బంధనాలు

Published Sun, Mar 30 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM

తెంచుకోండి.. నమ్మకాల బంధనాలు

తెంచుకోండి.. నమ్మకాల బంధనాలు

ప్రేరణ
 
మీరు జీవితంలో ఏం సాధించగలరనేది మీలోని శక్తిసామర్థ్యాలు నిర్ణయించాలే తప్ప మీ చిన్నప్పటి నమ్మకాలు, అనుభవాలు కాదు.
 
సర్కస్‌లో ఏనుగు విన్యాసాలను చూసి మీరు ఆనందించే ఉంటారు కదా! అంతటి బలమైన జంతువు కూడా రింగ్‌మాస్టర్ చెప్పినట్టల్లా నడుచుకుంటుంది. ప్రదర్శన పూర్తయ్యాక  దాని కాలును మామూలు ఇనుప గొలుసుతో ఒక చిన్న చెక్కకొయ్యకు కట్టి ఉంచుతారు. 10 అడుగుల ఎత్తు, 5000కిలోల బరువున్న బలమైన ఏనుగుకు ఆ గొలుసును తెంచడం పెద్ద కష్టం కాదు. అయినా, ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయదు. అక్కడి నుంచి పారిపోవాలనుకుంటే గొలుసు తెంచుకొని పారిపోవడం ఏనుగుకు చేతకాదా?... ఎందుక్కాదు! కచ్చితంగా చేతనవుతుంది. మరి ఎందుకు పారిపోదు?

కొయ్యను పెకిలించి, గొలుసును తెంచుకోవడం అసాధ్యమని దాని మనసులో బలంగా ముద్రించుకుపోయింది కాబట్టి!! అలా ఎందుకు జరిగింది? పిల్లగా ఉన్నప్పుడు ఎదురైన బాధాకరమైన అనుభవం ఏనుగు మనసులో గట్టిగా నాటుకుపోయింది. ఇప్పటికీ అదే నిజమని నమ్ముతోంది. బంధనాన్ని తెంచుకొని, స్వేచ్ఛ పొందడం తనవల్ల కాదని అనుకుంటోంది.
 
సర్కస్‌లో విన్యాసాలు చేసే గజరాజుకు చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తుంటారు. అప్పుడు దాని కాలుకు బలమైన ఇనుప గొలుసును బిగించి, భూమిలోకి దిగగొట్టిన ఉక్కు కొయ్యకు కట్టేస్తారు. అక్కడి నుంచి పారిపోయేందుకు అది తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఉక్కు కొయ్యను పెకిలించి, గొలుసును తెంచేయాలని పోరాడుతుంది. కాలును లాగుతున్న కొద్దీ, ఇనుప గొలుసు కోసుకుపోతుంది. కాలులోంచి రక్తం కారి, విపరీతంగా నొప్పి పుడుతుంది. కాలిపై గాయం ఏర్పడుతుంది. పారిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ బాధాకరమైన అనుభవమే ఎదురవుతుంది. దాంతో ఇక పారిపోవాలనుకోవడం వ్యర్థ ప్రయత్నమేనని చివరికి బుల్లి ఏనుగు భావిస్తుంది. తనకు ఇక స్వేచ్ఛ లభించదని నమ్ముతుంది. అప్పటినుంచి గొలుసుతో కట్టేసిన కాలును లాగే ప్రయత్నం కూడా చేయదు. ఆ నొప్పి, అనుభవం దాని మనసులో జీవితాంతం నిలిచిపోతాయి.
 
ఏనుగు పెరిగి పెద్దదయ్యింది. దాని ఆకారం, బరువు, బలం ఎన్నో రెట్లు పెరిగాయి. అయినా దాన్నిప్పుడు మామూలు గొలుసుతో, చిన్న చెక్క కొయ్యకే కట్టేస్తున్నారు. అది ఎక్కడికీ పారిపోదని తెలుసు కాబట్టే అలాంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగు తన బలమేంటో తెలుసుకోవడం లేదు. గొలుసు ఎంత పొడవుంటే అంత వరకే వెళ్తోంది తప్ప దాన్ని లాగేసే ప్రయత్నం చేయడం లేదు. అది తన ప్రస్తుత దుస్థితి నుంచి విముక్తి పొందలేకపోతోంది. రింగ్‌మాస్టర్ చేతిలో దెబ్బలు తింటూ అతడు చెప్పినట్టల్లా చేస్తోంది.  
 
మనుషుల్లోనూ గజ బలం!

ఏనుగు కష్టాలకు కారణమేంటో తెలిసిందా?చిన్నప్పటి అనుభవాన్ని, నమ్మకాన్ని ఇంకా పట్టుకొని వేలాడ్డమే దాని దుస్థితికి కారణం. మనందరం కూడా సర్కస్ ఏనుగులాంటి వాళ్లమే. మనలో కూడా నమ్మశక్యం కానంత బలం దాగి ఉంది. అలాగే మనం ధైర్యంగా ముందుకెళ్లకుండా బంధిస్తున్న గొలుసులు, చెక్క కొయ్యలు కూడా ఉన్నాయి. మనసుల్లో ఎప్పుడో ఏర్పడ్డ నమ్మకాలు, అనుభవాలు మనుషులను బంధించి ఉంచుతున్నాయి. అవి వారిని వారే తక్కువ అంచనా వేసుకునేలా చేస్తున్నాయి.

చిన్నతనంలో ఏర్పడ్డ ఒక్క నమ్మకం, ఎదురైన అనుభవం, పలకరించిన ఒక చిన్న వైఫల్యం, ఎవరో చెప్పిన ఒక విషయం.. ఇలాంటివన్నీ ఇనుప గొలుసులుగా, చెక్క కొయ్యలుగా మారిపోతున్నాయి. మనుషులు తమ శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా చేస్తున్నాయి. చేయగలిగే పనిని కూడా చేయకుండా ఆపుతున్నాయి. సాధించగలిగే విజయాలను సాధించకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు నిజాయతీగా ప్రశ్నించుకోండి. మిమ్మల్ని వెనక్కి లాగుతున్న ఇనుప గొలుసులు, చెక్క కొయ్యలు ఏమిటో తెలుసుకోండి. నువ్వు ఆ పని చేయొద్దు, నీ వల్ల కాదు, నీకు అంత సత్తా లేదు, నువ్వొక దద్దమ్మ, నీలో తెలివి తేటలు లేవు.. బాల్యంలో చాలామంది ఇలాంటి మాటలు అనిపించుకున్నవారే! దురదృష్టం ఏమిటంటే.. వాటిని నిజమేనని నమ్మేస్తుంటారు.

తమలో నిజంగా ఎలాంటి శక్తిసామర్థ్యాలు లేవని, బలహీనులమని అనుకుంటారు. జీవితాంతం అదే భ్రమలో బతికేస్తుంటారు. తమ అపజయాలకు కారణాలు వెతుక్కుంటారు.  పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారినా, ఉక్కు కొయ్య స్థానంలో చెక్క కొయ్య వచ్చినా.. ఆ విషయం కూడా తెలుసుకోలేరు. ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నా చేయలేరు. ‘నా వల్ల కాదు’ అనే పాత నమ్మకమే వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది.
 
బలహీనులుగా మార్చొద్దు


మనుషులు కొన్నిసార్లు ఏనుగుల శిక్షకుడి పాత్రను పోషిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు, ఉపాధ్యాయులు విద్యార్థులకు, మిత్రులు తమ సహచరులకు తెలిసో తెలియకో బలహీనతను నూరిపోస్తుంటారు. తద్వారా వారికి మేలు చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. ఇది తప్పు ఆలోచన. మీ కింద ఉన్నవారిని, సహచరులను ఇనుప గొలుసుతో కట్టేయాలని చూడకండి. తాము నిజంగానే బలహీనులమని వారు భ్రమపడేలా చేయకండి.
 
సంకెళ్ల నుంచి విముక్తి చెందండి

ఏనుగులో ఉన్నంత బలం మనుషుల్లోనూ ఉందని నమ్మండి. ఇనుప గొలుసులకు, చెక్క కొయ్యలకు లొంగిపోకండి. మీరు ముందుకెళ్లకుండా బంధించి ఉంచుతున్న నమ్మకాలను పటాపంచలు చేయండి. మీరు జీవితంలో ఏం సాధించగలరనేది మీలోని శక్తిసామర్థ్యాలు నిర్ణయించాలే తప్ప మీ చిన్నప్పటి నమ్మకాలు, అనుభవాలు కాదు. చెక్క కొయ్యను విరిచేయండి, ఇనుప గొలుసును తెంచేయండి.. మీ పాత భావనల నుంచి విముక్తి పొందండి. అనుకున్నది సాధించి చూపండి.. స్వేచ్ఛగా!!           
-‘కెరీర్స్ 360’ సౌజన్యంతో..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement