Happiest Man In Thailand Jon Jandai Motivational Speech In Telugu - Sakshi
Sakshi News home page

నా పేరు జోన్ జండాయ్‌; అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..

Published Sat, Aug 27 2022 4:54 PM | Last Updated on Sat, Aug 27 2022 7:29 PM

Thailand Happiest Person Jon Jandai Inspirational Speech in Telugu - Sakshi

జోన్ జండాయ్ (పిక్‌: ఫేస్‌బుక్‌)

నేను నా జీవితంలో పొందే అతి కొన్ని చిరాకులతో పాటు అత్యంత ఎక్కువ సంతోషాన్ని ఎప్పుడూ పొందుతూనే ఉన్నాను. నిన్నటి నా జీవితం నాకు జోన్ జండాయ్ ని బహుమతిని చేసింది. తెలుసుకున్న కొద్ది జీవితాన్నిమరింత సంతోషంలో ముంచెత్తే సాధారణ జీవన దూత ఈయన. జోన్ జండాయ్ ఒక రైతు, థాయ్‌లాండ్‌లో కెల్లా అత్యంత సంతోషకరమైన వ్యక్తి గా ప్రపంచం ఈయనను తెలుసుకుంది. జోన్ జండాయ్ థాయ్‌లాండ్‌లోని యాసోథార్న్ రాష్ట్రానికి  చెందినవారు. ఈయన వ్యవసాయం చేస్తారు. ఇంకా మట్టి గృహాలను నిర్మిస్తారు. 2003 లో పన్ పన్‌ అనే విత్తన సంరక్షణ సంస్థను స్థాపించారు. జోన్ జోండాయ్ చేసిన ఒక ప్రసంగ పాఠాన్ని విని ఎంత సంతోష పడ్డానో మాటల్లో చెప్పలేక ఈ ఆనందాన్ని నలుగురితో పంచుకోడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ వ్యాస రూపం. - అన్వర్

జీవితంలో నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది, ఎప్పటికి చెప్పగలిగేది ఒకే ఒక మాట ఉంది. అది ఏమిటంటే " Life Is Simple". అవును జీవితం అత్యంత సులభమైనది, సరదా అయినది. "జీవితం సులభం" అనే  సులభతరమైన విషయం తెలుసుకోవడం మాత్రం నాకు అంత సులభంగా జరగలేదు. నేను ఇంతకు మునుపు  బ్యాంకాక్‌లో ఉండేవాడిని. అక్కడ  ఉన్నప్పుడు నా జీవితం చాలా కష్టంగా, చాలా చాలా సంక్లిష్టంగా ఉండేది. "జీవితం సులభం" అనే  విషయం గురించి నేను ఇంతకు ముందు ఎప్పుడూ  ఆలోచించలేదు, ఆలోచించడానికి సమయం కూడా నాకు అప్పుడు లేదు.


నా పేరు జోన్ జండాయ్. నేను ఈశాన్య థాయ్‌లాండ్ ప్రాంతంలోని ఒక చిన్నగ్రామంలో జన్మించాను. నా చిన్నప్పుడు మా ఊరు, ఆ వాతావరణం, గాలి, మాట, వెలుతురు, పలకరింపు.. ప్రతీది సరదాగా, సులభంగా ఉండేది. అప్పుడు జీవితం సహజంగా ఉండేది కాబట్టి జీవితం అనేది సులభం అనే ఎరుక నాకు అప్పుడు లేదు. అత్యంత సహజమైన మానవ జీవితపు లక్షణాలు ఎప్పుడు ప్రత్యేక ఎరుక అయి ఉండవు కదా.  ఒక రోజు మా ఊరికి టెలివిజన్ వచ్చింది. ఆ టీవి తో పాటు దానికి తీసుకు వచ్చిన పట్నవాసపు మనుషులూ వచ్చారు. ఆ యంత్రం, దానిని నడిపేవారు ఇద్దరూ కలిసి మాకు మునుపు తెలియని, ఆలోచించని, అసలు ఆ జ్ఞానమే లేని ఒక కొత్త మాట మాకు నేర్పారు "ఒరే! నాయనా మీరు మీరు కడు పేదవారు, కటిక దరిద్రులు. మీ జీవితాంతం వరకు మీరు ఇలా దరిద్రపు గొట్టుగా ఉండనక్కర లేదు. మీరు మేల్కోవాలి. మీ  జీవితంలో విజయాన్ని వెంబడించాలి, విజయం యొక్క అయిదు మెట్లు ఎక్కాలి.  ఆ అయిదు మెట్లు ఎక్కడానికి మీరు బ్యాంకాక్ వెళ్లాలి" అని చెప్పారు. (నేను మా నూనెపల్లె నుండి హైద్రాబాద్ వరకు దేకినట్లు అన్నమాట) కాబట్టి నేను బ్యాంకాగ్ వచ్చాను, నేను కడు దరిద్రుడిని అని తెలుసుకోడం నాకు ఎంతో  చెడుగా అనిపించింది. నేను కటిక పేదరికం వాడిని అని తెలుసుకోడం నా మనసుకు భరించరాని కష్టం వేసింది. కాబట్టి ఎట్టి పరిస్తితుల్లో నేను బ్యాంకాక్‌కు వెళ్లాలి విజయం సాధించాలి. నేను బ్యాంకాక్‌కి  వెళ్ళాలని నిర్ణయించుకోవడం.. అక్కడికి  చేరుకోవడం అప్పుడు నాకు చాలా గొప్పగా, గర్వంగా ఉండిది.

మనం చాలా నేర్చుకోవాలి, గొప్ప చదువు చదువుకోవాలి మరియు చాలా కష్టపడాలి. అలా చేస్తూ ఉంటే  ఆ పై మీరు విజయం సాధించవచ్చు అనే మాటలు పదే పదే నా చెవుల్లో ధరించిన నిత్య మంత్రాలు అయ్యాయి. అందుకని నేను చాలా కష్టపడటం ప్రారంభించాను. రోజుకు ఎనిమిది గంటలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండేవాన్ని. అంత కష్టపడి పని చేసి చివరికి నేను భోజనానికి సంపాదించుకున్నది కేవలం ఒక కప్పు నూడుల్స్ మాత్రమే. లేదా గిన్నెడు ఫ్రైడ్ రైస్.  ఇంకా బ్యాంకాగ్ లో నేను నివసించిన గది ఎలా ఉండేది అనుకున్నారు! అది చాల చెడ్డగా ఉండేది. మహా మురిగ్గా ఉండేది. భరించలేనంత వేడిగా ఉండేది . ఆ వేడితో పాటు నాతో పాటు ఆ గది పంచుకుని ఉన్న చాలా మంది ఊపిరి వేడి . ఇటువంటి పరిస్తితుల మధ్య నేను ఇంకా చాలా తీవ్రంగా కష్టపడటం మొదలుపెట్టాను. నాకు అప్పుడు ఓ అనుమానం కలిగింది. కష్టపడి పని చేయడం అనే సూత్రం వెనుక ఏదో తేడా ఉందని నాకు అనిపిచింది. నేను ఇంత కష్టపడి పనిచేస్తూ పోతున్న కొద్దీ నా జీవితం సులువు కావాలి కదా!  కానీ ఇంకా ఎందుకు కష్టతరమవుతుంది? గిన్నెడు అన్నం, కాళ్ళు చాపుకోడానికి తగినంత స్థలం లేని గది ప్రాప్తం అవుతుంది ఎందుకని? కాబట్టి ఎక్కడో ఏదో తప్పుగా ఉండాలి. ఎందుకంటే నేను కష్టపడి పని చేసి చాలా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాను కానీ నేను వాటిని నా వినియోగం కోసం పొందలేను. నేను సంపాదించే డబ్బుతో అవేమి కొనగలిగే శక్తి నాకు సమకూరడం లేదు. ఒక్క వళ్ళు వంచి పని చెయ్యడమే కాదు, నేను బుర్రా ఉపయోగించి చదువు, జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నించాను. విద్యని అధ్యయనం చేయడానికి ప్రయత్నించాను. నేను యూనివర్సిటీలో చదువుకోవడానికి బయలుదేరాను. కానీ యూనివర్సిటీలో నేర్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే చదువుకోవడం అనే పనిని విద్యాలయాలు చాలా బోరింగ్ చేసి పెట్టాయి. నేను ఇక్కడ ఈ చదువుల భవనాల్లోని ప్రతి అధ్యాపకుడిలోను, వారు విశ్వవిద్యాలయంలో బోధించే విషయాలను చూసినప్పుడు, వారిలో చాలామందికి ఉన్నదంతా విధ్వంసక జ్ఞానం. నాకు యూనివర్సిటీలో ఉత్పాదక జ్ఞానం అసలు దొరకలేదు.

ఒక ఆర్కిటెక్చర్ లేదా ఇంజినీర్ కావడం అంటే అర్థం ఏమిటంటే.. మీరు ఈ భూమిని, ఈ సహజ సంపదని మరింత, వీలయినంత మరింత ఎక్కువ నాశనం చేసేవారిగా తయారు కావడం. ఈ విధ్వంసక వాస్తువేత్త వ్యక్తులు ఎంత ఎక్కువ తయారు అయితే వారు అంత ఎక్కువ పనిచేసి ఈ భూమి మీది, పర్వతాలు, నదులు, అడవులు మరింత నాశనం చేయడమే అన్నమాటే. ఈ పచ్చదనాన్ని, ఈ సహజ వర్ణాలని తమ బూడిదరంగు మెదడుల న్నుండి బయటికి తీసిన జ్ఞానంతో కొలతలు వేసి ఈ ప్రపంచమంతా కాంక్రీట్ నింపడం. కనుచూపు మేర అంతా బూడిద రంగు, బూడిద రంగు బిల్డింగులు, బూడిద రంగు రోడ్లు, బూడిదరంగు ఆకాశం, బూడిద రంగు జ్ఞానం.. భూమికి బూడిద రంగు కట్టడపు పన్ను, చెరువులోని నీటికి ఇంటి ట్యాంకర్ లలో బంధించిన పన్ను. వ్యవసాయానికి పురుగు మందుల విషపు పన్ను.

జీవితం చాలా కష్టంగా ఉంది నేను నిరాశకు గురయ్యాను. నేను ఆలోచించడం మొదలుపెట్టాను, నేను అసలు బ్యాంకాక్‌లో ఎందుకు ఉండాలి? నా చిన్నప్పుడు మా పల్లెలో ఎవరూ  రోజుకి ఎనిమిది గంటలు పని చేయడం నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ప్రతి ఒక్కరూ రోజుకు  రెండు గంటలు, సంవత్సరానికి  కేవలం రెండు నెలలు పనిచేశారు, ఒక నెలలో వరినాట్లు నాటడం, మరో నెలలో వరి కోయడం అనేదే పని. మిగిలినది అంతా  ఖాళీ సమయం, పది నెలల ఖాళీ సమయం. అందుకే  మా థాయ్‌లాండ్‌లో ప్రజలు చాలా పండుగలను కలిగి ఉన్నారు. ప్రతి నెలా మాకు ఒక పండుగ ఉంటుంది. ఎందుకంటే జీవితం గడపడానికి, జీవితాన్ని పండగ చేసుకొడానికి అక్కడ చాలా ఖాళీ సమయం ఉంది. జీవితం పండగ కావడం కన్నా జీవితం మరింకేం కోరుకుంటుంది?

అక్కడ  రాత్రి పూటే కాదు మధ్యాహ్నపు భోజనం ముగించి ప్రతి ఒక్కరూ కూడా నిద్రపోతారు. (మా నూనెపల్లెలో వర్షాలు పడే రాత్రిళ్ళు తప్పనిస్తే, మేము ఎప్పుడూ ఇంటి గోడల మధ్యనో, తడికల మధ్యనో నిద్ర పోయిందే లేదు. నిద్ర అంటే అంతా మా ఊరి రోడ్ల మీదే, రాత్రుల్లు మా ఊరి దారులన్ని మంచాలు మొలిచిన పొలాల్లా ఉండేవి. ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు అయితే అర్ధరాత్రి ఊరి సెంటర్ లో టీ తాగడానికి అని పోతూ పోతూ తన ఇంటి రోడ్డు ముందు నిద్రపోతున్న మనిషిని మంచంతో సహా లేపుకు వెళ్ళి మరో ఇంటిముందు దింపేవాళ్ళం, కొంటెగా. ఆ ఇంటి ముసలమ్మ మా ఇంటి ముసలమ్మతో రాత్రంతా కబుర్లు చెప్పుకోడానికి మనవడితో మంచం మోపించుకు వచ్చి ఈ మంచం పక్కన ఆ మంచం కుదిర్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయేవారు. పిల్లలూ అంతే చంకలో దుప్పటి దిండు పెట్టుకుని పక్కింటి నేస్తుడితో మహా మహా ముచ్చట్లు ఆడటం లేదా రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం వింటూ అక్కడే బజ్జోడం. అర్థరాత్రి దాటాకా మనుషులు, మంచాలే కాదు మా ఊరి రహదారులూ, జట్కా బళ్ళు, సైకిల్ రిక్షాలు అన్నీ నిద్ర పోయేవి. కేవలం కీచు రాళ్ళ చప్పుడు, లేదా అప్పుడప్పుడు కప్పల బెకబెకలు. ఇప్పుడు రోడ్డులకు అసలు నిద్ర లేదు. రోజుకు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక బండి గాన్లు దాన్లను తొక్కుతూనే పోతుంటాయి. హారన్లు రోడ్డులను దోమల్లా కుడుతూనే ఉంటాయి)

మధ్యాహ్న భోజనానంతర నిద్ర  మేల్కొన్న తర్వాత హాయిగా మేం వీధి అరుగులపై కూచుని కేవలం కబుర్లు చెప్పుకుంటాం. ముచ్చట్లు ఆడుకుంటాం. దారిన పోయే అందరి యోగక్షేమాలు విచారిస్తాం "ఏం బ్బా!  మీ అల్లుడు ఎలా ఉన్నాడు, మీ భార్య, కోడలు ఎలా ఉన్నారు, మీ కోడి, మేకా ఎలా ఉన్నాయి" ఊళ్ళో జనాలకు  ఏం ఉన్నా లేకపోయినా చాలా సమయం ఉండేది. వారికి  తమతో తాము ఉండటానికి సమయం ఉంది. తమతో తాము ఉండటానికి సమయం ఉన్నప్పుడు మనిషికి తనను తాను అర్థం చేసుకోడానికి సమయం ఉంటుంది. ప్రజలు తమను తాము అర్థం చేసుకున్నప్పుడు వారు తమ జీవితంలో ఏమి కోరుకుంటున్నారో సులభంగా, స్పష్టంగా గ్రహించగలరు.

చాలా మంది ప్రజలు తమకు ఆనందం కావాలి, ప్రేమ కావాలి.. తమ జీవితాలను హాయిగా సంపూర్ణంగా ఆస్వాదించాలని కోరుకుంటారు, తీరిక, తీరుబడి ఉన్న ప్రజలు తమ జీవితంలో చాలా అందాలను చూస్తారు కాబట్టి వారు ఆ అందాన్ని అనేక విధాలుగా వ్యక్తం చేసేవారు. కొంతమంది హాయిగా ఇంటి బయట కూచుని తమ కత్తి పిడిని నునుపు చేసుకునే వారు, వాటిపై బొమ్మలు చెక్కేవారు, బుట్టా, గంప చక్కగా అల్లుకునేవారు, తడికలకు, చాటలకు కాగితపు గుజ్జు పసుపు అలికేవారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా చేయడం లేదు. ప్రజలు ప్రతి చోటా ప్లాస్టిక్‌ని ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ పీలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ఈ జీవితంలో ఏదో తప్పు ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నేను ఈ విధంగా జీవించలేను కాబట్టి నేను యూనివర్సిటీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకని తిరిగి నా చిన్న ఊరికి తిరిగి వెళ్ళాను. నేను ఇంటికి తిరిగి వచ్చి నేను చిన్నతనంలో ఉన్నట్లుగా, నాకు గుర్తుండేలా జీవించడం మొదలుపెట్టాను. నేను ఇక్కడ సంవత్సరానికి రెండు నెలలు పని చేయడం ప్రారంభించాను. వ్యవసాయంలో నాకు నాలుగు టన్నుల బియ్యం వచ్చింది. మేము మొత్తం మా  కుటుంబంలో ఉన్నది ఆరుమందిమి. మేమంతా కలిపి సంవత్సరానికి అర టన్ను కంటే తక్కువ తింటాము. కాబట్టి మిగిలిన బియ్యాన్ని అమ్మవచ్చు. ఇంకా నేను రెండు చిన్న చేపల చెరువులు తీసుకున్నాను. మాకు ఏడాది పొడవునా తినడానికి హాయిగా చేపలు ఇక్కడ దొరుకుతాయి. అంతే కాక  నేను నాకున్న అర ఎకరం కంటే తక్కువ చిన్న స్థలంలో ఒక చిన్న తోటను కూడా వేసాను. తోట పని కోసం రోజుకు 15 నిమిషాలు గడుపవలసి వస్తుంది. నేను ఈ  తోటలో 30 కంటే ఎక్కువ రకాల కూరగాయలను పండిస్తున్నాను. అన్ని కూరగాయలను మేం ఆరుగురం ఎట్లాగో తినలేం కాబట్టి మాకు కావలసినవి కొన్ని ఉంచుకుని మిగతా వాటిని మార్కెట్‌లో అమ్మడం వల్ల  కొంత ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. జీవితం ఇక్కడ చాలా సులభం. నేను ఏడేళ్లపాటు బ్యాంకాక్‌లో ఉండాల్సి వచ్చింది. గంటల తరబడి  కష్టపడి పని చేశాను, అంత కష్టపడి పని చేసినా సంపాదించుకున్నది తినడానికి సరిపోలేదు.. కానీ ఇక్కడ, సంవత్సరానికి రెండు నెలలు మరియు రోజుకు 15 నిమిషాలు మాత్రమే పనిచేసి నేను ఇంట్లో ఆరుగురికి ఆహారం ఇవ్వగలను. జీవితం అంటే సులువుగా ఉండటం.

ఇంకో ముఖ్యమైన విషయం. చిన్నతనంలో స్కూల్లో ఎప్పుడూ మంచి గ్రేడ్ సాధించని నాలాంటి తెలివితక్కువవారికి జీవితంలో ఇల్లు అనేది రాసిపెట్టి ఉండదని నేను అనుకున్నాను. నేనే కాదు ఇది చాలామంది అభిప్రాయం కూడా. ఎందుకంటే నాకంటే తెలివైనవారు, ప్రతి సంవత్సరం క్లాసులో నంబర్ వన్ అయిన వారు మంచి ఉద్యోగం పొందుతారు. మంచి ఉద్యోగం వల్ల మంచి వేతనం లభిస్తుంది. కాబట్టి అటువంటి వారు ఒక స్వంత ఇల్లు పొందడానికి అత్యంత అర్హులు.

కానీ నాకు, నావంటి యూనివర్సిటి చదువు పూర్తి చేయలేని వారు కూడా ఒక ఇంటిని కలిగి ఉంటారా? నాలాంటి, తక్కువ విద్య ఉన్న వ్యక్తులకు ఇల్లు అనేది ఒక ఆశాజనకపు ఎప్పటికీ పూర్తి కాని కల. కానీ, ఇక్కడ నా పేద గ్రామంలో నాకడుపుకు, కుటుంబ అవసరాలకు ఆహార ఉత్పత్తి సాధించిన నేను ఇప్పుడు భూసంబంధమైన భవనాలు చేయడం ప్రారంభించాను, ఇళ్ళు కట్టడం అంటారా అది చాలా సులభం అయింది నాకు ఇక్కడ. నేను రోజూ ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, రెండు గంటల సమయం ఇల్లు కట్టడానికి వెచ్చించాను. మూడు నెలల సమయంలో నాకు స్వంత ఇల్లు వచ్చింది. మట్టి, రాయి, గడ్డి, వెదురు కలిస్తే ఇల్లు. నేను చదువుకునేప్పుడు నా క్లాస్‌లో అత్యంత తెలివైన స్నేహితుడు ఒకరు, అతను తన ఇంటిని నిర్మించడానికి నాకు లాగానే మూడు నెలల సమయం తీసుకున్నాడు. ఆ ఇంటికి  గృహ సంబంధమైన వస్తు సంచయంతో పాటు అప్పులూ చేయాల్సి వచ్చింది. అతను 30 సంవత్సరాల పాటు తన అప్పు చెల్లించాలి. కాబట్టి, అతనితో పోలిస్తే, నాకు 29 సంవత్సరాల 10 నెలల ఖాళీ సమయం అనేది మిగిలింది. జీవితం అనేది సులభమైనది. ఈ సులభమైన జీవితాన్ని దానిపై అప్పులు, వడ్డీల ఋణం వేసి బరువుగా ఎందుకు బ్రతుకుతున్నాము మనం. 


నా మొదటి ఇల్లు కట్టేంత ముందు వరకు కూడా అంత తేలికగా, సులువుగా ఒక ఇల్లు నిర్మించవచ్చని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పుడు  కనీసం ప్రతి సంవత్సరం నేను ఒక ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కానీ ఇల్లు మాత్రం నాకు చాలా ఉన్నాయి. సమస్య అల్లా ఈ రాత్రి నేను ఏ ఇంట్లో నిద్ర పోవాలి అనేదే. కాబట్టి, ఇల్లు అనేది ఒక  సమస్య కాదు, ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు. మా దగ్గర చిన్న పిల్లలు, 13 సంవత్సరాల వయస్సు వాళ్ళు ఒక పాఠశాల కట్టుకున్నారు. అదీను వారు స్వంతంగా చేసుకున్న ఇటుకలను ఉపయోగించి తరువాత నెలలో ఆ పాఠశాలకు ఒక లైబ్రరీ కూడా. కాబట్టి ఇల్లు కట్టుకోడం పెద్ద విషయం కాదు మమ్మల్ని చూసి ఒక ముసలి సన్యాసిని కూడా ఆమె కోసం ఒక గుడిసెను నిర్మించుకున్నది కాబట్టి జీవితం లాగే, ఇల్లూ కూడా సులభం, మీరు నన్ను నమ్మకపోతే పోనీ, మీరూ ఒకమారు ప్రయత్నించండి. జీవితం అంటే, నివాసం అంటే, హాయిగా బ్రతకడం చాలా సులువు.

ఇంటి తరువాత తదుపరి విషయం దుస్తులు. నేను అందగాడిని కాదు కాబట్టి అందంగా కనిపించడానికి ఖరీదయిన దుస్తులు ధరించడం ఒక మార్గం అనిపించింది. బాగా కనిపించడం కోసం. నేను నాకు నచ్చిన ఒక సినీ నటుడిలా దుస్తులు ధరించడానికి ప్రయత్నించాను. అందుకని ఒక జత జీన్స్ కొనడానికికని డబ్బు ఆదా చేయడానికి ఒక నెల బాగా కష్టపడ్డాను. చివరికి ఆ దుస్తులు కొని వాటిని ధరించి అద్దంలో చూసుకుంటూ నేను ఎడమవైపు నుండి కుడివైపుకు తిరిగాను. కుడి నుండి ఎడమవైపుకు మళ్ళాను. అద్దంలో నా చుట్టూ నేను తిరిగాను. నేను చూసిన ప్రతిసారీ నేను ఒకే వ్యక్తిని, ఆ పాత నేనుని మాత్రమే చూసాను. ఒక నెలపాటు చెమట రక్తం ధారవోసి కొన్న అత్యంత ఖరీదైన ప్యాంటు, చొక్కా కూడా  నా మొహాన్ని, జీవితాన్ని మార్చలేదు. అద్దంలో కనబడిన నాకు నేను చాలా వెర్రివాడిని అనిపించింది.

ఖరీదయిన దుస్తుల కొసం, అత్యంత ఆధునిక పొకడల వస్త్రాల వెంట పరిగెట్టి డబ్బు ఎంతగానయినా కూడపెట్టండి. అది మనల్ని ఏమాత్రం మార్చలేదు. నేను దాని గురించి మరింత తెలుసుకోవడం, ఆలోచించడం మొదలుపెట్టాను. మనం ఎందుకని  ఫ్యాషన్‌ని అనుసరించాలి? ఆలోచించిన కొద్ది నాకు జవాబు దొరకలేదు. వంటిని కాపాడటమే దుస్తుల కేవల ఉద్దేశం.  ఆ తర్వాత, 20 సంవత్సరాల వరకు, నేను ఏ బట్టలు కొనలేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న బట్టలన్నీ ప్రజల నుండి వచ్చినవే ప్రజలు నన్ను సందర్శించడానికి వచ్చినప్పుడు, మరియు వారు ఇక్కడి నుండి వెళ్ళేప్పుడు వారు ఇక్కడ చాలా దుస్తులను వదిలివేస్తారు. కాబట్టి నా దగ్గర ఇప్పుడు టన్నుల కొద్దీ బట్టలు ఉన్నాయి. ఏం చేస్తాం? వద్దనుకున్నవి ఎంత ఉండినా ఏం ప్రయోజనం. ఇలా ఆలోచించినప్పుడు నాకు మరింత స్వేచ్ఛగా అనిపిస్తుంది. అవసరానికి మించి ఏదీ వద్దు అనుకోవడంలో ఉన్నస్వేచ్చ మరి ఎందులో లేదు. 

ఇక  చివరి విషయం ఏమిటంటే, అనారోగ్యం. నేను  జబ్బుపడినప్పుడు సంగతి. అప్పుడు ఏమి చేయాలి? నేను నా పాత జీవితాన్ని  కొత్త గా మొదలు పెట్టేముందు అంత సులువుగా మొదలు కాలేదు, దాని గురించి  చాలా ఆందోళన చెందాను, ఎందుకంటే  నా దగ్గర డబ్బు లేదు, మందు మాకులు, వైద్యం, ఆస్పత్రి.. వీటి ఖర్చులు!  నేను దీని గురించీ ఆలోచించడం మొదలుపెట్టాను, మానవుడికి అనారోగ్యం సాధారణమైనది, అనారోగ్యం అంత  చెడ్డ విషయం ఏమీ కాదు. అనారోగ్యం అయింది అంటే దాని అర్థం- మన జీవితాల్లో, మనం గడుపుతున్న జీవిత విధానంలో మనం ఏదో తప్పు చేశామని మన శరీరం మనకు  గుర్తుచేసే విషయం. అందుకే మనం అనారోగ్యానికి గురవుతాము. కాబట్టి, నాకు జబ్బు వచ్చినప్పుడు, నేను కాస్త  ఆగిపోయి నా దగ్గరకు నేను రావాలి. దాని గురించి కాస్త ఆలోచించాలి. ఇదిగో ఇది నేను చేసిన తప్పు. కాబట్టి ఈ తరహా పని మరలీ చేయరాదు. డబ్బు లేకపోతే ఏవుంది, నన్ను నేను నయం చేసుకోవడానికి నీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. భూమి, దాని మన్ను నన్ను స్వస్థపరచడానికి ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. నాకు ఇది ఆరోగ్య స్వేచ్ఛ లాంటిది అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఉన్న జీవిత విధానంలో  స్వేచ్ఛగా ఉన్నాను. నేను దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందను. నాకు భయం తక్కువ, నా జీవితంలో నేను కోరుకున్నది నేను చేయగలను. మునుపు గడిపిన బ్యాంకాగ్ జీవితం నాకు చాలా భయం కల్పించింది, దాని నీడన నేను ఏమీ చేయలేకపోయాను. కానీ, ఇప్పుడు నేను స్వేచ్ఛగా భావిస్తున్నాను, నన్ను నేను ఈ భూమిపై ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా అనుకుంటున్నా, నాలాగా ఎవరూ లేరు, నన్ను నేను ఎవరిలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. విజయానికి అడుగెట్టాల్సిన ఏ మెట్టు వెదకవలసిన అవసరం లేదు. నన్ను పోగొట్టుకుని ఎవరినో ధరించడానికని పూనుకుని అన్వేషణకు బయలుదేరాల్సిన అవసరమూ లేదు. 

ఆహారం, ఆవాసం, ఆరోగ్యం ఆ తర్వాత ఇక ఏం చేయాలి? నేను బ్యాంకాక్‌లో ఉన్నప్పటి  జీవితపు మనస్థితి  గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, నా జీవితంలో అప్పుడు  చాలా చీకటిగా అనిపించింది. ఆ సమయంలో చాలా మంది నాలాగే ఆలోచిస్తారని, అలోచిసూ ఉంటారని నేను ఆలోచించడం మొదలుపెట్టాను.  కాబట్టి, నావంటి భావసారూప్యత కల వారిమి కలిసి చింగ్ మాయిలో "పన్ పన్ 'అనే కార్యశాలని ప్రారంభించాము (చియాంగ్ మాయి పర్వత ఉత్తర థాయ్‌లాండ్‌లోని ఒక నగరం.) మా ఆలోచనల ప్రధాన లక్ష్యం కేవలం విత్తనాన్ని సేకరించడమే! విత్తనాన్ని కాపాడటమే.! విత్తనం అంటే  ఆహారం, ఆహారం అంటే  జీవితం. విత్తనం లేకపోతే, జీవితం లేదు. విత్తనం లేదంటే స్వేచ్ఛ లేదు. విత్తనం లేకపోతే  ఆనందం లేదు. ఎందుకంటే మన జీవితం ఆహారం పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని కాపాడటం చాలా ముఖ్యం. అందుకే విత్తనాల పొదుపుపై ​​దృష్టి పెట్టాం. ఇది "పన్ పన్‌లో "ప్రధానమైనది. విత్తనం తరువాత రెండవ విషయం ఏమిటంటే ఒక కూడిక కేంద్రాన్ని నెలకోల్పడడం. ఇది ఒక అభ్యాస కేంద్రం. ఇదెందుకు అంటే, మనం జీవితాన్ని మళ్ళీ నేర్చుకోవడానికి, జీవితాన్ని సులభతరం చేసుకోడం తెలుసుకోవడానికి అన్నమాట. ఎందుకంటే మనం ఈ జీవితాన్ని వీలయినంత సంక్లిష్టంగా మరియు గొప్ప కంగాళిగా ఎలా గడపాలో నేర్పించాము. దానిని ఇప్పుడు ఆ సంక్లిష్టత బారినుండి విముక్తం చేయాలి. జీవితాన్ని ఎలా సులభతరం చేయవచ్చు? చేయడం సులభం, కానీ  ఎలా సులభతరం చేయాలో చెప్పడం మాకు తెలియదు. ఎందుకంటే మనం దానిని విముక్తం చేయడానికి సూత్రాలు సులువుగా దొరకనంత చిక్కుగా చేసాము. గొలుసుల మీద గొలుసులు, ముడుల మీద ముడులు, వస్తువుల మీద వుస్తువులు... చెత్త చేసాము మనం జీవితాన్ని. అందుకని ఇప్పుడు ముడులు విప్పడం నేర్చుకోవడం మొదలుపెడదాము. అందరం కలిసి ఉండడం నేర్చుకుందాము. అన్నిటి నుండి డిస్కనెక్ట్ కావడం నేర్చుకుందాము. మనం సంతోషంగా ఉండాలంటే, మన ఆలోచనా స్వేచ్చ మనకు తిరిగి రావాలి అందుకని మళ్లీ మనతో మనం కనెక్ట్ అవ్వాలి, ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వాలి, మన మనస్సు మరియు శరీరాన్ని మళ్ళీ కలపాలి.  జీవితం అనేది సులభం. దానిని చూసి భయపడకండి. వెనక్కి రండి.

మొదలు నుండి ఇప్పటి వరకు, నేను నేర్చుకున్నది నాలుగు ప్రాథమిక అవసరాలు: ఆహారం, ఇల్లు, బట్టలు మరియు వైద్యం. ఈ నాలుగు- ప్రపంచంలో అందరికి చౌకగా మరియు అందుబాటులోకి సులభంగా ఉండాలి. నాకరికత అంటే అర్థం అదే. కానీ మనం వందలూ, వేలు కాదు ఈ కేవల నాలుగు సంఖ్హ్యల విషయాలను పొందడానికి ఈ భూమి మీద నివసించే అనేక మందికి కష్టతరం చేసి పెట్టాము. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏ విధంగా నాగరికమైనదో  దానిని చూసి మనం ఎలా గర్వంగా పడగలమో నాకు తెలియడం లేదు. ఈ భూమిపై ఇప్పుడు ఉన్నది అత్యంత నాగరికమైన యుగం అని భావించేవారు ఉన్నారు. భూమిపై చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మన దగ్గర మహా మహా విశ్వవిద్యాలయాల చదువు పూర్తి చేసిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఈ భూమిలో అసాధారణమైన అత్యంత తెలివైన వ్యక్తులు ఉన్నారు. మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు.. ఒక్కరని కాదు, రకరకాలు. కానీ, జీవితం ఎలా ఉంది అంటారు?  కష్టంగా ఉంది కష్టాతి కష్టంగా ఉంది. ఇంత కష్టం మనం ఎవరి కోసం పడుతున్నట్టు? దేనికోసం పరిగెడుతున్నట్లు?

ఈ నడుస్తున్న జీవన వ్యాకరణం తప్పు అని నాకు అనిపిస్తోంది, ఈ తరహా జీవన విధానం సాధారణమైనది కాదు, ప్రాకృతమైనది కాదు. కాబట్టి, నేను దానినుండి సాధారణ మానవ స్థితికి రావాలనుకుంటున్నాను. మనిషి ఒక సాధారణత్వానికి మరలిపోవాలి. అతను జంతువులతో సమానంగా ఉండాలి. అవును మీరు సరిగా చదివారు. జంతువులతో సమానంగా పక్షులు ఒకటి లేదా రెండు రోజుల్లో గూడు కట్టుకుంటాయి. ఎలుక ఒక్క రాత్రిలో తన నివాస రంధ్రం చేస్తుంది. కానీ సృష్టిలో మనలాంటి తెలివైన మనుషులు ఒక  ఇంటి  కోసం 30 సంవత్సరాలు గడుపుతారు. అప్పులు చేసి మరీ జీవితాన్ని క్లిష్టతరం చేసుకుంటారు. ఇంత కష్టమైన జీవితంలో కూడా  ఈ భూమి మీద వసించే  చాలామంది వ్యక్తులకు తమ  జీవితంలో ఒక  ఇంటిని కలిగి  ఉంటారని  నమ్మలేము. కాబట్టి ఇదంతా  తప్పు జరుగుతుంది. మనం మన ఆత్మను ఎందుకు నాశనం చేసుకుంటున్నాము? మనం మన సామర్థ్యాన్ని ఎందుకు అంతగా నాశనం చేసుకుంటున్నాము? ఈ ఆలోచనలో నన్ను నేను వెదుక్కుంటూ వెనక్కి వచ్చాను. నేను ఒక సాధారణుడ్ని అయ్యాను అనుకుంటున్నాను. మీరంతా సాధారణ మార్గంలో అనుకునే ఒక అసాధారణమైన రీతిలో జీవిస్తున్నారు. మీకు తెలియదు, మీకు మీ గురించి ఆలోచించే సమయం, స్వేచ్చ లేదు.  నిజానికి ఇప్పుడు ఈ రోజు నేను సాధారణంగా ఉండటానికి, మామూలుగా బ్రతకడానికి, సహజంగా ఉండేలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రజలు నన్ను ఒక అసాధారణ వ్యక్తి అనుకుంటున్నారు లేదా పిచ్చివాడు,  కానీ అదేమీ నేను పట్టించుకోను. ఎందుకంటే అది నా సమస్య కాదు వారి సమస్య.

జీవితం నాకు ఇప్పుడు సులభంగా, తేలికగా ఉంది. అది నాకు చాలు. అది నాకు చాలా ఎక్కువ. ప్రజలు ఏమైనా అనుకోవచ్చు. వారు అనుకోడాన్ని, వారి అభిప్రాయాలను మార్చడానికి, నచ్చచెప్పడానికి  నేను ఏమీ చేయలేను. నేను చేయగలిగేది ఒక్కటే, నన్ను, నా మనసును మార్చుకోవడం. నా మనస్సును నేనే నిర్వహించుకోవడం. ఎంపిక అనేది ఎవరికి వారి వ్యక్తిగత ఎన్నిక. మీకు ఏం కావాలో మీరు మీరు ఎంపిక చేసుకోవచ్చు. సులభంగా నుండి కష్టంగా ఉండటానికి ఎంపిక. కష్టంగా నుండి సులభంగాఉండటానికి ఎంపిక, అది మీ పై ఆధారపడి ఉంటుంది. ధన్యవాదాలు. (క్లిక్‌: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement